మొదటి దానికి మొగుడు లేడు కడదానికి కళ్యాణం అని వెనకటికి సామెత. మెగాస్టార్ 150 వ సినిమా ఇంకా పూర్తికాలేదు. విడుదల కాలేదు. అది విడుదలైతే తప్ప, అభిమానులు కాకుండా మిగిలిన మామూలు ప్రేక్షకులు ఇప్పుడు మెగాస్టార్ ను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారన్నది తెలియదు.
ఈ విషయం మెగాస్టార్ కే కాదు, మెగా క్యాంప్ కే అర్థం కాని విషయం. ఎందుకంటే బ్రూస్ లీ ఘోర పరాజయం తరువాత మెగా క్యాంప్ మీటింగ్ ల మీద మీటింగ్ లు పెట్టి, తేల్చకుండా వదిలేసిన విషయం అదే. చాలా రోజుల తరువాత చిరంజీవి స్క్రీన్ మీదకు వస్తే, ఆయనను చూడ్డానికైనా జనం రావాలి కదా? ఎందుకు రాలేదు? అన్నది అప్పట్లో సమాధానం లభించని ప్రశ్నగా మిగిలిపోయింది.
ఈ కారణం చేతనే మెగా క్యాంప్ చిరు 150 వ సినిమా ఎంత కేర్ తీసుకోవాలో అంతా తీసుకుంటోంది. అలాగే ఎన్ని విధాలా సినిమాకు, చిరుకు క్రేజ్ తీసుకు రావాలో అంతా ట్రయ్ చేస్తోంది. ఇందుకోసం వెయ్యని పాచిక లేదు. తాజగా ఖైదీ 150 వ సినిమా బిజినెస్ స్టార్ట్ అయింది. కొనేవాళ్లలో భరోసా పెంచాల్సి వుంది.
ఎందుకంటే సాధారణంగా బయ్యర్లు తరువాతి సినిమా ఏముంది? తరువాత ఎవరితో తీస్తారు? తేడావస్తే అక్కడ చూసుకోవచ్చా? లేదా? లాంటి విషయాలు కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అందుకోసం ఫీలర్లు వదలడం ప్రారంభమైంది. మరి ఈ ఫీలర్లు యూనిట్ వైపు నుంచి వస్తున్నాయో, అభిమానుల వైపు నుంచి వస్తున్నాయో, పక్కా డిజైన్లతో సహా వస్తున్నాయి. చిరు 151వ సినిమా అరవింద్-బోయపాటి కాంబినేషన్ అని, 152వ సినిమా త్రివిక్రమ్-అశ్వనీదత్ కాంబినేషన్ అనీ డిజైన్లు సర్క్యులేట్ అవుతున్నాయి.
బోయపాటికి మరో సారి చాన్స్ ఇవ్వాలని అరవింద్ కు వుందన్నది వాస్తవం. కానీ ఇంతవరకు ఆ మేరకు కమిట్ మెంట్ ఏమీ లేదు. ఆయన బెల్లంకొండ కొడుకు సినిమా పనిలో వున్నారు. అది కనీసం మరో ఏడెనిమిది నెలలు పడుతుంది. ఆ తరువాత ఎలా లేదన్నా మరో నాలుగైదు నెలలు. అంటే ఏడాది పైమాటే.
ఇక త్రివిక్రమ్ ఇంకా పవన్ సినిమా ప్రారంభించలేదు. ఆపై మైత్రీ-మహేష్ బాబు సినిమా చేయాలి. ఆ తరువాత దానయ్య కు వున్న కమిట్ మెంట్ పూర్తి చేయాలి. అప్పటి సంగతి అశ్వనీదత్ తో వ్యవహారం. అంటే ఈ రెండు సినిమాలు కూడా నియర్ ఫ్యూచర్ లో కాదు కదా, ఏడాది తరవాత కూడా స్క్రీన్ మీదకు కాదు, సెట్ మీదకు రావడం కష్టం. మరి అలాంటి వ్యవహారాన్ని ఇప్పుడు ఎందుకు పాపులర్ చేయాలని ఈ డిజైన్లు వదులుతున్నారో, వదులుతున్నవారికే తెలియాలి.
ఈ డిజైన్లు చూసి మాత్రం ఇండస్ట్రీ జనాలు ఒకటే గుసగుస. ఖైదీ నెంబర్ 150 సినిమా కొనే బయ్యర్లు మరింత ధైర్యం కల్పించి, అనుకున్న రేట్లు రప్పించడం కోసమే అని.