12 ఏళ్ళ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యమేనని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ప్రభుత్వం ఈ విషయంపై ఇంకా స్పందించాల్సి వుంది. కానీ, ఇక్కడ ఆసుపత్రి నిర్లక్ష్యం సుస్పష్టం. కాసులుంటేనే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలి.. లేదంటే, ప్రాణాలు కోల్పోవాల్సిందే. హైద్రాబాద్ ప్రపంచస్థాయి మెడికల్ హబ్‌గా మారుతోన్న మాట వాస్తవం. మెడికల్ టూరిజం మీద వున్న శ్రద్ద, సామాన్యుడికి వైద్య చికిత్స అందించడంలో మాత్రం కనిపించడంలేదు. కార్పొరేట్ ఆసుపత్రి అంటే కార్పొరేట్ దోపిడీ తప్ప.. అక్కడ సరైన వైద్యం దొరకదన్న విషయం మరోమారు స్పష్టమయిపోయింది.
ప్రభుత్వం చెప్పిన మాట నమ్మి, కార్పొరేట్ ఆసుపత్రికి పరుగులు తీసిన ఆ కుటుంబం, ఇప్పుడు తమ బిడ్డను కోల్పోయింది. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య చికిత్స అందిస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీ, ఆ కుటుంబంలో కొండంత ఆశ కల్పించిందిగానీ, ఇప్పుడా ఆశ నిరాశయ్యే అయ్యింది.. వారికి కన్నీరే మిగిలింది. కాలేయ వ్యాధితో బాధపడుతున్న 12 ఏళ్ళ హర్షితకు, ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందిస్తామనీ, వైద్య చికిత్స చేయిస్తామనీ తెలంగాణ ప్రభుత్వం కొన్నాళ్ళ క్రితమే హామీ ఇచ్చింది.
దురదృష్టవశాత్తూ ఆరోగ్యశ్రీ నిధుల విషయమై ప్రభుత్వానికీ, ప్రైవేటు ఆసుపత్రులకు మధ్య వివాదం ముదిరి పాకాన పడ్డంతో, మధ్యలో హర్షిత బలైపోయింది. ఇక్కడ ఆరోగ్యశ్రీ నిర్వహణ ఎంత దారుణంగా తయారయ్యిందో, ప్రభుత్వాలకి ప్రజారోగ్యంపై ఎంత శ్రద్ధ వుందో ఈ ఘటనతో తేలిపోయింది. ప్రాణం పోయాక.. ఇప్పుడు బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇవ్వాలనే రాజకీయ డిమాండ్, వివిధ రాజకీయ పార్టీల నుంచి వెల్లువెత్తుతుండడం గమనార్హం.
బతుకమ్మ పండగ పేరు చెప్పి 15 కోట్లు ఖర్చు చేసిన తెలంగాణ ప్రభుత్వం, ఓ చిన్నారి ఆరోగ్యం కోసం పది లక్షలో, పాతిక లక్షలో కేటాయించలేకపోవడం అత్యంత దారుణమైన విషయం. అయితే, ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యంతోపాటు కార్పొరేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం సుస్పష్టం. ఇప్పుడు బాధిత కుటుంబానికి ఎంత ఎక్స్‌గ్రేషియా ఇచ్చినాసరే, పోయిన ప్రాణానికి వెల కట్టలేరు. ఇంకో చిన్నారికి ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వాలు ఇకనైనా కళ్ళు తెరవాల్సి వుంది. ప్రజారోగ్యం కోసం వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు చేస్తున్నా, వైద్యం అందక ప్రజలు ప్రాణాలు కోల్పోవడమంటే, ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని అనుకోగలమా.?