ప్రత్యేక హోదా గురించి మాట మారుస్తున్నవారి గురించి నేను రాసినప్పుడల్లా 'ఇలా విమర్శించే బదులు, అసలు ప్రత్యేక హోదా మంచిదో, ప్రత్యేక ప్యాకేజీ మంచిదో వివరంగా చెప్పవచ్చు కదా, దాన్ని ఎలా సాధించాలో చంద్రబాబుగారికి నిర్మాణాత్మక సలహాలు యివ్వవచ్చు కదా' అంటూ నన్ను విమర్శించేవాళ్లు ఎక్కువగా వుంటున్నారు. ఇక్కడ గమనించవలసిన దేమిటంటే – ప్రత్యేక హోదాతో ప్రత్యేక ప్యాకేజీ పోల్చి చూడవలసిన పనే లేదు. అది కాని, యిది కాని యిస్తామని కేంద్రం, తెస్తామని రాష్ట్రం అనలేదు. హోదాతో బాటే ప్యాకేజి అని చెప్తూ వచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాతనే 'హోదా లేదా ప్యాకేజి' అనే సూచనను ప్రజల మెదళ్లలోకి చొప్పించారు. ఇక హోదా ఎలా సాధించాలో నేను చంద్రబాబు గారికి సలహా యివ్వడమేమిటి నా బొంద, ఆయనకు సలహాదారులు లేకనా? నేను రాసిన కొన్ని వ్యాసాలు చదివి కొందరు ఉత్తరాలు రాస్తూంటారు – 'ఇది చంద్రబాబుగారు చదివితే బాగుండును' అని. తమకే చాలా తెలుసు అని ముఖ్యమంత్రులు అనుకుంటూ వుంటారు. కాబినెట్ సహచరులు చెప్పినా వినే పరిస్థితి వుండదు. అలాటిది 'ఫలానా పత్రికలో ఒకాయన వ్యాసంలో మంచి సూచనలు చేశాడండి' అని ఏ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసరో చెపితే 'ఏడిశాడు, పత్రికలో ఏదో గిలకడం కాదు, యిక్కడ కొచ్చి ఒక్కరోజు కూర్చుంటే తెలుస్తుంది మా అవస్థలేమిటో' అనుకోవచ్చు. మంత్రులు, ముఖ్యమంత్రుల మాట వదిలేయండి, వాళ్లకు ఆత్మీయంగా వుంటూ సలహాలిద్దామనుకునేవారు కూడా యివన్నీ చదువుతారని నేననుకోను. మాకు తెలియని విషయమేముంది అనే అహంకారం ఎలాగూ వుంటుంది.
'హోదా విషయంలో, హుదూద్ సహాయం విషయంలో, వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ విషయంలో, రాజధాని నిధుల విషయంలో, రాష్ట్ర ఆర్థిక లోటు భర్తీ విషయంలో బిజెపి రాష్ట్రాన్ని మోసం చేసింది కాబట్టి దానితో పొత్తు వదులుకోండి' అని నేను చెపితే బాబు వింటారా? పొత్తు వదులుకుంటానని బెదిరించగానే మోదీ వణికిపోయి యిచ్చేస్తారా? దశాబ్దాలుగా మిత్ర పక్షాలుగా వున్న శివసేన, అకాలీదళ్‌లనే బిజెపి లెక్క చేయడం లేదు, ఈ మధ్యే కూటమిలోకి వచ్చిన టిడిపి లెక్కేమిటి? వీళ్ల మద్దతు వున్నా లేకపోయినా కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. టిడిపి పొత్తు తెంపుకోగానే వైసిపి నేనున్నానంటూ బిజెపి వద్దకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఇక అక్కణ్నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయి కాబట్టి రాష్ట్రప్రభుత్వాన్ని రద్దు చేయాలని రోజూ గవర్నరు వద్దకు విన్నపాలు చేసినా అబ్బురం లేదు. అనేక రాష్ట్రాలలో యిది జరిగే తంతే యిది. తమిళనాడులో అయితే చెప్పనే అక్కరలేదు. బెంగాల్‌లో సిపిఎం రాజ్యం చేసే రోజుల్లో తృణమూల్ కేంద్రంతో సఖ్యం చేస్తూ సిపిఎం సర్కారును డిస్మిస్ చేయమని అడుగుతూ వుండేది. మమత ఎన్‌డిఏ తోనూ ఊరేగింది, కాంగ్రెసుతోనూ వూరేగింది. ఏ పార్టీకైనా రాజకీయ అవసరాలే ముఖ్యం తప్ప విధానాలు కాదు, కమ్యూనిస్టులు మా సహజమిత్రులు అంటూ తృతీయ ఫ్రంట్‌కు కన్వీనరుగా వుంటూ చాలా ఏళ్లు బిజెపిని అధికారానికి దూరంగా వుంచిన చంద్రబాబు రాత్రికి రాత్రి ఎన్డీఏ కన్వీనరు అవతారం ఎత్తారు. ఇవాళ ఎన్డీయేలో వున్నారు, రేపు బిజెపి బలహీనపడితే మళ్లీ తృతీయ ఫ్రంట్‌లో లీడరవుతారు.
