ఆ కుర్రాడ్ని చూస్తే, ఇతనేనా డైరక్టర్ అనుకుంటారు. అంత చిన్నగా, సింపుల్ గా, ఇంటర్ నో, డిగ్రీనో చదువుతున్నట్లు వుంటాడు. నిజానికి ఫలానా డైరక్టర్, విరించి వర్మ అని తెలియకపోతే, బైక్ మీదో, కాలినడకనో వస్తే స్టూడియో గేట్ దగ్గరే ఆపేస్తారేమో కూడా. అంత సింపుల్ గా, అంత చిన్నగా వుంటాడు. అతగాడే విరించి వర్మ.
ఉయ్యాల జంపాల అనే చిన్న సినిమా తీసి, అందరి దృష్టిని ఆకర్షించి, నిర్మాతలకు మంచి లాభాలు అందించాడు. మళ్లీ ఇప్పుడు నాని హీరోగా మజ్ఞు అనే సినిమా తయారు చేసాడు. నాని లాంటి ఓ రేంజ్ హీరోతో, ఇద్దరు హీరోయిన్లను పెట్టుకుని, జస్ట్ పది కోట్ల లోపు ఖర్చుతో సినిమా ఫినిష్ చేసాడు. నిర్మాతలు ఇప్పుడు ఎనిమిది కోట్ల లాభం చేసుకున్నారు ఈ సినిమాను అవుట్ రేట్ కు అమ్మేసి. నానితో ఇంత రీజనబుల్ ఖర్చుతో సినిమా ఎలా? అదే అడిగతే..హోం వర్క్ అంటాడు.
తీసిన సీన్ ఏదీ ఎడిటింగ్ టేబుల్ మీద తీసేయలేదు. స్క్రిప్ట్ నే ఒకటికి వందసార్లు చెక్ చేసకుని, ఈ సీన్ అనవసరం, ఈ షాట్ అనవసరం, ఇలా తనలో తానే అనుకుని, స్క్రిప్ట్ నే ఎడిట్ చేసుకుంటూ వచ్చాడట. అందువల్ల టైమ్ మిగిలింది..డబ్బులు మిగిలాయి అంటున్నాడు. అంతే కాదు, నిజానికి తెలుగు వచ్చిన హీరోయిన్లు అయితే ఇంకో పది రోజుల షూటింగ్ టైమ తగ్గేది అంటున్నాడు.
నార్త్ హీరోయిన్లు కాబట్టి, వాళ్లకి చెప్పి, వాళ్లు అర్థం చేసుకుని, ఇందుకు కొంత టైమ్ పట్టిందంటున్నాడు. ఉయ్యాల జంపాల కు మజ్ఞు కు ఇంత గ్యాప్..మళ్లీ మూడో సినిమా ఎప్పుడు అంటే, చాలా సింపుల్ గా, తెలియదండీ..స్క్రిప్ట్ తయారు చేయాలి. అది ఎవరికి సూటవుతుందో చూడాలి. చెప్పాలి..అప్పుడే సినిమా. అంతే కానీ అడ్వాన్స్ లు, అగ్రిమెంట్లు, పరుగులు తనకు చేతకావు అంటున్నాడు. పిట్ట కొంచెం, సినిమా ఘనం అంటే ఇదేనేమో?