కాల మ‌హిమః టీడీపీ అలా ఆకాంక్షిస్తోంది!

కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ఆవిర్భ‌వించిన పార్టీ తెలుగుదేశం. అయితే కాల మ‌హిమ‌…. కాంగ్రెస్ గెల‌వాల‌ని టీడీపీ ఆకాంక్షిస్తోంది. కాంగ్రెస్ గెలుపు సంబ‌రాల్లో మునిగితేలాల‌ని టీడీపీ ఎదురు చూడ‌డం విశేషం. తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల 30న…

కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ఆవిర్భ‌వించిన పార్టీ తెలుగుదేశం. అయితే కాల మ‌హిమ‌…. కాంగ్రెస్ గెల‌వాల‌ని టీడీపీ ఆకాంక్షిస్తోంది. కాంగ్రెస్ గెలుపు సంబ‌రాల్లో మునిగితేలాల‌ని టీడీపీ ఎదురు చూడ‌డం విశేషం. తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల 30న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. డిసెంబ‌ర్ 3న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. హ్యాట్రిక్ కొట్టేందుకు బీఆర్ఎస్ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. ఇదే సంద‌ర్భంలో తెలంగాణ‌ను ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను ఒక్క‌సారి ఆద‌రించాల‌ని ఆ పార్టీ నాయకులు వేడుకుంటున్నారు.

అయితే తెలంగాణ‌లో గెలుపు ఇటు బీఆర్ఎస్‌, అటు కాంగ్రెస్‌తో దోబూచులాడుతోంది. బీఆర్ఎస్‌కు బీజేపీ ప్ర‌త్యామ్నాయం అవుతుంద‌ని ఆరు నెల‌ల క్రితం వ‌ర‌కూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. అయితే క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డం, బీఆర్ఎస్‌తో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యింద‌నే ఆరోప‌ణ‌లు ఆ పార్టీని తీవ్రంగా దెబ్బ‌తీశాయి. రానున్న ఎన్నిక‌ల్లో క‌నీసం సింగిల్ డిజిట్‌లో అయినా సీట్లు వ‌స్తాయా? అనే అనుమానం క‌లుగుతోంది.

ఇక బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల విష‌యానికి వ‌స్తే… ఈ రెండు పార్టీల జ‌యాప‌జ‌యాల‌పై ఏపీ అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్ స‌ర్వ‌నాశ‌న‌మై ఆవిర్భ‌వించిన పార్టీ వైసీపీ. వైఎస్ జ‌గ‌న్‌ను అన్యాయంగా కేసుల్లో ఇరికించి జైలుపాలు చేశార‌ని సోనియా, రాహుల్‌గాంధీల‌పై వైసీపీ శ్రేణులు కోపం పెంచుకున్నాయి. జ‌గ‌న్‌ను జైల్లో పెట్టి ప‌దేళ్ల కాలం గ‌డిచిపోయింది.

వైసీపీ శ్రేణుల కోప‌తాపాల్లో మార్పు కనిపిస్తోంది. కాంగ్రెస్‌పై వైసీపీ శ్రేణుల్లో ఎక్క‌డో ఏ మూలో చిన్న ప్రేమ‌. తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే బాగుంటుంద‌ని వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కోరుకుంటున్నారు. అయితే ఓటు వేయ‌డానికి వ‌చ్చే స‌రికి…తెలంగాణ కాంగ్రెస్‌ను న‌డిపిస్తున్న రేవంత్‌రెడ్డి క‌నిపిస్తున్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేయ‌డం అంటే…చంద్ర‌బాబుకు వేసిన‌ట్టుగా వైసీపీ సెటిల‌ర్స్ భావిస్తున్నారు. మ‌రోవైపు సీఎం వైఎస్ జ‌గ‌న్‌తో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ బాగున్న‌ట్టే అనిపించిన‌ప్ప‌టికీ, అప్పుడ‌ప్పుడు వైసీపీ ప్ర‌భుత్వానికి గుచ్చుకునేలా వారు చేసే విమ‌ర్శ‌లు ఆలోచింప‌జేస్తున్నాయి. 

నిన్న‌టికి నిన్న సీఎం కేసీఆర్ ఏపీ, తెలంగాణ రోడ్ల‌పైన సెటైర్స్ వేయ‌డం వైసీపీ అభిమానుల‌కి కోపం తెప్పిస్తోంది. అలాగే మంత్రి హ‌రీష్‌రావు ప‌దేప‌దే జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తుండడం కూడా వైసీపీ సెటిల‌ర్స్‌ను ఎటూ తేల్చుకోలేకుండా చేస్తోంది.

ఈ నేప‌థ్యంలో టీడీపీ రెండో ఆలోచ‌నే చేయ‌డం లేదు. రేవంత్‌రెడ్డి త‌మ వాడిగా ఆ పార్టీ ఆ భావిస్తోంది. తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలిస్తే, అధికారంలో టీడీపీ ఉన్న‌ట్టుగానే ఆ పార్టీ శ్రేణులు అనుకుంటున్నాయి. దీంతో టీడీపీ సానుభూతిప‌రులు, క‌మ్మ సామాజిక వ‌ర్గం నేత‌లు కాంగ్రెస్‌ను గెలిపించాల‌ని తీర్మానాలు సైతం చేస్తున్నార‌ని తెలిసింది. అంతెందుకు తెలంగాణ‌లో టీడీపీ పోటీ చేస్తే, ఓట్లు చీలి కాంగ్రెస్‌కు రాజ‌కీయంగా న‌ష్టం వ‌స్తుంద‌నే భ‌యంతో ఏకంగా బ‌రి నుంచే త‌ప్పుకుంది.

ఇంత‌కంటే కాంగ్రెస్ గెలుపును టీడీపీ ఆకాంక్షిస్తోంద‌ని చెప్ప‌డానికి నిద‌ర్శ‌నం ఏముంటుంది? ఇదే కాలం తీసుకొచ్చిన మార్పు. ఏ పార్టీకి వ్య‌తిరేకంగా టీడీపీ ఆవిర్భ‌వించిందో, ఇప్పుడు అదే పార్టీలో త‌న గెలుపును, అధికారాన్ని చంద్ర‌బాబు, లోకేశ్‌, వారి అభిమానులు చూసుకోవాల‌ని త‌పిస్తున్నారు.