సినిమా రివ్యూ: ప్రేమమ్‌

రివ్యూ: ప్రేమమ్‌ రేటింగ్‌: 3/5 బ్యానర్‌: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తారాగణం: నాగచైతన్య, శృతిహాసన్‌, మడోన్నా సెబాస్టియన్‌, అనుపమ పరమేశ్వరన్‌, ప్రవీణ్‌, బ్రహ్మాజీ, నర్రా శ్రీను, చైతన్య కృష్ణ, అరవింద్‌ కృష్ణ, జీవా, పృధ్వీ, నాగార్జున…

రివ్యూ: ప్రేమమ్‌
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: నాగచైతన్య, శృతిహాసన్‌, మడోన్నా సెబాస్టియన్‌, అనుపమ పరమేశ్వరన్‌, ప్రవీణ్‌, బ్రహ్మాజీ, నర్రా శ్రీను, చైతన్య కృష్ణ, అరవింద్‌ కృష్ణ, జీవా, పృధ్వీ, నాగార్జున (అతిథి పాత్రలో), వెంకటేష్‌ (అతిథి పాత్రలో) తదితరులు
కథ: ఆల్ఫోన్స్‌ పుత్రేన్‌
సంగీతం: రాజేష్‌ మురుగేశన్‌, గోపి సుందర్‌
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: చందు మొండేటి
విడుదల తేదీ: అక్టోబరు 7, 2016

ఒక భాషలో క్లాసిక్‌ అనిపించుకున్న సినిమాల్ని మళ్లీ రీమేక్‌ చేయడం అంత ఈజీ కాదు. క్లాసిక్‌ అనిపించుకున్న సినిమాకి మార్పులు చేయవచ్చా, లేదా? అక్కడ ఇండస్ట్రీ హిట్‌ అయిన సినిమాకి మనకి నచ్చిన 'టచెస్‌' ఇవ్వవచ్చా, లేదా? అనే సందేహాలు తలెత్తుతాయి. యువ దర్శకుడు చందు మొండేటి మాత్రం అలాంటి ఆలోచనలేం పెట్టుకోకుండా 'ప్రేమమ్‌'ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు తీర్చిదిద్దాడు. మలయాళ దర్శకుడు ఆల్ఫోన్స్‌ తన సినిమానో దృశ్యకావ్యంలా తీర్చిదిద్దితే, చందు అలాంటి ఆర్టిస్టిక్‌ అప్పీల్‌ కోసం ప్రయత్నించలేదు. మన వాళ్లకి నచ్చేలా ప్రేమమ్‌ని ప్రెజెంట్‌ చేయడానికి కొన్ని స్వల్ప మార్పులు చేశాడు, కొంత కామెడీ జోడించాడు, నిదానంగా సాగే ఒరిజినల్‌ సినిమాకి కాస్త వేగం జత చేశాడు. 

'ప్రేమమ్‌' ఒరిజినల్‌ బాగా నచ్చిన వారికి తప్పకుండా మన వెర్షన్‌తో ఇబ్బందులుంటాయి. అంత ఫీల్‌ గుడ్‌ మూవీని ఇంత లైట్‌గా తీసేసారేంటనే ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే ఆ సినిమా చూడని వారికి 'ప్రేమమ్‌'తో పెద్దగా ప్రాబ్లమ్‌ ఉండదు. కాకపోతే హీరో తాలూకు టీనేజ్‌ లవ్‌ ఎపిసోడ్‌ని ఇంకాస్త బాగా డీల్‌ చేసి ఉండాల్సింది. ఆ ఎపిసోడ్‌లో సహజత్వం లోపించింది. ఆటోగ్రాఫ్‌, ధనుష్‌ '3', మలయాళ 'ప్రేమమ్‌' చిత్రాల్లో టీనేజ్‌ లవ్‌ ఎపిసోడ్‌ చాలా ప్లెజెంట్‌గా, నాస్టాలిజిక్‌గా అనిపిస్తుంది. కానీ ఈ ప్రేమమ్‌లో మాత్రం అదంతా అతికించినట్టు అనిపించడమే కాకుండా ఇది త్వరగా ముగించేసి నెక్స్‌ట్‌ ఫేజ్‌కి వెళ్లిపోదామన్న రీతిన హడావుడి ఎక్కువైంది. ఈ ఎపిసోడ్‌లో నాగచైతన్య పర్‌ఫార్మెన్స్‌ కూడా ఆడ్‌గా ఉంటుంది. ఆ ఏజ్‌లోని అమాయకత్వం, తొలిప్రేమ తాలూకు భావాల్ని ప్రదర్శించడానికి చైతన్య కాస్త ఇబ్బంది పడిన ఫీలింగ్‌ వస్తుంది.

