మోడీ – బాబు, సింగ’పూర్‌’-అమరావతి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారికి సింగపూర్‌ ఊసెత్తకపోతే తెల్లారదు. పొద్దున్న లేస్తూనే, ఆయన సింగపూర్‌ జపం చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తాన్నీ సింగపూర్‌లా మార్చేస్తానంటారాయన. రెండున్నరేళ్ళ నుంచీ ఇవే…

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారికి సింగపూర్‌ ఊసెత్తకపోతే తెల్లారదు. పొద్దున్న లేస్తూనే, ఆయన సింగపూర్‌ జపం చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తాన్నీ సింగపూర్‌లా మార్చేస్తానంటారాయన. రెండున్నరేళ్ళ నుంచీ ఇవే కథలు చెబుతున్నారు. ఏదీ ఎక్కడ.? సింగపూర్‌లా అయిపోవడం కాదు, కనీసం సింగపూర్‌లా అయ్యేందుకు ఒక్కంటంటే ఒక్క కార్యక్రమం అయినా చేపట్టారా.? అంటే, ఆన్సర్‌ దొరకదంతే.! 

ఇక, తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ నోట సింగపూర్‌ – ఆంధ్రప్రదేశ్‌ అన్న మాటలొచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి సింగపూర్‌ సహకరిస్తోందన్న విషయాన్ని నరేంద్రమోడీ ప్రస్తావించారు. పాపం మోడీ, అమరావతి నిర్మాణంలో సింగపూర్‌ సంస్థలు పెట్టిన షరతులు, ఈ కారణంగా స్విస్‌ ఛాలెంజ్‌ విధానం వివాదాస్పదం.. ఇవన్నీ ఆయనకు తెలియవేమో. ఆగండాగండీ, ఆ మాత్రం తెలియకుండా వుండదుగానీ, తెలియనట్లు నటిస్తున్నారంతే.! 

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం కోసం లక్షన్నర కోట్ల దాకా ఖర్చవుతుందని చంద్రబాబు లెక్కలేశారు. ఆయనకి 'లక్ష కోట్లు' అన్న ఫిగర్‌ అంటే అదో ఇది. కానీ, కేంద్రం ఓ వెయ్యి కోట్లు విదిలించి ఊరుకుంది. 'ఢిల్లీని తలదన్నే రాజధానిని ఆంధ్రప్రదేశ్‌కి నిర్మించి ఇస్తాం..' అని నరేంద్రమోడీ, 2014 ఎన్నికల సమయంలో చెప్పారుగానీ, ఎన్నికల సమయంలో ఇచ్చే మాటలకీ, ఎన్నికలయ్యాక చేసే చేతలకీ చాలా తేడా వుంటుంది కదా. ఇక్కడా అదే జరిగిందంతే.! 

ఇక, సింగపూర్‌తో భారత ప్రభుత్వం పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. మామూలుగా అయితే, సింగపూర్‌ ప్రధాని భారత్‌కి వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళిపోవాలి. కానీ, అలాంటిదేమీ జరగలేదు. పోనీ, సింగపూర్‌ ప్రధానిని విజయవాడకు చంద్రబాబు రప్పించగలిగారా.? అంటే అదీ లేదు. మరి, సింగపూర్‌ – అమరావతికి సహకరిస్తుందని ఎలా అనుకోగలం.? 

'నన్ను చూసే ఉచితంగా సింగపూర్‌ కంపెనీలు రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ని రెడీ చేస్తున్నాయి..' అని గతంలో చంద్రబాబు చెప్పుకున్నారు. సింగపూర్‌కి చెందిన పలువురు ప్రముఖుల్ని చంద్రబాబు రప్పించుకున్నారు కూడా. ప్చ్‌, చంద్రబాబు ఇమేజ్‌ సింగపూర్‌ మంత్రులు, అధికారుల వరకు మాత్రమే పనికొచ్చినట్టుంది. అందుకే, సింగ'పూర్‌ – అమరావతి.. ఇంకా మాటలకే పరిమితమయ్యింది.