ఏదన్నా సాధిస్తే సన్మానం జరుగుతుంది మామూలుగా అయితే. కానీ, ఇది మోడ్రన్ ట్రెండ్ కదా. సాధించేశాం.. అని చెప్పుకోవడంతోనే సన్మానాలు షురూ అవుతున్నాయి. నయా సన్మానాల జాతర గురించి తెలుగు సినిమాల్లో వేసినన్ని సెటైర్లు బహుశా ఇంకెక్కడా వేసి వుండరేమో. అంతలా సన్మానాల క్రెడిట్‌ని తెలుగు సినిమాలే బజారుకీడ్చేశాయి. ఏం చేస్తాం, సినిమాల్లో అయినా చూపించేవి వాస్తవాలే కదా.!
సన్మానాల పిచ్చి వున్నోళ్ళు తమ స్తోమతుకు తగ్గట్టుగా సన్మానాలు చేయించుకుంటుంటారు. ఐదు వేల నుంచి ఐదు కోట్ల దాకా.. సన్మానం అనే ఈవెంట్ కోసం ఖర్చు చేసేవాళ్ళు తయారైపోయారు. శాలువా నుంచి బంగారు కంకణాల వరకూ.. సన్మానాల్లో చాలా 'కథలు' వుంటాయి. 'ఆ మాత్రం హడావిడి లేకపోతే, సన్మానం ఇచ్చే కిక్కేముంటుంది తొక్కలాగా (సారీ అన్ పార్లమెంటరీ)..' అనేవారూ లేకపోలేదండోయ్.!
ఇప్పుడిదంతా ఎందుకంటారా.? ఆంధ్రప్రదేశ్‌లో ఓ మీడియా సంస్థ, ప్రత్యేక హోదాపై అవగాహనా కార్యక్రమాలు చేపడ్తోంది. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తే, అందులో విద్యార్థులు 'సిగ్గులేని సన్మానాలు..' అంటూ గుస్సా అయ్యారు. మహిళా సంఘాలు, యువత, సామాన్యులు, అందరూ ఈ సన్మానాలపై భగ్గుమన్నారు. ఇంతకీ, ఎవరి సన్మానాల గురించి.. అనే కదా మీ డౌట్.!
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుగారు ఈ మధ్య ఎడా పెడా సన్మానాలు చేయించేసుకుంటున్నారు. ప్రత్యేక ప్యాకేజీ గొప్పగా తెచ్చేశారంటూ ఆయన్ని ఏపీ బీజేపీ నేతలు సన్మానించేస్తున్నారు. అది కాస్తా వాళ్ళకి (ప్రత్యేక హోదా కాంక్షిస్తున్నవారికి) ఒళ్ళు మండేలా చేస్తోంది మరి. అప్పుడేమో ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో డిమాండ్ చేసి, అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో ప్రత్యేక హోదా హామీ తెప్పించగలిగిన కారణంగా వెంకయ్య సన్మానాలు చేయించుకున్నారనీ, ఇప్పుడు అదే వెంకయ్య ప్రత్యేక హోదాని తుంగలో తొక్కి, ప్రత్యేక ప్యాకేజీ తెచ్చానంటూ సన్మానాలు చేయించుకుంటున్నారనీ విద్యార్థులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు.
ఏమాటకామాటే చెప్పుకోవాలి. రాజకీయాల్లో సన్మానాలు సర్వసాధారణం. ఆ మాత్రందానికే విద్యార్థులకి అంత కోపమొస్తే ఎలా.? సిగ్గులేని సన్మానాలు అనేస్తే ఎలా.? రాజకీయ నాయకులంటేనే మాట మార్చాలి, మడమ తిప్పాలి. ఇలాంటోళ్ళను నమ్మి, వెర్రి వెంగళప్పలయినవారు.. రాజకీయ నాయకుల్ని విమర్శించడమా.? అన్న వాదనా లేకపోలేదు. ఇది, నేటి రాజకీయ నాయకుల్ని చూసి విసిగి వేసారిపోయిన ప్రజాస్వామ్యవాదులు చెప్పేమాట.