బిజెపితో వైరం తెచ్చుకున్నా లాభం లేదు కాబట్టి కేంద్రం ఏం యిచ్చినా, యివ్వకపోయినా పడి వుండండి అని కూడా బాబుకు సలహా యివ్వలేం. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణగారు మాత్రం యివ్వగలరు. 'బిజెపితో మిత్రబంధానికి బాబు స్వస్తి పలికితే కేంద్ర-రాష్ట్ర సంబంధాలు దెబ్బ తింటాయి. రాష్ట్రానికి కేంద్రం నుంచి సహాయం అందదు. అప్పుడు నష్టపోయేది ఎవరు? ప్రజలు కాదా?' అని తన కాలమ్‌లో రాశారు. ఈయన లాజిక్ ప్రకారం కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం వుంటే రాష్ట్రాలలో కూడా అదే పార్టీ ప్రభుత్వాలు వుండాలి, కనీసం వారి మిత్రపక్షాల ప్రభుత్వాలు వుండాలి. మరి యుపిఏ హయాంలో ఎన్ని రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలున్నాయో గుర్తు చేసుకోండి. మోదీ గుజరాత్‌ను ఏలి పేరు తెచ్చుకున్న కాలంలో కేంద్రంలో ఎన్‌డిఏ మాత్రమే వుందా? ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో ఘర్షణవైఖరి కొనసాగిస్తూనే తమ పాలన సాగించడం లేదు? పెద్ద రాష్ట్రాలైన యుపి, బిహార్, బెంగాల్, తమిళనాడులలో బిజెపి ప్రభుత్వాలు వున్నాయా? వాటికి నిధులు అందడం మానేశాయా? కేంద్ర-రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ గురించి ఒక ఫార్ములా వుంటుంది. ఆ విధంగా కొన్ని యిచ్చి తీరాల్సిందే. కొన్ని మాత్రం ముఖ్యమంత్రి చాకచక్యం మీద ఆధారపడి వుంటాయి. బతిమాలి తెస్తారా, బెదిరించి తెస్తారా, బెట్టు చేసి తెస్తారా అన్నది ఒక్కొక్కరిది ఒక్కో టెక్నిక్కు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంగతి చూడండి. మొదటి నుంచి కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్సే. 1977లో కేంద్రంలో జనతా పార్టీ వచ్చినపుడు మన దగ్గర కాంగ్రెసు గెలిచింది. కేంద్రంలో మళ్లీ కాంగ్రెసు వచ్చిన కొన్నాళ్లకే మనం టిడిపిని ఎన్నుకున్నాం. 1989-94 మధ్య రాష్ట్రంలో కాంగ్రెసు అధికారంలోకి వస్తే కేంద్రంలో కాంగ్రెసు ఓడిపోయింది. 1994 లో రాష్ట్రంలో టిడిపి వచ్చేటప్పటికి కేంద్రంలో కాంగ్రెసు ప్రభుత్వం వుండి, కొన్నాళ్లకు తృతీయ ఫ్రంట్ ప్రభుత్వం వచ్చింది. 1999లో రాష్ట్రంలో టిడిపి, కేంద్రంలో దానికి అనుకూలమైన ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చాయి. 2004 నుంచి పదేళ్లపాటు రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే పార్టీ ఏలింది. ఇప్పుడు రెండు చోట్లా కాంగ్రెసేతర ప్రభుత్వాలే. అక్కడా, యిక్కడా ఒకే పార్టీ వున్నా, పరస్పర వ్యతిరేక పక్షాలు వున్నా కేంద్రం నుంచి మనకు రావలసినంత రాలేదు. హైదరాబాదు తప్ప తక్కిన జిల్లాలేవీ తగినంతగా అభివృద్ధి చెందలేదు.