అయితే ఒక్కసారి అయిదేళ్లు అలా గిర్రున తిరిగాక, గడ్డంతో, గాగుల్స్‌తో స్టయిలిష్‌గా, కేర్‌లెస్‌గా ఎంట్రీనిచ్చే కాలేజ్‌ క్యారెక్టర్‌లో నాగచైతన్య అదరగొట్టేసాడు. అతని కెరీర్‌లో ఇదే బెస్ట్‌ లుక్‌ అని చెప్పవచ్చు. ఆ బాడీ లాంగ్వేజ్‌, ఆటిట్యూడ్‌ చాలా స్ట్రయికింగ్‌గా, ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. తన కాలేజ్‌కి కొత్తగా వచ్చిన లెక్చరర్‌తో (శృతిహాసన్‌) లవ్‌లో పడే స్టూడెంట్‌గా చైతన్య అభినయం ఆకట్టుకుంటుంది. ప్రేమమ్‌కి ఈ ఎపిసోడే ప్రాణంగా నిలిచింది. ఒరిజినల్‌లో నివిన్‌ పాలీ, సాయి పల్లవి ఈ పార్ట్‌ని ఇమ్మోర్టల్‌ చేసేసారు. వాళ్లని ఇమిటేట్‌ చేయడానికి ట్రై చేయకుండా, ఆ ఎపిసోడ్‌కి వచ్చిన అప్రీసియేషన్‌ గురించి ఎక్కువ ఆలోచించకుండా తమ శైలిలో దీనిని చైతన్య, శృతి రక్తి కట్టించారు.     

హీరో చివరిగా తన ప్రేమ మజిలీ చేరుకునే భాగం మలయాళంలో కూడా అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. ఆ పార్ట్‌లో శ్రీనివాసరెడ్డి కామెడీ ఎపిసోడ్‌తో నవ్వించినా కానీ ఆ బలహీనతని చందు మొండేటి సైతం కవర్‌ చేయలేకపోయాడు. అలాగే థర్టీ ప్లస్‌ ఏజ్‌లో తనకంటే వయసులో చాలా చిన్నదైన అమ్మాయితో (మడోన్నా సెబాస్టియన్‌) హీరో ప్రేమలో పడడం అనేది ఇక్కడ అంతగా రిజిష్టర్‌ అవలేదు. నాగచైతన్య ఆ మెచ్యూర్డ్‌ లుక్‌లోను కుర్రాడిలానే అనిపిస్తే, మడోన్నా అతనికంటే పెద్దదిలా కనిపించింది. 

దర్శకుడిగా చందు మొండేటి చేసిన చిన్న చిన్న ఛేంజెస్‌ కొన్ని చాలా ఎఫెక్టివ్‌గా అనిపిస్తాయి. హీరోకి కుకింగ్‌ ఇష్టమని, అతని బలమేంటో గుర్తించేలా చేసింది ఆ లెక్చరరేనని, ఆమె దూరమైనా కానీ ఆమె స్ఫూర్తితో అతను జీవితంలో స్థిరపడ్డాడని చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. అలాగే 'స్వీట్‌' సీన్‌ని క్లయిమాక్స్‌లో భలేగా కనెక్ట్‌ చేసారు. డైలాగ్‌ లేకుండానే తనని విక్రమ్‌ ఇంకా మర్చిపోలేదనే విషయాన్ని సితారకి తెలియజెప్పడం, అలాగే అతనెవరన్నది తనకి గుర్తుందని మనకి తెలిసేట్టు చేయడం ఇంప్రెసివ్‌ టచ్‌. డైరెక్టర్‌గా చందు టాలెంట్‌ ఇలాంటి చిన్న చిన్న విషయాలతోనే ప్రస్ఫుటమవుతుంది.

