బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు.? ఈ ప్రశ్న బహుశా తెలుగు సినీ పరిశ్రమలో ఇంతకుముందెన్నడూ జరగనంత చర్చకు దారి తీసిందనడం అతిశయోక్తి కాదేమో. సరదాగానే అయితే, కట్టప్ప – బాహుబలిని చంపడానికి సంబంధించి కుప్పలు తెప్పలుగా కథలు తెరపైకొచ్చాయి. అంతలా 'కట్టప్ప' పాత్రకి పాపులారిటీ పెరిగింది.
కటప్ప పాత్రలో సత్యరాజ్ ఆ సినిమాలో ఏం చేశాడు.? ఎలా నటించాడు.? అన్న విషయం పక్కన పెడితే, 'బాహుబలి' పేరు చెప్పి, అందులో కట్టప్ప పేరు చెప్పి సత్యరాజ్ పేరు మాత్రం ఓ రేంజ్లో మార్మోగిపోయింది.
'కట్టప్పని బాహుబలి ఎందుకు చంపాడో నాకు తెలియదు, ఎందుకంటే ఆ సమయంలో నేను అక్కడ లేను' అని 'అవంతిక' తమన్నా సరదా సరదాగా కామెంట్ చేసింది. 'నేనుగానీ, కట్టప్ప – బాహుబలిని ఎందుకు చంపాడో చెప్పేస్తే, నన్ను రాజమౌళి చంపేస్తాడు..' అంటూ జోక్ చేశాడు రాణా. 'సినిమా ప్రారంభానికి ముందే, కట్టప్ప – బాహుబలిని ఎందుకు చంపాడో సినిమా యూనిట్ అందరికీ రాజమౌళి చెప్పేశాడు.. కానీ అది ప్రస్తుతానికి సస్పెన్స్' అని రాణా చెప్పాడనుకోండి.. అది వేరే విషయం.
ఇక, రేపు 'బాహుబలి' టీమ్ మీడియా ముందుకొస్తోంది. రాజమౌళి అండ్ గ్యాంగ్ రేపు, 'బాహుబలి ది కంక్లూజన్' గురించి ఏం చెబుతుందోగానీ, మీడియా నుంచి సహజంగానే 'కట్టప్ప – బాహుబలిని ఎందుకు చంపాడు' అనే ప్రశ్న దూసుకెళుతుంది. రాజమౌళి, సరదాగా కొత్త కథ ఏమైనా చెబుతాడా.? లేదంటే, సినిమా విశేషాలు చెప్పేసి ఊరుకుంటాడా.? అన్న ఉత్కంఠ రేగడం మామూలే.
రాజమౌళి అయితే కట్టప్ప సీక్రెట్‌ని రివీల్ చేయకపోవచ్చు.. రివీల్ చేయకుండా సరదాగా ఏదన్నా కామెంట్ వేశాడో, దాని చుట్టూ మళ్ళీ కొత్త కొత్త కథలు పుట్టుకొచ్చేస్తాయి. సోషల్ మీడియాలో కట్టప్ప స్ఫూఫ్ కథలు చాలానే వున్నాయి.. అవి ఇంకా పెరిగిపోవడం ఖాయం.