సరదాకి: మోడీ ఫస్ట్‌.. ఏపీ నెక్స్‌ట్‌.!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీకి పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి పయనమవుతారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్ర మంత్రి ఉమా భారతి సమక్షంలో చంద్రబాబు, కేసీఆర్‌ చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నీటి…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీకి పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి పయనమవుతారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్ర మంత్రి ఉమా భారతి సమక్షంలో చంద్రబాబు, కేసీఆర్‌ చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నీటి పంపకాలు, ప్రాజెక్టులు, ఇతర వివాదాలపై చర్చ ఈ సమావేశం తాలూకు ఎజెండా. సుప్రీంకోర్టు సూచనతో, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమాచారం ఇది. 

మామూలుగా అయితే ఇరు రాష్ట్రాలూ పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించి, తమ తమ వాదనలతో కేంద్రం దగ్గరకు వెళ్ళాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదే పని చేస్తున్నారు. మరి, చంద్రబాబు ఏం చేస్తారట.? అది మాత్రం ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. ఎందుకంటే, కేసీఆర్‌ది ఒకటే ఎజెండా.. అది తెలంగాణ ఎజెండా. చంద్రబాబుకి అలా కాదు, ఏపీ ఎజెండాతోపాటు, బీజేపీతో టీడీపీ స్నేహం అనే ఇంకో ఎజెండా కూడా వుంది. అక్కడే వస్తోంది తేడా అంతా. 

తెలంగాణ వాదనతో విభేదిస్తే, తెలంగాణ ప్రయోజనాల్ని చంద్రబాబు దెబ్బతీసినట్లవుతుంది. కాబట్టి, చంద్రబాబుని కేసీఆర్‌ కార్నర్‌ చేయడం చాలా తేలిక. ఈ విషయం చంద్రబాబుకీ తెలుసు. అందుకే, వ్యూహాత్మకంగా ఏపీ ప్రయోజనాల్ని కాస్తో కూస్తో తాకట్టు పెట్టేలాగానే చంద్రబాబు ఏపీ నివేదికను తయారుచేయించి వుండాలి. ఇప్పటిదాకా చాలా విషయాల్లో చంద్రబాబు చేసింది ఇదే. ఎంతలా చంద్రబాబు తెలంగాణ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల విషయంలో రాజీ పడ్డా, తెలంగాణలో టీడీపీకి ఉనికి అనేదే కష్టమవుతోంది తప్ప, లాభం లేదు. అయినా, చంద్రబాబు మారడంలేదాయె.! 

ఇక, ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రత్యేక హోదాని తుంగలో తొక్కి, ప్రత్యేక ప్యాకేజీ పేరు చెప్పకుండా ప్రత్యేక సాయం అనే బిచ్చమేసినందుకు కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలపాలి. ఆ పని ఆల్రెడీ చేసేసినా, ఈసారి స్వయంగా కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసి, తన విధేయతను చంద్రబాబు చాటుకోబోతున్నారు. పనిలో పనిగా ప్రత్యేక సాయానికి చట్టబద్ధత కల్పించాలని మళ్ళీ కేంద్రం వద్ద సాగిలా పడనున్నారు చంద్రబాబు. 

ఇదండీ వరస. మామూలుగా అయితే మిత్రపక్షమే కేంద్రంలో అధికారంలో వుంది గనుక, చంద్రబాబు ప్రవర్తన అపెక్స్‌ కౌన్సిల్‌లో ఇంకోలా వుండాలి. కేంద్రాన్ని ప్రశ్నించి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాతోపాటు, ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలి. కానీ, చంద్రబాబు చేస్తున్నదేమిటి.? ప్రత్యేక హోదా లేదు, ప్యాకేజీ లేదు.. ప్రత్యేక సాయానికి మాత్రం 'సై' అనేశారు. ఇవి చాలదన్నట్లు, ఆంధ్రప్రదేశ్‌ నీటి ప్రయోజనాల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరించడం. 

నిజానికి చంద్రబాబు ఏ వాదనను కేంద్రం వద్ద వినిపిస్తున్నారో తెలియకుండా ముందే అంచనా వేసేయడం సబబు కాదుగానీ, గత అనుభవాల నేపథ్యంలో ఇంతకన్నా భిన్నంగా ఏమన్నా జరుగుతుందని ఎవరైనా అనుకోగలరా.?