‘గుండె చప్పుడు’ – ఆకాశమే హద్దు.!

ఒక్కసారి కాదు, ఒకటికి రెండు సార్లు బతుకు.. ఇదీ అవయవదానంపై దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రచారం. కానీ, అవయవదానంపై అవగాహన మాత్రం అంతంతమాత్రమే. గతంతో పోల్చితే, ఇప్పుడు కాస్తంత మెరుగైన…

ఒక్కసారి కాదు, ఒకటికి రెండు సార్లు బతుకు.. ఇదీ అవయవదానంపై దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రచారం. కానీ, అవయవదానంపై అవగాహన మాత్రం అంతంతమాత్రమే. గతంతో పోల్చితే, ఇప్పుడు కాస్తంత మెరుగైన మాట వాస్తవం. మనిషి బతికుండగానే అవయవదానం చేయాల్సిన పనిలేదు, బ్రెయిన్‌ డెడ్‌ కేసుల్లో మాత్రమే అవయవదానం చెయ్యమంటున్నారు వైద్యులు. తద్వారా ఇంకొకరి ప్రాణాల్ని నిలబెట్టవచ్చని చాలాకాలంగా ప్రభుత్వాలు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలూ ప్రచారం చేస్తూనే వున్నాయి. 

ఈ మధ్యకాలంలో అయితే, ఆ ప్రచారానికి స్పందన ఓ మోస్తరుగానే అయినా లభిస్తుండడం అభినందనీయం. ఓ గుండె చెన్నయ్‌ నుంచి హైద్రాబాద్‌కి వచ్చింది. ఓ గుండె విజయవాడ నుంచి చెన్నయ్‌కి వెళ్ళింది. దేశవ్యాప్తంగా ఈ తరహా గుండె మార్పిడి చికిత్సలు జోరందుకుంటున్నాయి. కిడ్నీ మార్పిడి ఎప్పటినుంచో జరుగుతున్నదే. కళ్ళు, కాలేయం.. ఇలా శరీరంలోని పలు అవయవాల్ని బ్రెయిన్‌ డెడ్‌ కేసుల్లో గనుక దానం చేయగలిగితే, చాలావరకు దేశంలో 'అవయవదానం' కోసం ఎదురుచూస్తున్నవారికి ఉపశమనం కలుగుతుంది. 

తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో మరో గుండె మార్పిడి జరుగుతోంది. ఆఘమేఘాల మీద గుండెను నెల్లూరు నుంచి గుంటూరుకి తరలించి, గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో గుండె మార్పిడి చికిత్స చేస్తున్నారు. నెల్లూరులో బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచి గుండెతోపాటు కిడ్నీలు, కళ్ళు, కాలేయం, ఊపిరి తిత్తుల్ని కూడా సేకరించి, దేశంలోని పలు ఆసుపత్రులకు వాటిని తరలించారు. ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా గుండెను నెల్లూరు నుంచి గుంటూరుకు తరలించడం గమనార్హం. ఈ తరహాలో హెలికాప్టర్‌లో గుండెను తరలించడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రథమం. 

విమానాల్లో తరలించే క్రమంలో విమానాశ్రయం నుంచి ఆసుపత్రికి వెళ్ళేదారిని పోలీసులు ట్రాఫిక్‌ ఇబ్బందుల్లేకుండా చేయడంతో, దాదాపుగా గుండె మార్పిడి చికిత్సలన్నీ సకాలంలోనే పూర్తయి, సత్ఫలితాలనిస్తున్నాయి. ఏ మాటకామాటే చెప్పుకోవాలి, ఈ మధ్యకాలంలో తరచూ గుండె మార్పిడి చికిత్సల గురించి వింటున్నాం. అయినాసరే, అవగాహన ఇంకా పెరగాలి. ప్రభుత్వాలు ఈ దిశగా అవగాహనా కార్యక్రమాల్ని మరింత ముమ్మరం చేయాలి. ఓ గుండె చప్పుడు ఇంకో గుండెకే తెలుస్తుంది.. అన్న మాట అక్షరాలా నిజం. అవును, అన్ని దానాల్లోకీ అవయవదానమే మిన్న.