మొత్తానికి బన్నీ-రామ్ చరణ్ మధ్య వున్న కనపడని విబేధాలు వున్నాయని ఇండస్ట్రీలో అక్కడక్కడ గుసగుసలు వినిపిస్తూనే వుంటాయి. బ్రూస్ లీ భయంకర పరాజయం తరువాత, రామ్ చరణ్-చిరు మళ్లీ గీతా ఆర్ట్స్ అరవింద్ దగ్గరకే వచ్చారు. నిర్మాతలు దానయ్య వెనుక, ఎన్ వి ప్రసాద్ పక్కన వుండగా, అరవింద్ పేరుతో ధృవ తయారవుతోంది.
అయితే ఈ సినిమా ఆది నుంచీ కూడా అరవింద్ స్కూల్ ఆఫ్ ప్రొడక్షన్ లో ముందుకు వెళ్లడం లేదు. ముఖ్యంగా కాశ్మీర్ ఎపిసోడ్ పూర్తయిన తరువాత నుంచి ఆ సినిమా ప్రోడక్షన్ లో చాలా తేడాలు వచ్చినట్లు యూనిట్ వర్గాల బోగట్టా. రాను రాను ధృవ ప్రొడక్షన్ లో గీతా ఆర్ట్స్ కు సంబంధించిన జనాలు తగ్గుతూ వస్తున్నారని తెలుస్తోంది.
ఈ విషయాలు అన్నీ అరవింద్ కు తెలుస్తూనే వున్నా, ఏమీ అనలేక మౌనం వహిస్తున్నారని వినికిడి. ఆఖరికి ఇప్పుడు గీతాకు పర్మెనెంట్ గా వున్న పీఆర్వోలను కూడా మార్చేసారు. ఈ పీఆర్వోలు బన్నీకి, శిరీష్ కు అత్యంత విధేయులు అన్నదే ఈ మార్పిడికి కారణం అని తెలుస్తోంది. పీఆర్వోలను మారుస్తున్నారని, కార్పొరేట్ జనాలను కానీ, వేరే వారిని కానీ నియమించే అవకాశం వుందని కొద్ది రోజుల క్రితమే గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది.
అయితే, ఈ వార్త బయటకు రాగానే అల్లు అరవింద్ వెంటనే చరణ్ తో భేటీ వేసినట్లు తెలుస్తోంది. కానీ చరణ్, ఈ ఒక్కసారికి వదిలేయండి అని అనడంతో అరవింద్ మరి మారు మాట్లాడలేదని వినికిడి. ఈ విషయం తెలిసి, బన్నీ, శిరీష్ కూడా ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. ఈ పీర్వోల మార్పిడిలో చరణ్ కు అత్యంత సన్నిహితంగా వుంటున్న ఇద్దరు వ్యక్తులు కీలకపాత్ర వహించినట్లు తెలుస్తోంది.
ఇటీవల కొంతకాలంగా చరణ్ కు కొత్తగా దగ్గరయిన ఒకరు ఈ మార్పిడికి నాంది పలికించినట్లు వినికిడి. వెబ్ మీడియా చరణ్ కు అంతగా అనుకూలంగా లేదని, వేరే పీఆర్వోలు అయితే వెబ్ మీడియాను బాగా మేనేజ్ చేయగలరని చరణ్ కు క్లియర్ గా వివరించడంతోనే ఈ మార్పిడి జరిగినట్లు ఓ గుసగుస వినిపిస్తోంది. ఏది నిజమో, ఎంతవరకు నిజమో కానీ, మొత్తానికి గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా నిర్మాణం, అరవింద్ ప్రమేయం లేకుండానే సాగిపోతుండడం విశేషం.
అందుకే ఈ సినిమాను అవుట్ రేట్ కు అమ్మేయాలని కూడా అరవింద్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చాలా మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వామ్యం వుందని తెలుస్తోంది. అందుకే అమ్మేసి, విడుదలకు ముందే లెక్కలు తేల్చేసుకుంటే బెటర్ అని అరవింద్ భావిస్తున్నట్లు వినికిడి.
ఇక్కడ అప్రస్తుతం కావచ్చు..ప్రస్తావన సమంజసం కాకపోవచ్చు. కానీ కాపుల కోసం, కాపుల ఉద్దరణ కోసం అంటూ సమావేశాలకు, చర్చలకు హాజరయ్యే చిరంజీవి తన కొడుకు సినిమాకు, తన సామాజికవర్గ పీఆర్వోలను పక్కన పెట్టేయడం ఏమిటో? మరి.