బాలీవుడ్‌లో కొందరు ప్రముఖులు, పాకిస్తాన్‌కి చెందిన నటీనటుల్ని వెనకేసుకురావడంపై క్రికెటర్ గౌతమ్ గంభీర్ చాలా ఘాటుగా స్పందించాడు. స్పందించడమంటే అలా ఇలా కాదు, సోకాల్డ్ ప్రముఖుల్ని కడిగి పారేశాడు. క్రికెట్ కన్నా, సినిమాలకన్నా, దేశం చాలా గొప్పదని గంభీర్ వ్యాఖ్యానించాడు.
'మీ ఇంట్లో మీ తమ్ముడో, మీ అన్నయ్యో.. పాకిస్తాన్‌తో జరుగుతున్న సీమాంతర ఉగ్రవాద పోరులో మరణిస్తే మీకు ఆ బాధేంటో తెలుస్తుంది..' అంటూ గంభీర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. సల్మాన్‌ఖాన్, కరణ్ జోహార్.. ఇలా చాలామంది బాలీవుడ్ ప్రముఖులు, సినిమాల్ని – రాజకీయాల్ని వేరుగా చూడాల్సి వుంటుందంటూ పాక్ నటుల్ని వెనకేసుకొచ్చారు. ఈ విషయంలో ప్రియాంకా చోప్రా కూడా చాలా తెలివిగా స్పందించినా, ఆమె కూడా పాక్ నటుల్ని వెనకేసుకురావడం గమనార్హం.
అయితే, అందర్నీ ఒకేసారి కడిగి పారేసిన గంభీర్, ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయాడు. నిజమే మరి, పాక్ నటీనటులతో బాలీవుడ్‌లో సినిమాలు చేసినప్పుడు, పాకిస్తాన్‌తో ఎందుకు క్రికెట్ ఆడకూడదు.? నాన్సెన్స్, అసలు భారతదేశంపై ఉగ్రమూకల దాడికి కారణమే పాకిస్తాన్ అయినప్పుడు, ఆ పేరుతో సంబందమున్న దేనితోనూ భారత్ ఎలాంటి సంబంధాలూ పెట్టుకోకూడదంతే. ఇదీ నెటిజన్ల మాట. అంతే కాదు, ఇది నూట పాతిక కోట్ల భారతీయుల మాట.
పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదంతో భారతదేశం ఎంత సతమతమవుతోందో, సెలబ్రిటీలుగా పండగ చేసుకుంటున్న సోకాల్డ్ 'ప్రముఖులకి' ఏం తెలుసు.? ముంబై టెర్రర్ అటాక్‌లోనో, ఇంకొక చోటో మన నటీనటులకు షాక్ తగిలి వుంటే, వాళ్ళిప్పుడిలా మాట్లాడేవారే కాదు. ఎక్కడో విదేశాల్లో తీవ్రవాద దాడులు జరిగినప్పుడు, ఆ సమయంలో అక్కడ వుండి, ఆ ఘటన నుంచి తప్పించుకున్న కొందరు నటీనటులు, తీవ్రవాదాన్ని ఖండించేస్తుంటారు. అదే మన దేశంలో జరిగితే మాత్రం, 'అది మా పని కాదు' అని ఊరుకుంటారు. అందరూ కాదుగానీ, కొందరి వైఖరి, పాక్ ప్రేరేపిత తీవ్రవాదం విషయంలో కాస్త భిన్నంగా కన్పిస్తోంది.
ఇంతకీ, ఆ ప్రముఖులు పాకిస్తాన్‌పై విమర్శలు చేయకపోవడానికి కారణమేంటి.? ఎవరన్నా విమర్శలు చేస్తే ఖండించడానికి కారణమేంటి.? అని ఆరా తీస్తే, పాక్‌లోనూ తమ సినిమాలు ప్రదర్శితమవ్వాలనే వారి ఆలోచనలే అందుకు కారణమన్న విషయం బయటపడ్తుంది. గంభీర్ విమర్శించాడని కాదుగానీ, ఇది నూటికి నూరుపాళ్ళూ నిజం. క్రికెట్‌నే వద్దనుకున్నప్పుడు, సినిమాలు మాత్రం ఎందుకు.?
అన్నిటికీ మించి, 'మీ ఇంట్లో మీ తమ్ముడో, అన్నయ్యో తీవ్రవాదుల బారిన పడి ప్రాణాలు కోల్పోతే మీరు ఇలాగే పాకిస్తాన్‌ని వెనకేసుకొస్తారా.?' అన్న గంభీర్ మాట, పాకిస్తాన్‌ని ఏ రూపంలో అయినాసరే వెనకేసుకురావాలనుకునేవారికి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ చేయకుండా వుండదు.