తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వున్నపళంగా కంగారు పడ్డారు. కంగారు పడ్డారో లేదో, మీడియా ముందైతే కంగారు పడినట్లే నానా హడావిడీ చేసేశారు. హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీసేలా వ్యవహరించొద్దంటూ మీడియాకి ఉచిత సలహా ఇచ్చేశారు. జరిగిన నష్టం తక్కువేననీ, చాలా ఎక్కువన్నట్లు చూపిస్తున్నారనీ కేసీఆర్ గుస్సా అయ్యారు. అసలు కేసీఆర్‌కి ఇంతలా కంగారు ఎందుకు వచ్చినట్లు.? ఆయన భయపడ్తున్నట్లుగా హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కి ముప్పు ఏమైనా వుందా.?
నిజానికి గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలే లేవు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా హైద్రాబాద్ విశ్వ నగరమే. కేసీఆర్ చెబుతున్న విశ్వనగరం అవడానికి ఐదారేళ్ళు పడుతుందో, యాభయ్యేళ్ళు పడుతుందో.. ఎందుకంటే, అసలు విశ్వనగరం అంటే కేసీఆర్ ఏమనుకుంటున్నారో ఎవరికీ తెలియదు కదా.!
ఒకటి మాత్రం నిజం. హైద్రాబాద్ తెలంగాణకి గుండెకాయ. ఆ మాటకొస్తే, ఒకప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి గుండెకాయలా హైద్రాబాద్ పనిచేసింది. ఇప్పుడు 10 జిల్లాల తెలంగాణకి హైద్రాబాద్ ఇంకా అద్భుతంగా సేవలు అందించవచ్చు. హైద్రాబాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి రాజధాని కదా) రాష్ట్రాలకే కాదు దేశానికే గుండెకాయ.. అని చెప్పినా తక్కువే. కానీ, హైద్రాబాద్ విషయంలో గడచిన రెండేళ్ళుగా కేసీఆర్ సర్కార్ మాటలకే పరిమితమైంది తప్ప, చేతల్లో 'విశ్వనగరం ప్రాజెక్ట్'కి సంబంధించి ఒక్క పనీ చేసిన దాఖలాల్లేవు.
నిజమైతే రాత్రికి రాత్రి హైద్రాబాద్ విశ్వనగరం అయిపోదేమో, కానీ.. విశ్వనగరానికి సంబంధించి టీఆర్‌ఎస్ 'వ్యూ' ఏమిటో బయటపెట్టాలి కదా. సెక్రెటేరియట్ తరలించేస్తామన్నారు.. హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశ హార్మ్యాలన్నారు. ఇంకోటేదో చెప్పారు.. చెబుతూనే వున్నారు. ఏదీ ఎక్కడ.? ఒక్క పనికీ కనీసం ప్రారంభోత్సవం జరిగిన దాఖలాల్లేవు. దాదాపుగా ఏడాదిన్నర గడిచిపోయింది ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించి. రానున్న రెండేళ్ళలో హైద్రాబాద్ విశ్వనగరం అయిపోదు. కేసీఆర్ స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు.
వరదల సంగతి పక్కన పెడితే, హైద్రాబాద్‌లో ట్రాఫిక్ నిత్య నరకం. గడచిన రెండేళ్ళలో రోడ్లను ఏమాత్రం పట్టించుకున్న దాఖలాల్లేవు. ఇలాంటి చర్యలు కాస్తో కూస్తో హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీస్తాయన్నది నిర్వివాదాంశం. గ్రేటర్ ఎన్నికల్లో భారీగా ఎన్నికల హామీలు ఇచ్చిన టీఆర్‌ఎస్, ఎన్నికలయ్యాక ఆ స్థాయిలో ఇంకా పనులే ప్రారంభించకపోవడం గమనార్హం. ఇంత చేస్తున్న హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కి డోకా లేదు. ఎందుకంటే, హైద్రాబాద్‌కి ఈ బ్రాండ్ రాత్రికి రాత్రి రాలేదు.
చెన్నయ్‌లో వరదలు, బెంగళూరులో కావేరీ మంటలు.. ఆయా నగరాల ఇమేజ్‌ని దెబ్బతీసేయలేదు. హైద్రాబాద్ విషయంలో అయినా అంతే. ఆ బూచిని చూపించి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ లబ్ది పొందాలనుకుంటే, మీడియానో విపక్షాల్నో బెదిరించాలనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటుండదు.
కొసమెరుపు: హైద్రాబాద్ విషయంలో టిఆర్ఎస్ సర్కార్ తీరు ఇలాగే వుంటే, దెబ్బతినేది హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ సంగతేమోగానీ, హైద్రాబాద్ బ్రాండ్ అంబాసిడర్ మంత్రి కేటీఆర్ బ్రాండ్ ఇమేజ్, టీఆర్ఎస్ రేటింగ్ మాత్రం దారుణంగా పడిపోతుంది. ఇది నిజం.