ఏపీలో ఈ దఫా ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో విజయానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోవద్దని అధికార, ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర వైసీపీ సీనియర్ నాయకుడిపై టీడీపీ కన్నేసింది. ఎలాగైనా ఆ పెద్ద నాయకుడిని పార్టీలో చేర్చుకుని ఎన్నికల ముంగిట వైసీపీని మానసికంగా దెబ్బతీయాలనే ఎత్తుగడతో టీడీపీ పావులు కదుపుతోంది.
సీనియర్ మంత్రి కూడా అయిన సదరు నేత తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారాన్ని టీడీపీ వ్యూహాత్మకంగా చేస్తోంది. సీఎం జగన్ వల్ల తాము రాజకీయంగా నష్టపోతున్నామని, ప్రత్యర్థులపై వేధింపులకు పాల్పడడాన్ని ఆ సీనియర్ మంత్రి వ్యతిరేకిస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. వైఎస్ జగన్ తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో కూడా ఆ మంత్రి పని చేశారని, అందరిలా నోరు పారేసుకోరని అంటున్నారు.
అయితే సదరు సీనియర్ నాయకుడితో టీడీపీ మంతనాలు జరుపుతున్న విషయమై అధికార పార్టీ నేతలను ఆరా తీయగా… అలాంటిదేమీ లేదని కొట్టి పారేస్తున్నారు. వైఎస్ జగన్‌తో సీనియర్ మంత్రి సన్నిహితంగా వుంటున్నారని, ఆయనకు వైసీపీలో ఇబ్బందేమీ లేదని ఆ పార్టీ నాయకులు చెప్పారు.
ఎన్నికల సమయంలో సీఎం జగన్‌కు సన్నిహితంగా ఉన్న సీనియర్ నేతలు కూడా పార్టీ మారుతారనే ప్రచారం టీడీపీ మైండ్ గేమ్‌గా కొట్టి పారేయడం విశేషం. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, పక్కచూపులు చూసే అవసరం తమ నాయకులకు లేదని వైసీపీ ముఖ్య నేతలు స్పష్టం చేయడం గమనార్హం.