'రాష్ట్రం నిత్యం, కేంద్రం మిథ్య' అని హుంకరించిన ఎన్టీయార్ నెలకొల్పిన పార్టీకే రాధాకృష్ణ కేంద్రంతో సఖ్యంగా వుండకపోతే సహాయం అందదు అంటూ హెచ్చరించడం ఎంత విచిత్రం! బిహార్ ప్రజల్ని చూడండి, బిజెపిని గెలిపించకపోతే, కేంద్రం నుంచి సహాయం రాదు అని బెదిరించినా వాళ్లేమీ బెదరలేదు. ఢిల్లీ వాళ్లూ బెదరలేదు. రోజూ తర్జనితో కేంద్రాన్ని హెచ్చరిస్తూ వచ్చిన ఎన్టీయార్‌ను మళ్లీమళ్లీ గెలిపించారు తెలుగుజనం. గాల్లో డబ్బుల మూట వూపితే ప్రజలు బుట్టలో పడతారనుకోవడం అవివేకం. మామూలుగా యివ్వాల్సిన చెల్లింపులకు కూడా ప్రత్యేక ప్యాకేజీ, నిధుల వెల్లువ వంటి పేరు పెట్టి ఎన్నాళ్లు మోసగించగలరు? పక్క రాష్ట్రానికి ఎంత యిచ్చారు? వారితో పోలిస్తే మాకు ఎంత ఎక్కువ యిచ్చారు? అని ప్రజలు లెక్కలు వేసుకోలేరా?
ఇక ప్రత్యేక హోదా సంగతికి వద్దాం. అది పేరుకు మాత్రమే ప్రత్యేకం, దానివలన బాగుపడినవారు లేరు అని బాబు యీ మధ్య మరీమరీ చెపుతున్నారు. ప్రత్యేక హోదా వున్న రాష్ట్రాలు బాగు పడ్డాయా లేదా, దానివలన కలిగే ప్రత్యేక ప్రయోజనాలేమిటి అన్న విషయం గురించి ''సాక్షి'' బోల్డు గణాంకాలు యిస్తోంది. గతంలో హోదా వలన ఆంధ్ర రాష్ట్రం రూపురేఖలు మారిపోతాయని కాన్వాస్ చేసే రోజుల్లో ''ఈనాడు'', ''ఆంధ్రజ్యోతి'' కూడా చాలా యిచ్చాయి. గ్రేట్ ఆంధ్రాలోనే 'పవన్‌కి ఆ ఆలోచన ఉందా' (http://telugu.greatandhra.com/politics/political-news/pawan-kalyan-ki-aa-alochana-vunda-74271.html) అనే ఆర్టికల్ కింద కామెంట్స్‌లో నాంచారయ్య నాయుడు ఒక పాఠకుడు రాసిన కామెంట్స్ చూడండి. ఆయన చేసిన వ్యాఖ్యలు కటువుగా అనిపిస్తాయనిపిస్తే డైరక్టుగా జిడిపి స్టాటిస్టిక్స్ లింకుకి (https://knoema.com/atlas/India/ranks/GDP-growth?baseRegion=IN-UT) వెళ్లిపోండి. హోదా యిచ్చిన రాష్ట్రాల జిడిపి పెరిగిందో లేదో తెలుస్తుంది. ఆయనే శ్రీధర్ అనే ఆయన ఫేస్‌బుక్ లింకు కూడా (https://www.facebook.com/sridhar.avuthu/posts/10210609424622160) యిచ్చారు. అక్కడ చాలా వివరాలున్నాయి. ఓపికున్నవాళ్లు విపులంగా చదువుకోవచ్చు.
