గెట్ రెడీ ఫర్.. అంటూ గత కొద్ది రోజులుగా సంకేతాలు అందుతున్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌పై ఆల్రెడీ ఓ సారి సర్జికల్ స్ట్రైక్స్ ఇటీవలే నిర్వహించిన భారత సైన్యం, మరోమారు అదే తరహా సర్జికల్ స్ట్రైక్స్ కోసం రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని అధ్యక్షతన ఉన్నత స్థాయిలో ఈ మేరకు గత కొద్ది రోజులుగా మంతనాలు జరుగుతున్నాయి. అయితే, మొదటిసారి మెరుపుదాడులు చేసినంత తేలిగ్గా రెండోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయడం కష్టం కాబట్టి, ఈసారి చేసే సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో ఇంకా అప్రమత్తంగా వుండాలనే అభిప్రాయాలు ఇటు ప్రభుత్వం నుంచీ, అటు భారత సైన్యం నుంచీ వ్యక్తమవుతోంది.
వాస్తవానికి సర్జికల్ స్ట్రైక్స్ కోసమే భారత సైన్యంలో కొన్ని టీమ్‌లు నిరంతరం శిక్షణ పొందుతూనే వుంటాయి. కాబట్టి, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించే మెరుపు వేగం, ఖచ్చితత్వం ఆ టీమ్‌ల సొంతం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. 'అసలు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయా.?' అనే అనుమానాలు కొన్ని రాజకీయ పార్టీల నుంచి వ్యక్తమవుతున్నా, అవేవీ భారత సైన్యంపై ప్రభావం చూపబోవు.
ఇక, మళ్ళీ సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిన అవసరమేంటి.? అన్న ప్రశ్నకు, బోర్డర్‌లో 100 మందికి పైగా తీవ్రవాదుల్ని పాకిస్తాన్ సైన్యం మోహరించడమే అందుకు కారణం అనే వాదన తెరపైకొస్తోది. ఎన్‌ఎస్‌ఎ అజిత్ దోవల్ కేంద్రానికి ఇచ్చిన తాజా నివేదికలో పాకిస్తాన్, సర్జికల్ స్ట్రైక్స్‌పై ఆగ్రహంతో ఊగిపోతోందనీ, ఈ నేపథ్యంలోనే ఈసారి పాక్ సైన్యం పూర్తిస్థాయిలో తీవ్రవాదులకు మద్దతిచ్చి, బోర్డర్ ద్వారా భారత్‌లోకి వారిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారట.
ఓ పక్క, పాక్ – భారత్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం, విచ్చలవిడిగా కాల్పులు జరుపుతోంది గత కొద్ది రోజులుగా. ఈ కాల్పుల వెనుక ఉద్దేశ్యం, తీవ్రవాదుల్ని బారత్‌లోకి పంపించడమే. అయితే, భారత సైన్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క తీవ్రవాది కూడా బోర్డర్ దాటి దేశంలోకి వచ్చేందుకు వీల్లేకుండా చర్యలు చేపట్టామని చెబుతోంది. అదనుకోసం పాకిస్తాన్ సైన్యం, అక్కడి తీవ్రవాదులు ఎదురుచూస్తున్న ఈ సమయంలోనే రిస్క్ చేసి, రెండో దఫా సర్జికల్ స్ట్రైక్స్ చేయడమే ఉత్తమమని అజిత్ ధోవల్ కేంద్రానికి తేల్చి చెప్పిన దరిమిలా, సర్జికల్ స్ట్రైక్స్ పార్ట్-2పై కొద్ది రోజుల్లోనే 'ప్రకటన' వచ్చే అవకాశం వుంది. ఆ ప్రకటన, సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని మాత్రమే కానుంది.