'ఖైదీ నెంబర్ 150' సినిమాని సంక్రాంతికి లాక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, తన కుమారుడు చరణ్ హీరోగా తెరకెక్కిన 'ధృవ' సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఓ పక్క 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పనుల్లో బిజీగా వుంటూనే, ఇంకోపక్క తన 'ఖైదీ నెంబర్ 150' సినిమా పనులు చక్కబుడుతూనే, మరోపక్క 'ధృవ' సినిమా గురించి చిరంజీవి స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ 'ధృవ' సినిమాని తెరకెక్కిస్తున్న విషయం విదితమే. సురేందర్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మామూలుగా గీతా ఆర్ట్స్‌లో సినిమా అంటే, అందులో చిరంజీవి స్పెషల్‌గా కేర్ తీసుకోవడానికి ఏమీ వుండదు. పక్కా ప్లానింగ్‌తో అల్లు అరవింద్ ఆ సినిమాని పూర్తి చేసేస్తారు. కానీ, 'ధృవ' విషయంలో ఎక్కడో తేడా కొట్టేస్తున్నట్లుంది. సురేందర్‌రెడ్డి, సినిమాల్ని చెక్కే రకం కాదు. పైగా, ఇది తమిళ సినిమా 'తని ఒరువన్'కి రీమేక్. అయినాసరే, 'చెక్కుడు'కి ఎందుకంత టైమ్ పడుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.
తెలుగు సినిమా బాక్సాఫీస్ లెక్కలు మారిపోవడంతో, తన స్టార్‌డమ్‌ని కొనసాగిస్తాడనుకున్న రామ్‌చరణ్, ఆ స్టార్‌డమ్‌ని నిలబెట్టినట్లే నిలబెట్టి, రేసులో వెనకబడిపోవడాన్ని చిరంజీవి ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట. 'నాయక్' సినిమాకి చిరంజీవి ఇన్‌పుట్స్ పనిచేసినా, 'బ్రూస్‌లీ'కొచ్చేసరికి తేడా కొట్టేశాయి. మరిప్పుడు, చిరంజీవి 'ధృవ'కి ఇన్‌పుట్స్ ఇస్తే ఆ రిజల్ట్ ఎలా వుంటుంది.? తన సినిమాకీ, తన కుమారుడి సినిమాకీ మధ్య వచ్చే గ్యాప్‌ని చిరంజీవి ఎలా ప్లాన్ చేస్తారు.? ఏమో, వేచి చూడాల్సిందే.