జై జవాన్‌: ఏమిచ్చి రుణం తీర్చుకోగలం.?

టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలిస్తే.. ఆటగాళ్ళ మీద కోట్లాది రూపాయల కనక వర్షం కురుస్తుంది. క్రికెట్‌కే కాదు, ఇతర క్రీడలకీ ఇప్పుడు ఆ స్థాయిలోనే కాసుల పంట పండుతోంది. ఈ విషయంలో మరీ, పోటీ…

టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలిస్తే.. ఆటగాళ్ళ మీద కోట్లాది రూపాయల కనక వర్షం కురుస్తుంది. క్రికెట్‌కే కాదు, ఇతర క్రీడలకీ ఇప్పుడు ఆ స్థాయిలోనే కాసుల పంట పండుతోంది. ఈ విషయంలో మరీ, పోటీ ఎక్కువైపోయింది. ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. వ్యక్తులూ పోటీ పడుతున్నారు. సంస్థల సంగతి సరే సరి. క్రీడాకారుల ఘనతను ఈ నజరానాలతో పోల్చలేంగానీ, నజారానాలు ఆటగాల్ళలో కొత్త ఉత్సాహం నింపుతాయనేది నిర్వివాదాంశం. అయినాసరే, ఈ విషయంలో 'అతి' కాస్త ఎక్కువైపోయిందని ఒప్పుకోక తప్పదు. 

ఆటగాళ్ళ మీద కోట్లాది రూపాయల కనక వర్షం కురిపిస్తున్నారు సరే, సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణ త్యాగం చేస్తోన్న సైనికుల మాటేమిటి.? ఇదిప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమువుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సైనికొడకరు ఇటీవల పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదుల దాడిలో సరిహద్దుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. నడవలేని పరిస్థితి. మామూలుగా ఇలాంటి పరిస్థితుల్లో వున్న వ్యక్తులకు కేంద్రం నుంచి కాస్తో కూస్తో సాయం అందుతుంది. కానీ, ఆ సాయం వారికి ఏమాత్రం సరిపోదు. 

ఇలాంటివారి కోసమే, తాజాగా గుజరాత్‌లో ఓ కార్యక్రమం జరిగింది. దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షణాల్లో లక్షలు పోగయ్యాయి. కోటి రూపాయలదాకా విరాళాల రూపంలో దక్కింది. కార్యక్రమ నిర్వహణతో మరో కోటి రూపాయలు వచ్చింది. ఈ మొత్తాన్ని అమరవీరుల కుటుంబాలకు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతేనా.? అమర జవాన్ల మీద జాలి చూపించడమేనా.? 

సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధమయ్యే సైన్యం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టే చర్యలు ఎన్ని వున్నా సరే, అది వారి త్యాగాలకు సమతూకం కాబోదు. ఆయా రాష్ట్రాలు సైనికుల కుటుంబాల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి తీరాల్సిందే. క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు ప్రోత్సాహిస్తున్నట్లే, సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్రాలు తమవంతుగా ముందుకు రావాల్సి వుంటుంది. 

ఎందుకంటే, సైనికులు దేశ సరిహద్దుల్లో వుంటోన్నది దేశం కోసం. ఆ దేశంలో రాష్ట్రాలూ భాగమే. తమ రాష్ట్రానికి చెందిన ఓ సైనికుడు అమరుడయినా, పోరాటంలో గాయపడి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినా.. అదుకోవడం రాష్ట్రాల బాధ్యతగా భావించే రోజెప్పుడొస్తుందో.? అది రానంతవరకు, ఇదిగో.. ఇలాగే 'విరాళాల కార్యక్రమాలు' కొనసాగుతుంటాయి. జై జవాన్‌.!