ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారు ఎంతో పేదోడు. నమ్మలేరా.? అయితే, ఆయన చేతి వంక చూడండి. కనీసం ఓ ఉంగరం కూడా ఆయన చేతికి కనిపించదు. బంగారంతో ఉంగరం చేయించుకునే 'స్తోమత' చంద్రబాబుకి ఎక్కడిది.? అయ్యోపాపం.! అంతేనా, చంద్రబాబు చేతికి కనీసం ఓ చిన్నపాటి వాచీ కూడా లేదాయె.! వాచీ కొనుక్కునే 'స్తోమత' కూడా చంద్రబాబుకి లేదాయె.!
ఇక్కడ, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ గురించి కూడా చర్చించుకోవాలండోయ్. రాజకీయ పార్టీ పెట్టడానికి డబ్బులున్నాయ్.. బహిరంగ సభలు పెట్టడానికీ డబ్బులున్నాయ్.. ఆ రాజకీయ పార్టీని విస్తరించడానికి మాత్రం పవన్‌కళ్యాణ్ దగ్గర డబ్బుల్లేవు. 'జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తారా.?' అని పవన్‌కళ్యాణ్‌ని అడిగితే, 'డబ్బుల్లేవు..' అని సెలవిచ్చారు పవన్‌కళ్యాణ్. సినిమాకి పది నుంచి ఇరవై కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటాడని పవన్‌కళ్యాణ్ మీద పెద్ద గాసిప్పే వుంది. అది నిజమో కాదో సినీ జనాలకి బాగా తెలుసు. అయినా పవన్‌కళ్యాణ్ దగ్గర డబ్బుల్లేవు.!
ఎంతైనా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ పొలిటికల్ మిత్రులు కదా.. అందుకే పాపం, ఇద్దరి దగ్గరా ఒకటే కష్టం వుంది. అదే, డబ్బుల్లేకపోవడం. పవన్‌కళ్యాణ్ అంటే, గుప్తదానాలు ఎక్కువగా చేస్తుంటాడు గనుక, అతని దగ్గర డబ్బుల్లేవన్నదే నిజం అనుకుందాం. మరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంగతేంటి.? హైద్రాబాద్‌లో క్యాంప్ ఆఫీస్ కోసం కోట్లు తగలేశారు. విజయవాడలో క్యాంప్ ఆఫీస్ కోసం కూడా సేమ్ సీన్.
కాలు కదపాలంటే చంద్రబాబుకి ప్రత్యేక హెలికాప్టర్ వుండాలి. హైద్రాబాద్‌కి వెళ్ళాలన్నా ఢిల్లీకి వెళ్ళాలన్నా ప్రత్యేక విమానం తప్పనిసరి. అయినా చంద్రబాబు పేదోడే.! నమ్మి తీరాల్సిందే.. ఎందుకంటే, అక్కడ చెబుతున్నది నిప్పు నారా చంద్రబాబునాయుడుగారు. ఆయన ఆస్తి జస్ట్ లక్షల్లోనే. కుమారుడు నారా లోకేష్ పేరుతో మాత్రం కోట్లాది రూపాయల ఆస్తులున్నాయి. భార్య భువనేశ్వరి పేర కూడా కోట్లల్లో ఆస్తులు కనిపిస్తాయి. కానీ, చంద్రబాబు పేదోడు. వీచీ కొనుక్కోలేని, ఉంగరం పెట్టుకోలేని పేదోడు.
పార్టీ మీటింగుల కోసమైతే పార్టీ నిధులు, అధికారిక మీటింగుల కోసమైతే ప్రభుత్వం ఖర్చు. అంతకు మించి, చంద్రబాబు తన జేబులో డబ్బులు అస్సలేమాత్రం పెట్టుకోరు. కామెడీ కాకపోతే, చంద్రబాబుకి జేబులో డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరమేంట.? చిటికేస్తే క్షణాల్లో కోట్లు వచ్చి వాలతాయి. అదిగో నిదర్శనం, తెలంగాణలో ఓటుకు నోటు కేసు. ఓ ఎమ్మెల్సీ ఓటు కోసం తెలుగుదేశం పార్టీ 5 కోట్లు ఖర్చు చేయడానికి ముందుకొచ్చింది. దాన్ని బ్రీఫింగ్ చేసింది స్వయానా చంద్రబాబే.! అయినా, చంద్రబాబు చాలా చాలా చాలా పేదోడండోయ్.!
వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే చెప్పేటోడు నారా చంద్రబాబునాయుడుగారే. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఆయన చేతికి వాచీ వుండదు, కానీ ఆయన 16 గంటలు పనిచేస్తారు. అవును మరి, గంట పని చేసి, 16 గంటలు పనిచేశానని చెప్పుకోవడంలో వింతేముంది. చేతికి వాచీ లేదు కదా, గంటకీ.. నిమిషానికీ ఆయనకు తేడా తెలియదాయె.! వింటే వినండీ లేదంటే మీ ఖర్మ. చంద్రబాబు మాత్రం నిఖార్సయిన పేదోడు.!