ఇంత వరకూ 2,223 అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ లు జరిగాయి. వీటన్నింటి ఇన్నింగ్స్ ల స్కోరు కార్డులనూ పరిశీలించినా.. ఇద్దరు బ్యాట్స్ మన్ లు కలిసి ఏర్పరిచిన భాగస్వామ్యం 300 మార్కును దాటిన సందర్భాలు ఇంత వరకూ 94 మాత్రమే! వీటిల్లో లేటెస్ట్ కమ్ గ్రేటెస్ట్ ఘనత విరాట్ కొహ్లీ- అజింక్య రహనేలది!
ఇండోర్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి, మూడో టెస్టులో వీళ్లు బ్యాట్ ఝలిపించారు. సెంచరీలతో చెలరేగిపోయారు. వంద పరుగులకు మూడు వికెట్లు పడిన దశలో జత కలిసిన వీళ్లిద్దరూ టెస్టు క్రికెట్ కు సిసలైన నిర్వచనం ఇచ్చారు. సచిన్, లక్ష్మణ్, ద్రావిడ్, సెహ్వాగ్.. వంటి లెజెండ్లు రిటైరయ్యాకా, మారథాన్ ఇన్నింగ్స్ లు చూసి చాలా కాలం అయిన భారత క్రికెట్ అభిమానుల కరువు తీరా ఆడారిద్దరూ!
బ్యాట్స్ మన్ గా తను ఎందుకు ప్రత్యేకమో విరాట్ మరోసారి రుజువు చేసుకున్నాడు. లెజెండ్ గా ఎదుగుతున్నానని మరోసారి ప్రపంచానికి గుర్తు చేశాడు విరాట్. తొలి రెండు టెస్టు మ్యాచ్ లలో అంతగా ఆకట్టుకోలేకపోయిన విరాట్ డబుల్ సెంచరీ చేశాడు. దీంతో చాన్నాళ్ల తర్వాత టెస్టుల్లో టీమిండియా కెప్టెన్ ఒకరు డబుల్ చేసినట్టు అయ్యింది.
2004 లో ఆస్ట్రేలియాపై ఒక మ్యాచ్ లో నాలుగో వికెట్ కు సచిన్ – లక్ష్మణ్ లు నెలకొల్పిన 353 పరుగుల భాగస్వామ్యం ఇన్నేళ్లూ ఒక రికార్డు. 12 యేళ్ల తర్వాత ఆ రికార్డును చేధిస్తూ విరాట్- రహనేలు 365 పరుగుల కొత్త రికార్డును సృష్టించారు. తద్వారా సచిన్- లక్ష్మణ్ ల గుర్తు చేశారు. తరచి చూస్తే.. ఈ భాగస్వామ్యంలో విరాట్ – రహనేలు.. ఇంకా అరడజను రికార్డులకు రిపేర్లు చేశారు. టెస్టు క్రికెట్ మజాను ప్రేక్షకులకు అందించారు.