పవన్ కళ్యాణ్ అమాయకుడని ఇప్పుడు ఎవరు అనలేదు. మనిషి అన్నాక ఆ మాత్రం తెలివితేటలు ఎలాగూ వుంటాయి. అయితే పవన్ కు వున్నతెలివి తేటలు వేరు. చంద్రబాబును ఆపత్ సమయంలో ఆదుకునేందుకు రాజకీయ రంగప్రవేశం చేస్తే ఏమి? బాబు అధికారంలోకి వచ్చాక రెండు సార్లు చాలా కన్వీనియెంట్ గా బయటకు వచ్చి, ఏదేదో మాట్లాడి, లోపలకు వెళ్లిపోతే ఏమి? ఇలా ఇంకా చాలా చాలా వున్నాయి. ఏకరవు పెట్టాలంటే. అయితే ఇప్పుడు మరో తెలివి తేటల వైనం కూడా బయటపడింది.
జనసేన ప్రజలతో టచ్ లో వుండేందుకు వీలుగా సోషల్ నెట్ వర్క్ లో ప్రవేశిస్తోంది అని ఈ రోజు బ్రహ్మాండంగా ప్రకటించారు. సరే, పవన్ బాబు ఎలాగూ సినిమాల్లో బిజీ అయిపోయారు, హోదా పోరును మరిచిపోయారు. కానీ జనం జనసేనను మరిచిపోకుండా ఇలా ఏదో రూపంలో కనిపిస్తున్నారు అనుకుని, యూ ట్యూబ్ చానెల్ చూస్తే…
కేవలం జనసేన మోషన్ పోస్టర్, తిరుపతి స్పీచ్ రెండు భాగాలు తప్ప మరో విడియో లేదు. మరి జనసేన ఆవిర్భావంలో స్టార్ హోటళ్లలో పవన్ చేసిన స్పీచ్ విడియోలు ఏమయినట్లు? అవి కదా ఇప్పుడు జనానికి గుర్తు చేయాల్సింది.
మరి కాకినాడలో వెంకయ్య మీద, కాస్త బాబు మీద రంకెలు వేసిన విడియోలు ఏమయ్యాయి. హొదామీద ఉద్యమం చేస్తా అన్నది అక్కడే కదా? మరి ఆ విడియోలు కదా జనానికి కావాల్సింది. భూ సమీకరణ మీద వెళ్లి మాట్లాడిన మాటల విడియోలు ఏమయ్యాయి. అవి కదా అక్కడి వారికి గుర్తు చేయాల్సింది.
మరి ఈ విడియోలు అన్నీ వదిలేసి, కర్ర విరగకుండా, పాము చావకుండా తిరుపతిలో మాట్లాడిన విడియోలు మాత్రం ఎందుకు లోడ్ చేసినట్లు? జనం కూడా తెలివైన వారే ఈ పెట్టిన విడియోలకు గట్టిగా వంద నుంచి రెండు వందల వ్యూస్ మించి రాలేదు అంటే అంతే అనుకోవాలి కదా? అదే కనుక పైన చెప్పిన విడియోలు పెడితే, వ్యూస్ మాట దేవుడెరుగు, కామెంట్లు వస్తాయి..బోలెడు. అదీ విషయం.