అమరావతి కథలు.. ఉద్యోగుల వెతలు.!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నుంచి పూర్తిస్థాయిలో పరిపాలన షురూ అయ్యింది. అక్టోబర్‌ 3 నుంచి దాదాపుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ అమరావతి నుంచే పనిచేస్తున్నాయి. హైద్రాబాద్‌ నుంచి సెక్రెటేరియట్‌ని అమరావతిలోని వెలగపూడికి తరలించేసిన విషయం…

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నుంచి పూర్తిస్థాయిలో పరిపాలన షురూ అయ్యింది. అక్టోబర్‌ 3 నుంచి దాదాపుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ అమరావతి నుంచే పనిచేస్తున్నాయి. హైద్రాబాద్‌ నుంచి సెక్రెటేరియట్‌ని అమరావతిలోని వెలగపూడికి తరలించేసిన విషయం విదితమే. ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాల్ని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం అమరావతి నుంచి హైద్రాబాద్‌కి ఉద్యోగులు తిరిగొచ్చేందుకు వీలుగా రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించేశారు. మళ్ళీ సోమవారం తెల్లవారు ఝామునే వారంతా వెలగపూడికి చేరుకునేలా బస్సుల్ని ఏర్పాటు చేశారు. 

'హమ్మయ్య.. ఇక పరిపాలనలో వేగం పెంచేస్తాం..' అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 'ఇప్పటికి నిలదొక్కుకున్నాం' అన్న భావన ఆయన మాటల్లో కన్పిస్తోంది. కానీ, ఉద్యోగులకు ఇక్కడే సమస్య మొదలయ్యింది. హైద్రాబాద్‌లో ఫ్యామిలీ, అమరావతిలో బ్యాచిలర్‌ లైఫ్‌. ఇదీ ఉద్యోగుల దయనీయ స్థితి. 'ఇది స్వయంకృతాపరాధం' అన్న భావన ఓవైపు, ప్రభుత్వ నిర్లక్ష్యం అనే వాదన ఇంకో వైపు విన్పిస్తోంది. 

రాష్ట్ర విభజన తర్వాత, నేడు కాకపోతే రేపు.. నెల రోజుల తర్వాత కాకపోతే ఏడాది తర్వాత.. అమరావతికి వెళ్ళాల్సిందేనని ఉద్యోగులు ముందే ఓ నిర్ణయానికి వచ్చేసి వుండాలి. కానీ, అలా జరగలేదు. పదేళ్ళు హైద్రాబాద్‌పై మాకు హక్కు వుందంటూ అధికార పార్టీ చెప్పిన మాటల్ని నమ్మి, ఉద్యోగులు మోసపోయారు. ఓటుకు నోటు కేసు తర్వాతగానీ, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీకి అమరావతి గుర్తుకు రాలేదు. అప్పటినుంచీ ఇప్పటిదాకా పరిస్థితుల్ని గమనించాక అయినా ఉద్యోగులు ఓ అవగాహనకి వచ్చి వుంటే ఇప్పుడిలా, 'బ్యాచిలర్‌ లైఫ్‌' గడపాల్సిన అవసరమే వచ్చేది కాదు. 

కారణాలేవైతేనేం, ఉద్యోగులు అమరావతిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. 'చెట్టుకింద పరిపాలన.. టెంట్లు వేసుకున పరిపాలనతో పోల్చితే ఇది చాలా నయ్యం..' అని స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ యధాలాపంగా చెప్పేశారుగానీ, ప్రభుత్వాధినేతలకు, అమాత్యులకు దక్కిన సౌకర్యాలు ఉద్యోగులకు లభించవు కదా.! చంద్రబాబు తన నివాసం కోసం కోట్లు వెచ్చించుకున్నారు.. ప్రభుత్వ ఖజానా నుంచి. ఉద్యోగులకు ఆ చాన్స్‌ వుండదు కదా.! 

ప్రస్తుతానికైతే కష్టంగానే వున్నా అమరావతిలో సర్దుకుపోతున్న ఉద్యోగులు, ఇష్టంగానే అమరావతిలో కుదురుకోవాలంటే కొంత సమయం పడుతుంది. అదెంత సమయం.? అన్నది ప్రభుత్వం, ఉద్యోగులపై చూపించే శ్రద్ధ మీద ఆధారపడి వుంటుంది. ఒక్కటి మాత్రం నిజం, అమరావతి శంకుస్థాపన జరిగిన ఏడాదికి.. అమరావతిలో ప్రభుత్వ కార్యకలాపాలు షురూ అయ్యాయి. తాత్కాలిక సచివాలయంతోపాటుగా, రాజధాని నిర్మాణ పనులు కూడా ఎంతో కొంత ప్రారంభమయి వుంటే ఇంకా బావుండేదేమో.!