విరాట్‌ కోహ్లీ.. ఎందుకిలా.?

కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ క్లిక్‌ అవుతున్నాడు.. కానీ, కెప్టెన్‌ అయ్యాక కోహ్లీలో బ్యాట్స్‌మెన్‌ కాస్త ఇబ్బందిపడుతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పేలవమైన ప్రదర్శన చేసిన కోహ్లీ, రెండో టెస్ట్‌లోనూ చేతులెత్తేశాడు. అది కూడా…

కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ క్లిక్‌ అవుతున్నాడు.. కానీ, కెప్టెన్‌ అయ్యాక కోహ్లీలో బ్యాట్స్‌మెన్‌ కాస్త ఇబ్బందిపడుతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పేలవమైన ప్రదర్శన చేసిన కోహ్లీ, రెండో టెస్ట్‌లోనూ చేతులెత్తేశాడు. అది కూడా క్లిష్టమైన సమయంలో. దాంతో, కోహ్లీ ఆట తీరుపై విమర్శలు షురూ అయ్యాయి. ఒకటి రెండు మ్యాచ్‌లకే ఇలా విమర్శించేయడం తగదుగానీ, టీమిండియా ఆశలన్నీ తనపైనే వున్నప్పుడు, విమర్శలకు తావివ్వకుండా కోహ్లీ ఇంకాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలంతే. 

ఇక, టీమిండియా కూర్పు విషయంలోనూ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్‌ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ని చాన్నాళ్ళ తర్వాత జట్టులోకి పిలిచినట్లే పిలిచి, అవమానించి పంపించారు. తుది జట్టులో గంభీర్‌కి అవకాశం దక్కలేదు. గంభీర్‌తో పోల్చితే, శిఖర్‌ ధావన్‌ బెస్ట్‌.. అని కోహ్లీ భావించాడో, సెలక్టర్లు ఆదేశించారో తెలియని పరిస్థితి. శిఖర్‌ ధావన్‌ వచ్చి, ఏం చేశాడు.? ఒక్కటంటే ఒక్కటే పరుగు చేసి ఔట్‌ అయిపోయాడు. 

టీమిండియా వరకు ఈ టెస్ట్‌ అత్యంత ప్రతిష్టాత్మకం. స్వదేశంలో 250వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతోంది టీమిండియా. మొత్తంగా 501వ మ్యాచ్‌ ఇది. చారిత్రాత్మకమైన 500వ మ్యాచ్‌లో విజయం సాధించిన కోహ్లీ సేన, 250వ మ్యాచ్‌లో ఏం చేస్తుందోగానీ, తొలి ఇన్నింగ్స్‌ తొలి రోజు తొలి సెషన్‌ మాత్రం, పూర్తిగా న్యూజిలాండ్‌ బౌలర్ల ఆధిపత్యమే అయ్యింది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో మ్యాచ్‌ జరుగుతున్న విషయం విదితమే.