'అమెరికా ఇకపై ఎంతమాత్రమూ అగ్రరాజ్యం కాబోదు..'
తీవ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్, అమెరికాపై అక్కసుతో చేసిన వ్యాఖ్యలివి.
భారత – పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, ఈ క్రమంలో అమెరికా, పాకిస్తాన్ ఎగదోస్తున్న తీవ్రవాదంపై భగ్గుమన్న నేపథ్యంలో, పాకిస్తాన్ నుంచి అమెరికాకి వ్యతిరేకంగా ప్రకటన వచ్చింది. ఉద్దేశ్యం ఏదైనాసరే, ఈ విషయంలో పాకిస్తాన్ వ్యాఖ్యల్ని సమర్థించి తీరాల్సిందే. అవును, నిజం.. అమెరికా ఇకపై ఎంతమాత్రం అగ్రదేశం కాదు. ఇది నూటికి నూరుపాళ్ళూ నిజం.
గడచిన కొన్నేళ్ళుగా అమెరికా బిక్కుబిక్కుమంటోంది. అమెరికాపై అల్‌ఖైదా దాడి జరిగింది మొదలు, నిత్యం అమెరికాలో ఏదో ఒక ఘటన, అమెరికా గొప్పని భూస్థాపితం చేసేస్తూనే వుంది. నల్లజాతిపౌరులపై దాడులు, వారి ఆందోళనలు, పోలీసులపై నల్లజాతీయుల దాడులు, నల్లజాతీయులపై పోలీసుల దమనకాండ.. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలానే వుంది కథ. అమెరికాపై అప్పుడప్పుడూ ఐసిస్ పడగ విప్పడంతోపాటు, అమెరికాలో ఆర్థిక మాంద్యం.. ఇలా ఒకేటమిటి, చాలానే వున్నాయి.
అవన్నీ ఒక ఎత్తు.. అమెరికా అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికల తంతు ఇంకో వంతు. డోనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్తున్నారు. రిపబ్లికన్లు డోనాల్డ్ ట్రంప్‌ని అధ్యక్ష బరిలో నిలబెడితే, డెమోక్రాట్లు హిల్లరీని బరిలో నిలబెట్టారు. కానీ, వీరిద్దరి నగ్న విగ్రహాల్నీ కొందరు అమెరికా రోడ్లపై నిస్సిగ్గుగా నిలబెట్టేశారు. ఆ మధ్య ట్రంప్ నగ్న విగ్రహం పెద్ద దుమారమే రేపింది. అది హిల్లరీ మద్దతుదారుల పనేనని ట్రంప్ విమర్శించారు. ఇదిగో, ఇప్పుడు హిల్లరీ క్లింటన్ నగ్న విగ్రహం వెలుగు చూసింది. షరామామూలుగానే ఇది ట్రంప్ పనేనని హిల్లరీ విమర్శించకుండా వుండరు కదా.!
అమెరికా అధ్యక్షుడంటే ఎలా వుండాలి.? ఎలా వుంటారు.? ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం ల్యాండ్ అవుతుంటో, ఆ సౌండింగ్‌లోనే అమెరికా అధ్యక్ష పదవి గొప్పతనం దాగి వుంటుంది. బీస్ట్ వాహనం అలా రోడ్డు మీద దూసుకెళ్తుంటే అమెరికా అధ్యక్ష పదవిలో కూర్చున్న వ్యక్తి హుందాతనం గురించి గొప్పగా చెబుతుంటారంతా. అలాంటిది, అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన ఇద్దరు వ్యక్తులకు సంబంధించి, వారి వారి అభిమానులు ఇంతలా బరి తెగించేస్తోంటే, అమెరికా భవిష్యత్ ముఖ చిత్రం ఎలా వుండబోతోందో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
హిల్లరీ కావొచ్చు, ట్రంప్ కావొచ్చు.. ఎవరు అధ్యక్ష బరిలో దిగినా, ఇదిగో.. ఈ న్యూడ్ విగ్రహాల వ్యవహారం.. ప్రపంచ వ్యాప్తంగా ఆయా వ్యక్తుల కీర్తి ప్రతిష్టల్ని దెబ్బతీయకుండా వుండవు. వ్యక్తుల అప్రతిష్ట కాదిది, అమెరికా అధ్యక్ష పదవికి అప్రతిష్ట ఇది. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంత నీఛమైన రాజకీయాలుండవేమో.! ఇదీ అమెరికా ఘనతేనని ఒప్పుకుందామా.?