అరెవో సాంబా.. రాస్కోరోయ్.! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, 'మళ్ళీ మళ్ళీ పెళ్ళి' గురించి క్లాస్ తీసుకున్నారు. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలు, వివాహ వ్యవస్థలోని గొప్పతనాలు.. అంటూ లెక్చర్ తీసుకున్నారు. నిజమే, ప్రపంచంలోనే భారతీయ వివాహ వ్యవస్థకు ప్రత్యేకమైన గుర్తింపు వుంది. భారతదేశంలోని సంస్కృతీ సంప్రదాయాల గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా తక్కువే. కానీ, ఈ క్రమంలో విదేశాల్లోని వివాహ వ్యవస్థ గురించి విమర్శలు చేస్తే ఎలా.? పైగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో వున్న డోనాల్డ్ ట్రంప్ చేసుకున్న పెళ్ళిళ్ళ లెక్క గురించి చంద్రబాబు సెలవిచ్చారు. అసలు, ఇది సందర్భమేనా.? ట్రంప్ గురించి చంద్రబాబు ప్రస్తావించాల్సిన అవసరమేంటట.?
ఎందుకూ.. అంటే, చంద్రబాబుకి ఈ మధ్య, తాను జాతీయ రాజకీయాల్లోనే కాదు, అంతర్జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పే స్థాయికి చేరిపోయానన్న 'ఓవర్ కాన్ఫిడెన్స్' ఎక్కువైపోయింది. తనను అందరూ ప్రపంచస్థాయి నాయకుడిగా గుర్తించాలనే ఆరాటం ఆయనలో స్పష్టంగా కన్పిస్తోంది. భారతీయ వివాహ వ్యవస్థ గురించి గొప్పగా చెప్పడం వరకూ ఓకే. అమెరికా గురించి మాట్లాడితే ఎలా.? కొత్తగా, అమెరికాలో ఈ ట్రెండ్ రాలేదు. ఆ మాటకొస్తే, మన దేశంలోనూ వివాహ వ్యవస్థ ఇప్పుడిప్పుడే కుదేలైపోతోంది. పెళ్ళి, ఆ తర్వాత విడాకులు, మళ్లీ పెళ్ళి.. ఈ ట్రెండ్ బాగా నడుస్తోంది మన దేశంలో.
ఎక్కడిదాకానో ఎందుకు, తన కుమారుడు లోకేష్.. పెళ్ళికి ముందు, విదేశాల్లో బ్యాచిలర్ లైఫ్‌ని ఎంజాయ్ చేసే క్రమంలో, అమ్మాయిలతో సరదా సరదాగా గడిపిన ఆనాటి తీపి గురుతులు మీడియాలో దర్శనమిస్తున్నాయి. పెళ్ళి తర్వాత ఇంకో పెళ్ళి చేస్కోకూడదని చెబుతున్న చంద్రబాబు, పెళ్ళికి ముందు ఏం చేసినా ఫర్లేదా.? బావమరిది బాలకృష్ణగారేమో, 'అమ్మాయి కనిపిస్తే కడుపు చేసెయ్యాల్సిందే..' అని చాలా క్యాజువల్‌గా సినిమా డైలాగ్ పేల్చేస్తే ఓకేనా.? మిత్రపక్షం జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌కి, ముచ్చటగా జరిగిన మూడు పెళ్ళిళ్ళ మాటేమిటి.? స్వర్గీయ ఎన్టీఆర్ రెండు పెళ్ళిళ్ళ సంగతేంటి.?
ట్రంప్ పేరుతో పవన్‌కళ్యాణ్ మీద చంద్రబాబు సెటైర్ వేశారేమో.. అన్న గుసగుసలు ఓ పక్క విన్పిస్తోంటే, ప్రపంచ రాజకీయాలపై మాట్లాడి, భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్ని చంద్రబాబు వెటకారం చేశారేమో.. అన్న వాదనలూ లేకపోలేదు. ఆయనేకదా, ప్రపంచ దేశాలు పరుగులు పెడ్తున్నాయి, ఆ స్థాయిలో మనమూ ఎదగాలని చెబుతుంటారు. ఏంటో, చంద్రబాబు ఏం మాట్లాడినా వివాదాస్పదమయిపోతుంటుంది. కాదు కాదు, సంచలనాలకోసం.. ఆయన ఏదేదో మాట్లాడేస్తోంటే, ఇదిగో ఇలాగే బూమరాంగ్ అయిపోతోందనడం కరెక్ట్.
ఈ రోజుల్లో వివాహ వ్యవస్థ గురించి ఎవరైనా సరే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే, పరిస్థితులు అలా తగలడ్డాయ్. అలాగని, మనల్ని మనం కించపర్చుకోలేం. కానీ, వాస్తవాల్ని ఒప్పుకుని తీరాల్సిందే.
ఒకటికి నాలుగు సార్లు పెళ్ళిళ్ళు చేసుకోవడం కాస్త బెటర్.. ప్రతి పెళ్ళిలోనూ పెళ్ళికొడుకో, పెళ్ళికూతురో మారిపోవచ్చు. కానీ, ఒకటికి పదిసార్లు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తేనే.. కామెడీగా, చిరాగ్గా ఉంటుంది. కాస్త ఆలోచించండి చంద్రబాబుగారూ, ఇది అత్యంత హేయంగా తయారయ్యింది.