అయిపోయింది. తిరుపతిలో ఊగిపోవడం పూర్తయింది. కాకినాడలో ఘర్జించడం ముగిసింది. హోదా మీద తను అనుకున్న మేరకో, తనకు వచ్చిన లోపాయి కారీ ఆదేశాల మేరకో, ఎంత వరకు ఏక్ట్ చేయాలో అంతవరకు చేసేసారు పవన్. ఇక ఎవరు ఏమనుకున్నా ఆయన వినరు..తిరిగి మాట్లాడరు. సందేహాలు తీర్చరు. ఈ నెల 20 నుంచి మళ్లీ సెట్ మీదకు వెళ్లబోతున్నారు. కాటమ రాయుడు సినిమా షూట్ లో బిజీ కాబోతున్నారు.
అందుకోసం మళ్లీ తన ఫిజిక్ ను సెట్ చేసుకునేందుకు, లుక్స్ మెరుగు పర్చుకునేందుకు పవన్ బెంగుళూరుకు పయనమై వెళ్లినట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రత్యేకంగా జిమ్ చేయాలనుకున్నపుడల్లా పవన్ బెంగుళూరుకే వెళ్తారు. అందుకే ఓ పది రోజులు అక్కడ వుండి రావాలని వెళ్లినట్లు తెలుస్తోంది.
అంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు, సభలు, సమావేశాలు ఇక లేనట్లే. హోదా సాధనకు పవన్ నడుం బిగించడం కాకినాడతో సరి అనుకోవాల్సిందే.. ఎంపీలు పోరాడాలి. పార్టీలు పోరాడాలి అని రంకెలు వేయడం వరకే. ఈయన మాత్రం పొరపాటున కూడా పోరుబాట పట్టరు.
సినిమాలు మానేయడానికి నేను రెడీ..మానేయమంటారా అని మళ్లీ జనాల్నే అడుగుతారు. అంతే కానీ, మానేసి ఉద్యమ బాట పట్టరు. అలా అని మళ్లీ ముద్రగడో, జగనో ఉద్యమ బాట పడితే మాత్రం, ఎక్కడ క్రెడిట్ కొట్టేస్తారో అని, బ్రేక్ వేయడానికి మాత్రం ఆయన రెడీ అయిపోతారు.