'మాది హిందూత్వ పార్టీ.. మేం హిందూ మతాన్ని ఉద్ధరించేస్తాం..' అని డైరెక్ట్‌గా చెప్పకపోయినా, ఆ స్థాయిలో పబ్లిసిటీ స్టంట్లు చేయడం భారతీయ జనతా పార్టీకి కొత్తేమీ కాదు. ఏ ఎన్నికలొచ్చినా, బీజేపీ నినాదం ఒకటే.. అయోధ్య రామాలయ నిర్మాణం. కానీ, ఆ నిర్మాణం జరిగిందా.? అంటే, లేదనే చెప్పాలి. కానీ, అయోధ్య పేరుతో బిజేపీ పబ్లిసిటీ స్టంట్లు చేస్తూనే వుంది.
ఇప్పుడు ఇంకో పార్టీ హిందూత్వ కార్డుని తెరపైకి తెచ్చింది. అదే, రిపబ్లికన్ పార్టీ. ఇది భారతదేశానికి చెందిన పార్టీ కాదు, అమెరికన్ పార్టీ. అక్కడికేదో, త్వరలో ఇండియాలో జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ పోటీ చేస్తుందా.? అన్న అనుమానాలు కలిగేలా కామెడీ చేసేశారు అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్. హిందూ మతమంటే తనకెంతో గౌరవమనీ, హిందువుల్ని గౌరవిస్తాననీ, అదే సమయంలో ఇండియాతో సత్సంబంధాలకు తమ పార్టీ కట్టుబడి ఉందని సెలవిచ్చారాయన. షాకింగ్ థింగ్ ఇది.
ఇంకేముంది, గంప గుత్తగా హిందూ ఓట్లు, ఇండియన్ ఓట్లు డోనాల్డ్ ట్రంప్‌కి పడిపోతాయనే విశ్లేషణలు షురూ అయ్యాయి. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ సన్నిహితులు, హిందూ ఓటు బ్యాంకును చీల్చేయత్నాల్లో వుందిప్పుడు. ఇండియన్ ఓటర్లను ఎలా తమవైపుకు తిప్పుకోవాలా.? అని ఆలోచిస్తున్నారట కూడా. ఇదెక్కడి చోద్యం.? మొదట్లో ఇండియన్లను ట్రంప్ విమర్శించినా, ఆయన వెంట కొందరు ఇండియన్లు నడిచారు. కారణాలు అనేకం. ట్రంప్, మహిళల పట్ల చిన్నచూపు చూస్తున్నా, ఆయన వెనకాల మహిళలు కనిపిస్తూనే వున్నారు. అంటే, ఆయన వ్యాఖ్యల వెనుక ఉద్దేశ్యం వేరే.. అని అర్థం చేసుకున్నారేమో వారంతా.
చూస్తోంటే, అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇండియాలో జరిగే ఎన్నికల్ని తలపించకమానవు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం, 'అయోధ్య – రామాలయం' అంశాన్ని తెరపైకి తెచ్చింది బీజేపీ. ఇక్కడ బీజేపీకి, అక్కడ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కీ పెద్దగా తేడా ఏమీ కన్పించడంలేదు.. 'హిందుత్వ' అన్న పదంతో అందరూ ఆటలాడేవాళ్ళే.! హిందూత్వం అనేది మతం కాదు, జీవన మార్గం.. అంటారు కొందరు. అదెంత నిజం.? అన్న విషయం పక్కన పెడితే, హిందూత్వ.. ఇప్పుడు ఓటు బ్యాంకులా మారిపోవడం అత్యంత బాధాకరం.