పాక్‌ బెదిరింపులకు అమెరికా బెదిరింది.!

పాకిస్తాన్‌ బెదిరించింది.. అమెరికా బెదిరిపోయింది. అవును, ఇది నూటికి నూరుపాళ్ళూ నిజం. 'అమెరికా ఇక ఎంత మాత్రమూ శక్తివంతమైన దేశం కాదు. మేం, అమెరికాకి దూరంగా జరగాలనుకుంటున్నాం.. మాకు రష్యాతోనూ, చైనాతోనూ స్నేహ సంబంధాలు…

పాకిస్తాన్‌ బెదిరించింది.. అమెరికా బెదిరిపోయింది. అవును, ఇది నూటికి నూరుపాళ్ళూ నిజం. 'అమెరికా ఇక ఎంత మాత్రమూ శక్తివంతమైన దేశం కాదు. మేం, అమెరికాకి దూరంగా జరగాలనుకుంటున్నాం.. మాకు రష్యాతోనూ, చైనాతోనూ స్నేహ సంబంధాలు ముఖ్యం..' అంటూ పాకిస్తాన్‌ నుంచి ప్రకటన వచ్చీ రావడంతోనే, అమెరికాలో కలవరం బయల్దేరినట్లుంది. పాకిస్తాన్‌ని తీవ్రవాద దేశంగా ప్రకటించాలన్న ఆన్‌లైన్‌ పిటిషన్‌ని సస్పెండ్‌ చేయడంతోపాటు, దాన్ని చట్టంగా ఆమోదించే ప్రసక్తే లేదని అమెరికా తేల్చేసింది. 

ఇంతకీ తెరవెనుకాల ఏం జరిగింది.? పాకిస్తాన్‌ ప్రకటనకీ, అమెరికా తీరుకీ ఏమైనా సంబంధం వుందా.? సంబంధం లేకుండానే, అనుకోకుండా రెండు దేశాలూ విడివిడిగా ప్రకటనలు ఇచ్చాయా.? లేదంటే, పాకిస్తాన్‌ బెదిరింపులకు అమెరికా నిజంగానే భయపడిందా.? ఇలా సవాలక్ష ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా భారతీయులనుంచే ఈ ప్రశ్నలపై చర్చ జరుగుతోంది. 

పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదాన్ని అమెరికా ఖండించడం, పాకిస్తాన్‌కి ఆగ్రహం తెప్పించింది. అవును మరి, తమ దేశంలోనే లాడెన్‌కి ఆశ్రయమిచ్చిన పాకిస్తాన్‌, అమెరికా మెరైన్స్‌ని రప్పించుకుని మరీ, లాడెన్‌ని మట్టుబెట్టించింది. అంత సాహసం చేశాక కూడా, తమ భూభాగంలో దాడులు చేసే అవకాశం అమెరికాకి కల్పించినా కూడా, తమపై తీవ్రవాద దేశంగా ముద్ర వేయాలనే ఆలోచన చేయడంతో సహజంగానే పాకిస్తాన్‌కి కోపమొస్తుంది. 

వాస్తవానికి పాకిస్తాన్‌ ఇప్పుడు తీవ్రవాద దేశంగా తయారైందంటే, ఆ పాపంలో ఎంతో కొంత అమెరికాకీ వాటా ఖచ్చితంగా వుంటుంది. గతం గతః అప్పట్లో పాకిస్తాన్‌కి అమెరికా అవసరం వుండేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. అదే ఆయుధాల పరంగా. చైనా తమకు అండగా వున్నప్పుడు అమెరికాకి పాకిస్తాన్‌ భయపడాల్సిన పనిలేదు కదా.! పైగా, కొత్త స్నేహం కోసం రష్యా వెంటపడ్తోంది పాకిస్తాన్‌. 

అమెరికాతో పాక్‌ తెగతెంపులు భారత్‌కి కలిసొచ్చేవే. కానీ, రష్యాతో పాకిస్తాన్‌ మైత్రి మాత్రం భారతదేశానికి కాస్త ఆందోళనకరం. అయితే, చిరకాల స్నేహాన్ని వదులుకుని, రష్యా – పాకిస్తాన్‌తో చెట్టాపట్టాలేసుకుతిరగడం దాదాపు అసాధ్యం. భారత్‌ని ఇరకాటంలో పెట్టేందుకు, అమెరికాకి షాకిచ్చేందుకు.. రష్యా నుంచి స్నేహహస్తం అందకపోయినాసరే, రష్యాతో స్నేహం గురించి ప్రకటించేసుకుంది పాకిస్తాన్‌. ఈ ఎపిసోడ్‌లో భారత్‌ కంగారుపడ్డానికేమీ లేదుగానీ, అమెరికా మాత్రం బాగానే షాక్‌కి గురయినట్లుంది. ఎందుకంటే, 'శక్తివంతమైన దేశం' అన్న అహంతో వున్న అమెరికాని పాక్‌ తన మాటల్తో కించపర్చింది మరి. అయినా అమెరికా బెదిరింది.. కారణం, పాకిస్తాన్ ఇకపై తమ నుంచి ఆయుధాల్ని కొనుగోలు చేయబోదేమోనని.