అంత ఎకడమిక్ స్టడీ బోరు అనుకునేవాళ్ల కోసం కొన్ని సింపుల్ లాజిక్కులు చెప్తాను. ప్రత్యేక హోదా వలన లాభం లేదని టిడిపితో బాటు స్వరం మార్చిన ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ తన వాదనకు వూతంగా 'హోదా వున్న 11 రాష్ట్రాలలో ఏడు రాష్ట్రాలలో నిరుద్యోగుల శాతం పెరిగింది' అంటూ గణాంకాలు యిచ్చారు. పోల్చడానికి అదొక్క పెరామీటరే దొరికిందా? అభివృద్ధి గురించి మాట్లాడినపుడు జిడిపి హెచ్చుతగ్గుల గురించి చెప్పాలి. ముఖ్యంగా హోదాకు, పరిశ్రమల రాకకు లింకు కాబట్టి హోదా వచ్చాక పరిశ్రమలు, ఉద్యోగాలు, రాష్ట్ర ఆదాయం పెరిగాయా లేదా అన్నది పోల్చి చెప్పాలి. నిరుద్యోగుల శాతం మాట కొస్తే గత పదిపదిహేనేళ్లలో హైదరాబాదులో కూడా పెరిగే వుంటుంది. అంతమాత్రం చేత అభివృద్ధి జరగలేదని చెప్పగలమా? ఉద్యోగార్థులు పెరిగినకొద్దీ నిరుద్యోగుల శాతం పెరిగి తీరుతుంది. ఇంకోమాట, అభివృద్ధి చెందడానికి హోదాతో బాటు యితర అంశాలు అనేకం కలిసిరావాలి. సముద్రతీరం వున్న రాష్ట్రాలన్నీ గుజరాత్‌తో సమానంగా లాభపడలేదు. ఈశాన్య రాష్ట్రాలలో విద్రోహ కార్యకలాపాలు, శాంతిభద్రతలే ప్రధాన సమస్య. ఆంధ్రలో అది లేదు కదా! పైగా అవి పర్వతప్రాంతాలు. రాకపోకలు కష్టం. ఆంధ్రకున్న కనెక్టివిటీ వాటి కెక్కడ వుంది? అవి బాగుపడలేదు కాదు, కాబట్టి మనమూ బాగుపడం అనడం సరి కాదు.
నాకు తెలిసే చాలామంది తెలుగు పారిశ్రామికవేత్తలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో పరిశ్రమలు పెట్టారు. అవేమీ పొరుగున లేవు. హోదా వల్ల వచ్చే రాయితీలు లేకపోతే అంతదూరం వెళ్లేవారు కారు. రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఆంధ్రకు వచ్చే హోదాల వలన ఏం లాభం వుంటుందో చూసి యిండస్ట్రీని అక్కడకు మార్చడమో, అనుబంధంగా మరోటి పెట్టడమో చేద్దామని కొంతకాలం వేచి చూశారు. హోదా లేదనడంతో ఎక్కడివాళ్లు అక్కడే వుండిపోయారు. వెంకయ్య నాయుడు తన యింటర్వ్యూలో ''నేను రాజ్యసభలో ఆంధ్రకు హోదా గురించి అడిగి సాధించగానే మర్నాడు బిహార్, అసాం లోని మా పార్టీ నాయకులే కాక బెంగాల్, ఒడిశా, యుపికి చెందిన అనేకమంది నేతలు లేచి నానా గొడవ చేసి తమకు కూడా ప్రత్యేక హోదా యివ్వాలని అడిగారు'' అని చెప్పారు. అంతేకాదు, ''పక్క రాష్ట్రాలకు హోదా యివ్వొద్దని తమిళనాడు సిఎం జయలలిత చెప్పారు. మీరు హోదా యిస్తే పొరుగు రాష్ట్రాల నుంచి పెట్టుబడులు తరలిపోతాయని కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేసిన వీరప్ప మొయిలీ పార్లమెంటులోనే మాట్లాడారు.'' అని కూడా చెప్పారు. 'ఇదంతా 14 వ ఫైనాన్స్ కమిషన్ రిపోర్టు వచ్చేముందు, యిప్పుడు పరిస్థితి మారిపోయాక హోదా అన్నది అజాగళస్తనమే' అనుకుందామన్నా మొన్న కెవిపి ప్రయివేటు బిల్లు పెట్టగానే మరో 9 రాష్ట్రాల నుంచి డిమాండ్ వచ్చింది. అంతెందుకు, యిప్పుడున్న హోదా తీసేస్తున్నాం అని ఉన్న రాష్ట్రాలకు చెప్పమనండి చూదాం, అమ్మయ్య వదిలిపోయింది అంటారో, కుదరదు అంటారో చూస్తే తెలిసిపోతుంది. హోదా శుద్ధ వేస్టు వ్యవహారమే అయితే యిన్ని రాష్ట్రాలు, యింతమంది అనుభవజ్ఞులైన నాయకులు ఎందుకిలా మాట్లాడతారు చెప్పండి. వారెవ్వరికి చంద్రబాబుకున్న విజ్ఞత లేదా?
