ఓ పని పూర్తి చేయాలనుకున్నప్పుడు అది అవుతుందో కాదో తెలియనప్పటికీ ముందైతే మన వంతుగా ప్రయత్నాలు చేయాలి కదా. దీన్నే 'అయినను పోయి రావలె'…అని ఓ జాతీయంగా కొందరు వాడుతుంటారు.
కౌరవులతో యుద్ధం తప్పదని తెలిసి కూడా దాన్ని ఆపడానికి చివరిక్షణం వరకు ప్రయత్నించాలని కృష్ణుడు రాయబారం వెళతాడు. ఆ సందర్భంగానే ఆయన 'అయినను పోయి రావలె'..అంటాడు. అదే విధంగా విదేశాల నుంచి ఎంతమేరకు పెట్టుబడులు వస్తాయో తెలియదు. అయినప్పటికీ విదేశాలకు వెళ్లి పెట్టుబడుల కోసం ప్రయత్నించాలనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విధానం. అందుకే ఆయన 'అయినను పోయి రావలె'…అనుకుంటూ అధికారంలోకి వచ్చినప్పటినుంచి విదేశాలకు తిరుగుతూనే ఉన్నారు.
ఇప్పటికే చాలా దేశాలకు వెళ్లారు. అక్కడ అనేక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ప్రకటనలు ఇస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. కాని చంద్రబాబు ప్రచారం చేస్తున్నట్లుగా పెట్టబడులు రావడంలేదని ప్రతిపక్షాలు చెబుతుంటే, టీడీపీ అనుకూల మీడియాలో 'పెట్టుబడుల వరద' అంటూ కథనాలొస్తున్నాయి.
ఇప్పటివరకు అమెరికా, చైనా, జపాన్, సింగపూర్, మలేషియా, రష్యా, కజక్‌స్తాన్…ఇలా ఎన్నో దేశాల్లో పర్యటించి అక్కడి వివిధ కంపెనీలతో బాబు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటిల్లో ఎన్ని ఒప్పందాలు వర్కవుట్ అయ్యాయనేది సరిగా తెలియదు. ఇప్పటివరకు బాబు పర్యటించిన దేశాల నుంచి కోట్లాది రూపాయల పెట్టుబడులు వస్తున్నట్లు ప్రచారం జరిగింది. కాని బాబు కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఇప్పటివరకు మూడు నాలుగు ఒప్పందాలకు మించి కార్యరూపం దాల్చలేదని ఓ ఆంగ్ల పత్రిక తెలియచేసింది. అయినప్పటికీ తాను దేశదేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకొస్తుంటే అధికారులు సరిగా వ్యవహరించడంలేదని వారిపై మండిపడుతున్నారు.
ఇప్పటివరకు ఎంతమేరకు పెట్టుబడులు వచ్చాయో, ఎన్ని పరిశ్రమలు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్సీపీ పలుమార్లు డిమాండ్ చేసింది. కాని బాబు సర్కారు స్పందించలేదు. ఇక 2016 ముగుస్తున్న దశలో త్వరలో చంద్రబాబు రెండు దేశాలకు వెళ్లబోతున్నారు. అవి: అమెరికా, దక్షిణ కొరియా. ప్రస్తుతం నిర్ణయించినదాని ప్రకారం నవంబరు 13 నుంచి 20 వరకు అమెరికాలో పర్యటిస్తారు. అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశాలు జరుపుతారు. ప్రధానంగా ప్రవాసాంధ్రులను మోటివేట్ చేయాలని నిర్ణయించారు.
గతంలో చంద్రబాబు పెట్టుబడుల కోసం తన కుమారుడు లోకేష్‌ను కూడా అమెరికా పంపారు. మరి అక్కడ ఆయన ఏం సాధించుకొచ్చారో తెలియదు. అమెరికా నుంచి తిరిగొచ్చిన తరువాత బాబు డిసెంబరులో దక్షిణ కొరియాకు వెళతారు. ఇది ఆల్రెడీ చాలా కాలం క్రితమే నిర్ణయమైన పర్యటన అయినప్పటికీ ఏవో కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. బాబు విదేశీ పర్యటనల లక్ష్యం కేవలం పరిశ్రమలు పెట్టడం కాదు. విదేశాలను అమరావతి నగర నిర్మాణంలో భాగస్వాములను చేయడం కూడా. ఆయన ఏ దేశానికి వెళితే ఆ దేశ ప్రభుత్వాన్ని 'అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కండి' అని అభ్యర్థిస్తున్నారు. అంటే పారిశ్రామిక రంగంలో, రాజధాని నిర్మాణంలోనూ విదేశీయులదే కీలక పాత్ర.
అత్యధిక విదేశీ పర్యటనలతో మోదీ ఇప్పటికే రికార్డు సృష్టించారు. ఆయన పర్యటనల అజెండా కూడా పెట్టుబడిదారులను ఆహ్వానించడమే. మోదీ తరువాత విదేశీ పర్యటనల్లో చంద్రబాబుదే రికార్డని వైఎస్సార్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. విదేశీ పెట్టుబడులు కావాలనుకోవడంలో తప్పులేదుగాని మరీ అతిగా విదేశీ జపం చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.
చంద్రబాబు విదేశీ పర్యటనలకు రోజుకు పదకొండు కోట్లు ఖర్చవుతున్నాయని ఈ ఏడాది జూలైలో వైకాపా తెలియచేసింది. బాబు ప్రజా ధనాన్ని ఎలా వృథా చేస్తున్నారో, ఇప్పటిరకు ఏఏ పనులకు ఎంతెంత ఖర్చు చేశారో జాబితా విడుదల చేసింది. విదేశీ పర్యటనలు చంద్రబాబుకే పరిమితం కాలేదు. వివిధ విషయాల అధ్యయనం కోసం మంత్రులు, అధికారులూ విదేశీ పర్యటనలు చేస్తూనే ఉన్నారు. వీరు బృందాలుగా వెళుతుండటంతో ఖర్చు తడిసి మోపెడవుతోంది. తనది పారదర్శక పరిపాలన అని, నిప్పులాంటివాడినని చెప్పుకుంటున్న బాబు ఇప్పటివరకు విదేశీ పర్యటనలకు ఎంత ఖర్చు చేశారో చెప్పలేదు.
మీడియా, ప్రతిపక్షాల ద్వారా బయటకు వస్తున్న గణాంకాలు కొన్ని సోర్స్‌ల ద్వారా సేకరించినవి మాత్రమే. అసలు ఖర్చు వివరాలు బాబుకే తెలుసు. అమెరికా, దక్షిణ కొరియా వెళ్లొస్తే ఈ ఏడాది కోటా అయిపోయినట్లే. వచ్చే ఏడాది ఎన్ని దేశాలు తిరుగుతారో….!