అవీ ఒలింపిక్ గేమ్స్.. ఇవీ ఒలింపిక్ గేమ్స్.. అవి అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారికి.. ఇవి అవయవాలు సరిగ్గా పనిచేయనివారికి. వాటికీ వీటికీ ఒకటే తేడా 'పారా' అన్న పేరు మాత్రమే. ఆ పేరులోనే చాలా వుంది. ప్రత్యేకవసరాలుగల వ్యక్తులు, వికలాంగులు, దివ్యాంగులు.. పేరేదైనా, వాళ్ళూ మనలాంటివారే.. కానీ అందరిలా వుండలేనివారు. అన్ని పనులూ తమంతట తాము చేసుకోలేనివారు. అయితేనేం, అందరితోనూ పోటీపడగలరు.. వారి మనసు ఎక్కడికైనా వెళ్ళగలదు.. ఏమైనా చేయగలదు.!
ఇదిగో నిదర్శనం.. పారా ఒలింపిక్స్‌లో భారత్‌కి స్వర్ణం వచ్చింది. తమిళనాడుకి చెందిన క్రీడాకారుడు మరియప్పన్ గోల్డ్ మెడల్ సాధించడంతో దేశమంతా మురిసిపోయింది. తమిళనాడు ప్రభుత్వం కోటి నజరానా ప్రకటించింది. మరో క్రీడాకారణి దీపా మాలిక్ రజత పతకాన్ని సాధించింది. ఇంకా ఇంకా పతకాలు వచ్చేలా వున్నాయి. దేశం నిజంగా గర్వించదగ్గ క్షణాలివి. మొన్నటికి మొన్న ఒలింపిక్స్‌లో తెలుగు తేజం పివి సింధు, భారతదేశానికి రజత పతకాన్ని తీసుకొచ్చింది.. రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని తీసుకొచ్చింది. భళా సింధు.. భళా సాక్షి మాత్రమే కాదు.. పతకాన్ని తీసుకురాకపోయినా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌ని కూడా భళా అన్నాం. భారీయెత్తున నజారానాల్ని ప్రకటించాం.
మరి, మరియప్పన్ విషయంలో తమిళనాడు ప్రకటించిన కోటితోనే సరిపెట్టేస్తే ఎలా.? దీపా మాలిక్‌కి ఏమివ్వబోతున్నారు.? డబ్బు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఉపయోగమేమీ లేదు. వికలాంగులు / దివ్యాంగులు / ప్రత్యేకావసరాలుగల వ్యక్తులు.. పేరేదైతేనేం, సాధించి చూపించారు. శరీరంలో అవయవాలు సరిగ్గా పనిచేయకపోయినా దేశ కీర్తి ప్రతిష్టల్ని నిలబెట్టారు. ఏమిచ్చి, వీరి రుణం తీర్చుకోగలం.? ప్రత్యేకావసరాల వ్యక్తులుగా తాము అనుభవించిన బాధలేమిటో తమకు తెలుసనీ, అందుకే తమకు వస్తోన్న ప్రైజ్ మనీలో ఎక్కువభాగం తమలాంటివారి సంక్షేమం కోసమే వినియోగిస్తామంటున్నారు.
కానీ, ప్రభుత్వాలు ఇక్కడ చేయాల్సింది చాలా వుంది. ప్రతిభ అందరిలోనూ వుంటుంది.. ఆ ప్రతిభను వెలికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. వందల కోట్లు ఖర్చు చేశామని చేతులు దులుపుకుంటే సరిపోదు. ఆ ఖర్చు సరైన రీతిలో జరుగుతోందా.? క్రీడల్లో సరైన శిక్షణ క్రీడాకారులకు లభిస్తుందా.? అన్న విషయాలపై ఫోకస్ అవసరం. ఈసారికి ఇలా అయిపోయింది.. ఇకపై ఒలింపిక్స్‌కి అయినా పారా ఒలింపిక్స్‌కి అయినా క్రీడాకారులకి శిక్షణ తగు రీతిలో ఇప్పిస్తే.. ఓ పతకంతోనో, రెండు పతకాలతోనో, మూడు పతకాలతోనో సరిపెట్టుకోవడం కాదు.. పతకాల పట్టికలో మంచి స్థానం సాధించి.. సగర్వంగా క్రీడా ప్రపంచంలో తలెత్తుకు తిరిగే రోజొస్తుంది. ఆ రోజు రావాలి. భారత క్రీడా రంగానికి రాజకీయ వైకల్యం పోవాలి. పోతుందా.? ఆశిద్దాం.. అత్యాశ అయితే కాదు కదా.!