హోదా గురించి రాజ్యసభలో తను ఎంతగా పట్టుబట్టానో వెంకయ్యనాయుడు పదేపదే చెప్తున్నారు. ఒప్పుకున్నాం. మేం అడుగుతున్నది కాంగ్రెసు అధికారంలో వుండగా మీరు డిమాండు చేయడం గురించి కాదు, తమరు అధికారంలోకి వచ్చాక ఏం చేశారు? అని. దానికి ఆయన 'కాంగ్రెసు చట్టంలో పెట్టి వుంటే..' అనడం తప్ప సరైన సమాధానం చెప్పరు. 'వాళ్ల సంగతి వదిలేయండి, మీరెందుకు పెట్టరు?' అని అడిగితే దానికి ఆయన సమాధానమేమిటో తెలుసా? ''…చట్టంలో పెట్టాలనుకుంటే అప్పుడు వీరప్ప మొయిలీ చెప్పిందే జరుగుతుంది. ఎన్డీసీ (నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్) ముందుకు వెళితే, వారంతా వ్యతిరేకిస్తూ తమ డిమాండ్లను ముందుకు తీసుకొస్తే నవ్వులపాలవుతాం.'' అని. మరి యిదే కారణం చేత కాంగ్రెసు పెట్టలేదు అని అర్థమవుతోంది కదా. కాంగ్రెసు పెట్టి వుంటే.. అని దీర్ఘాలు తీయడం దేనికి, పెట్టి వుంటే ఆంధ్రలో శూన్యస్థితికి వచ్చేది కాదు కదా. చట్టంలో వున్నది చేయడంలో గొప్పేముంది? వాళ్ల లోపాన్ని మీరు సరిదిద్దుతేనే మీకు గౌరవం దక్కుతుంది.
రాధాకృష్ణగారు తన వ్యాసంలో 'ప్రత్యేక హోదా పొందడానికి కావలసిన అర్హతలలో ఏ ఒక్కటీ ఏపికి లేకపోయినా వెంకయ్యనాయుడు ఏపికి ప్రత్యేక హోదా కావాలని కోరడం, అందుకు స్పందించిన మన్మోహన్ సింగ్ 'ఇస్తున్నాం పొమ్మనడం'లోనే వంచన వుంది.' అని స్పష్టంగా రాశారు. అంటే వెంకయ్యనాయుడు వంచకుడనేగా. ఆయన 2014 ఎన్నికల్లో ప్రచారం చేస్తూ 'ఐదేళ్లు కాదు, 15 ఏళ్లపాటు హోదా' అని అదరగొడుతున్నపుడు ఈ ముక్క రాధాకృష్ణ గారు రాసి వుంటే ఎంతో బాగుండేది. రాశారా? అందరూ కలిసి హోదా వస్తుంది, ఆంధ్రుల జీవితాల్లో వెలుగులే వెలుగులు అని వూదరగొట్టారు. ఇప్పుడు అదే వ్యాసంలో 'హోదా రాకపోతే ఏపీ సర్వనాశనం అవుతుందని ప్రజలు గుండెలు బాదుకునేలా చేశారు' అంటూ ప్రతిపక్షాలను తప్పుపడుతున్నారు. అసలు ప్రత్యేక హోదా గురించి ఆంధ్రుల్లో అవగాహన కల్పించినది వెంకయ్యనాయుడే, హోదా యిస్తున్నాం కాబట్టి విభజన వలన కలిగే నష్టాలు పూరిస్తున్నాం అంటూ ఎన్నికల ప్రచారాల్లో, అధికారంలోకి వచ్చిన కొత్త రోజుల్లో చెప్పుకున్నదీ వారే. అదే పల్లవి ఎత్తుకుని చరణాలు సమకూర్చి టిడిపి యింకా ముందుకు తీసుకెళ్లింది. 