ఫస్ట్‌ ఎపిసోడ్‌లో సహజత్వం లోపించడం, లాస్ట్‌ ఎపిసోడ్‌లో డెప్త్‌ లేకపోవడం 'ప్రేమమ్‌'ని ఒక పరిధికి పరిమితం చేస్తాయి. చైతన్య, శృతిహాసన్‌ల ఎపిసోడ్‌ మాత్రం బలహీనతల్ని కవర్‌ చేసే బలంగా నిలిచి సక్సెస్‌ కావడానికి దోహదం చేస్తుంది. గోపి సుందర్‌ ఒక రెండు, మూడు పాటలు కంపోజ్‌ చేసాడు కానీ సంగీత పరంగా ఒరిజినల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ రాజేష్‌కే క్రెడిట్‌ ఇవ్వాలి. ఇందులోని బెస్ట్‌ సాంగ్స్‌ అన్నీ అతను కంపోజ్‌ చేసినవే. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా దాదాపు మలయాళం వెర్షన్‌లోనిదే రిపీట్‌ చేశారు. విజువల్‌గా కూడా ప్రేమమ్‌ చాలా బాగుంది. ప్రత్యేకించి ఎవరే పాట తీసిన విధానం విశేషంగా ఆకట్టుకుంటుంది. సంభాషణలు సహజంగా, అదే సమయంలో నవ్వించేలా ఉన్నాయి. రన్‌ టైమ్‌ కేవలం రెండు గంటల పది నిమిషాలే అయినా కానీ మూడు భాగాలుగా సాగే కథ కావడంతో లెంగ్తీ అనిపిస్తుంది. 

నాగచైతన్య కెరీర్‌ బెస్ట్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. నటుడిగా తనకి తానే పెట్టుకున్న పరీక్షలో ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ అయ్యాడు. శృతి, అనుపమ, మడోన్నా ముగ్గురూ బాగున్నారు. నర్రా శ్రీను, బ్రహ్మాజీ కామెడీ అలరిస్తుంది. శ్రీనివాసరెడ్డి లాస్ట్‌ పంచ్‌ అదిరింది. హీరో స్నేహితుడిగా ప్రవీణ్‌కి మరో గుర్తుండిపోయే పాత్ర దక్కింది. నటుడిగా అతడిని ఈ సినిమా మరో మెట్టెక్కిస్తుంది. చైతన్యకృష్ణ, అరవింద్‌కృష్ణ తదితరులు తమవంతు సహకారం అందించారు. వెంకటేష్‌ సీన్‌ బాగా పేలింది. చివర్లో నాగార్జున ఎంట్రీ సర్‌ప్రైజ్‌ చేస్తుంది. 

ప్రేమమ్‌కి క్లాసిక్‌గా గుర్తుండిపోయే లక్షణాలు లేవు కానీ ఒక మంచి ప్రేమకథని వీక్షించిన అనుభూతి అయితే గ్యారెంటీ. సవాలక్ష ప్రేమకథల మధ్య ఎప్పుడైనా వచ్చే ఇలాంటి రిఫ్రెషింగ్‌ లవ్‌స్టోరీ తప్పకుండా టార్గెట్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా ఫుల్‌ మార్క్స్‌ వేయించుకున్నా, ఎమోషనల్‌గా కదిలించే సీన్స్‌ కూడా ఉండి ఉంటే నెక్స్‌ట్‌ లెవల్‌కి వెళ్లి ఉండేది. 

బోటమ్‌ లైన్‌: అలరించే ప్రేమానుభూతులు!

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri