'మా దగ్గర అణుబాంబులున్నాయ్ జాగ్రత్త.. క్షణాల్లో భారతదేశాన్ని సర్వనాశనం చేసెయ్యగలం.. సర్జికల్ స్ట్రైక్స్‌కి తెగబడితే, భారతదేశానికి ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు.. మేం గతంలోలా లేం, ఇప్పుడు చాలా బలంగా ఉన్నాం.. భారత్ ఊహించినదానికంటే ఎక్కువ నష్టం ఆ దేశానికి కలిగించగలం..'
– 'యురీ' ఘటన తర్వాత పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రకటనలివి. ప్రకటనలు అనడం కన్నా, ప్రేలాపనలు అనడం సబబేమో.!
కత్తి లేదా తుపాకీ ఒకరి దగ్గర వుంటే, వాటితో బెదిరింపులకు పాల్పడితే అర్థం వుంటుంది. కానీ, ఇద్దరి వద్దా ఆయుధాలున్నప్పుడు బెదిరింపులకు దిగితే, ఆ బెదిరింపుల వెనుక 'భయం' వుందనే విషయం బయటపడుతుంది. ఇక్కడ, పాకిస్తాన్ బెదిరింపుల్లో 'భయమే' బయటపడింది. పాకిస్తాన్‌కి తెలుసు, భారత్‌తో యుద్ధం చేస్తే ఏమవుతుందో. అయితే, భారతదేశంలా పాకిస్తాన్‌లో నిర్ణయాలు సమిష్టిగా వుండవు. సైన్యం ఒకలా, రాజకీయాలు ఇంకొకలా, ప్రజలు మరొకలా వుంటారు.
పాకిస్తాన్ సైన్యానిది మొదటి నుంచీ ఒకటే గొడవ, భారత్‌పై యుద్ధం చేసెయ్యాలని. చేస్తూనే వుంది, చావు దెబ్బ తింటూనే వుంది. పాకిస్తాన్ ప్రభుత్వం పరిస్థితి వేరు. అక్కడ ప్రజల పరిస్థితి ఇంకా వేరు. పాకిస్తాన్‌పై భారత సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాకిస్తాన్ నుంచి శాంతి వచనాలు ఎక్కువైపోయాయి. యుద్ధాన్ని తాము కోరుకోవడంలేదంటూ కొత్త వాదనను తెరపైకి తెస్తోంది.
సర్జికల్ స్ట్రైక్స్ విషయంలోనూ నిన్న మొన్నటిదాకా వున్న సస్పెన్స్ పాకిస్తాన్‌లో ఇప్పుడు లేదు. సర్జికల్ స్ట్రైక్స్ అన్న పదం వాడలేదుగానీ, భారత్ జరిపిన దాడుల్లో ఇద్దరు సైనికులు మరణించినట్లు పాకిస్తాన్ పార్లమెంటులో ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించారు. మరోపక్క, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని మీర్‌పూర్ ఎస్పీ, భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిన మాట వాస్తవమేనంటూ, ఆ దాడుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేశారు. మేటర్ క్లియర్.. ఇక పాకిస్తాన్ బుకాయించడానికేమీ లేదు. పాకిస్తాన్ మీడియా కూడా ఈసారి సైలెంట్ అయిపోయింది. పాకిస్తాన్ ప్రజలూ షాక్‌కి గురయ్యారు.
ఒకదాని తర్వాత ఒకటి.. ఒకదానితో సంబంధం లేని ప్రకటన ఇంకోటి. వెరసి, పాకిస్తాన్ ఎంత గందరగోళంలో వుందో అర్థమయిపోతోంది. పాకిస్తాన్ అణుబాంబుల్ని బయటకు తీసేలోపు పాకిస్తాన్ సర్వనాశనమైపోతుందనే విషయం ఇప్పుడిప్పుడే పాకిస్తాన్‌లో ప్రధాని నవాజ్ షరీఫ్ సహా అందరికీ అర్థమవుతోంది. అందుకే, ఇప్పుడీ శాంతి మంత్రం. అయినప్పటికీ కూడా పాకిస్తాన్‌ని నమ్మడానికి వీల్లేదు.
పాకిస్తాన్, భారత్‌తో యుద్ధం చేయడానికి సుముఖంగా లేదుగానీ, భారత్‌పైకి తీవ్రవాదాన్ని ఎగదోస్తూనే వుంటోంది. పాకిస్తాన్ సైన్యం సహాయంతో పారా ట్రూపర్ల తరహాలో 100 మంది తీవ్రవాదుల్ని భారత్‌లోకి పంపించి, మారణహోమం సృష్టించేందుకు అప్పుడే ప్రయత్నాలు షురూ అయ్యాయి. ఎదురొడ్డి పోరాడే ధైర్యం లేక, ఇదిగో ఇలాంటి దొంగచాటు చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పుడే భారత సైన్యం, భారత ప్రభుత్వం ఇంకా అప్రమత్తంగా వుండాలి.
చివరగా: సర్జికల్ స్ట్రైక్స్‌పై ఆధారాలు అడిగిన సోకాల్డ్ ఇండియన్ పొలిటీషియన్స్‌కి.. పాకిస్తాన్ నుంచి వచ్చిన సమాధానం సరిపోతుందా.?