'హోదా వలన రాయితీలు, బాబు వంటి అనుభవుజ్ఞుడైన నేత సారథ్యం రెండూ డెడ్లీ కాంబినేషన్, ఇక ఆంధ్రను అందుకోగలిగేవారే వుండరు' అని హోరెత్తించారు. మీడియా కూడా వంత పాడింది. ఆంధ్ర ప్రజలు నమ్మారు. అందుకే హోదా అనేది సెంటిమెంటు అయిపోయింది. దాన్ని సాఫ్ట్ పెడల్ చేద్దామన్నా, రివర్సు చేద్దామన్నా అంత యీజీ కాదు. కెవిపి ప్రయివేటు బిల్లు పెట్టినపుడు బిజెపి ఆడిన నాటకం చూస్తేనే మండిపోయింది. 'ఇంత డ్రామా అవసరమా, పోనీ లాభం వుందో లేదో, ఉత్తుత్తిదే అయినా హోదా యిచ్చాం పొండి అనేస్తే వీళ్ల సొమ్మేం పోయింది' అనిపించింది.
చివరగా చెప్పాలంటే – ప్రత్యేక హోదా వలన పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు పెరుగుతాయి. ప్రజలు బాగుపడతారు. ప్యాకేజి అనగానే రాజకీయనాయకులకు, కాంట్రాక్టర్లకు పండగ. అది కూడా ఏ మేరకు జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం ఓ 10% విదల్చడం (బజెట్‌లో కేటాయింపులు చూస్తే యిది బాగా అర్థమవుతుంది), దానికి లెక్కలు అడగడం, ఆంధ్ర ప్రభుత్వం లెక్కలు పంపలేక తబ్బిబ్బు పడడం, దాంతో తక్కిన నిధులు ఆగిపోవడం జరుగుతోంది. బాబు హయాంలో ఆంధ్ర బాగుపడడం బిజెపికి, ముఖ్యంగా మోదీకి యిష్టం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకు అనేది మనక్కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో రాజకీయాలుండవు. మరి ఆంధ్రుల ఆగ్రహాన్ని బిజెపి ఎలా ఎదుర్కుంటుంది, బిజెపి కేంద్రనాయకత్వం చేజేతులా ఆంధ్ర యూనిట్‌ను నాశనం చేసుకుంటుందా అనే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానం రానున్న రోజులే చెపుతాయి. ఒకటి మాత్రం మనం గుర్తించాలి. బిజెపి రాజకీయ అవసరాల కోణంలో చూస్తే రాజస్థాన్, ఎంపీ, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రం కాదు ఆంధ్ర. కనీసం పొరుగున వున్న ఒడిశా, తెలంగాణ వంటిది కూడా కాదు. ఆంధ్రలో స్టేక్స్ చాలా తక్కువ. ఇప్పుడు ఆంధ్ర బిజెపిలో వున్నవారిలో తొలి నుంచీ ఆరెస్సెస్, బిజెపి రక్తం లేదు. కాంగ్రెసు, టిడిపిల నుంచి గోడదూకి వచ్చినవారే. కేంద్ర నాయకత్వాన్ని నిలదీయగల సత్తా ఎవరికీ లేదు. విస్తృతమైన రాజకీయ అవసరాల వ్యూహంలో భాగంగా బిజెపి ఆంధ్రను నిర్లక్ష్యం చేయవలసి వస్తే చేయనూ వచ్చు – నష్టపోయేది తక్కువే కాబట్టి!
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2016)