నిరుద్యోగులందు రాజకీయ నిరుద్యోగులు వేరయా.. అని చెప్పుకోవాలిప్పుడు. అవును నిజం, ఏ పార్టీ అయినా ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగులకు వరాల జల్లు కురిపించడం మామూలే. అయితే అది ఉత్త హామీ మాత్రమే. దురదృష్టవశాత్తూ ఎవరైనాసరే అధికారంలోకొచ్చాక, నిరుద్యోగుల్ని సమాజానికి పట్టిన చీడపురుగుల్లా చూడటం ఆనవాయితీగా మారిపోయింది. 'ఎన్నికల్లో హామీ ఇచ్చారు.. అధికార పీఠమెక్కాక మర్చిపోయారు..' అంటూ నిరుద్యోగులు రోడ్డెక్కితే, వారిపై ప్రభుత్వాలు లాఠీలు ఝులిపించడమంటే, దానర్థం అదే కదా.!
ఫలానా పార్టీ అధికారంలోకి వస్తే తమకు ఉద్యోగాలొస్తాయని యువత, ఆయా పార్టీలకు మద్దతుగా నిలవడం, ఆ తర్వాత అవమానాలు ఎదుర్కోవడం షరామామూలు వ్యవహారమైపోయింది. అదే రాజకీయ నిరుద్యోగుల్నే తీసుకుంటే, వారికి మాత్రం ఎంచక్కా ఉద్యోగాలు దొరుకుతుంటాయి. రాజ్యసభ సీట్లు దొరుకుతాయి, ఎమ్మెల్యే సీట్లు దొరుకుతాయి.. రకరకాల నామినేటెడ్ పదవులు అందుబాటులో వుంటాయి. రాజు తలచుకుంటే పదవులకు కొరతేముంటుంది.? కొత్త కొత్త పదవుల్ని క్రియేట్ చేసి మరీ, రాజకీయ నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తుంటారు.
'వాళ్ళ కోసం కొత్త పదవుల్ని కల్పించి, వారిని ప్రభుత్వమే పెంచి పోషిస్తున్నప్పుడు, మమ్మల్ని ఎందుకు ఆదుకోరు..' అని సగటు నిరుద్యోగి ప్రశ్నిస్తే, లాఠీ దెబ్బలు, అవి చాలవన్నట్లు కేసులు.. వెరసి, సదరు నిరుద్యోగి జీవితం సర్వనాశనమైపోవడం. ఆంధ్రప్రదేశ్‌లో, టీడీపీ ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ భృతిపై హామీ ఇచ్చింది, ఆ హామీని తుంగలో తొక్కింది. 'మేం ఆ నిరుద్యోగ భృతి ఇవ్వలేం..' అని తేల్చేసింది ప్రభుత్వం. మరి, ఎన్నికల్లో హామీ ఇచ్చారు కదా.? అని ప్రశ్నిస్తే నో ఆన్సర్. తెలంగాణలోనూ నిరుద్యోగుల సంఖ్య తక్కువేమీ కాదు. ఉద్యోగాల ప్రకటనలు మామూలే.. నిరుద్యోగమూ మామూలే అన్నట్టుగా తయారైంది వ్యవహారం.
యువతకైతే అనేక ఆంక్షలు.. అవే రాజకీయ నిరుద్యోగులకైతే అలాంటివేం లేవు.. వుండవు కూడా. అవసరమైతే, నిబంధనల్ని తుంగలో తొక్కేసి అయినాసరే, రాజకీయ నిరుద్యోగుల కోసం కొత్త కొత్త పదవులు, ఉద్యోగాల్ని క్రియేట్ చేసేస్తుంటారు. అందుకే మరి, నిరుద్యోగులందు రాజకీయ నిరుద్యోగులు వేరయా.. అన్నది.!