మాజీ మంత్రి నారాయణ అరెస్టు వ్యవహారం ఇంకా అనేక మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ‘ఫోన్లను ట్యాప్ చేసి నారాయణను అరెస్టు చేశాం’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఇది చాలా తీవ్రమైన సంగతి. ఫోన్లను ట్రాక్ చేయడం ద్వారా అరెస్టు చేశారా? ట్యాప్ చేయడం ద్వారా అరెస్టు చేశారా? అనేది కీలకం. ఫోన్ ట్యాపింగ్ చేసి ఉన్నట్లయితే గనుక.. ప్రభుత్వమే పెద్ద నేరానికి పాల్పడినట్టు అవుతుంది. ఆ వ్యవహారం ఏకంగా జగన్ ను కూడా ఇరికిస్తుంది.
పోలీసులేమో ఫోన్ సిగ్నల్ ద్వారా నారాయణ ఎక్కడ ఉన్నారో ట్రాక్ చేసి అరెస్టు చేశాం అని అంటున్నారు. ఇది ఏ నేరస్తులను పట్టుకోవడానికైనా చాలా సాధారణంగా జరిగే పద్ధతే. వారి ఫోను ఏ టవర్ పరిధిలో ఉన్నదో ట్రాక్ చేయడం ద్వారా.. వారి కదలికల్ని గుర్తిస్తారు. వారు ఎక్కడ ఉన్నారో కనుక్కొని పట్టుకుంటారు.
అయితే తన మీద పేపర్ లీకేజీకి సంబంధించి కేసు నమోదు అయిందని తెలిసినప్పటినుంచి మాజీ మంత్రి నారాయణ తన ఫోన్ స్విచాఫ్ చేశారని పోలీసులే చెబుతున్నారు. అంటే.. ఆయన ఫోను నెంబరు ద్వారా ఆయన ఎక్కడ ఉన్నారనే లొకేషన్ తెలిసే అవకాశం లేదు.
తన ఫోను స్విచాఫ్ చేసి, మరో నెంబరు వాడుతున్నారని ఆ నెంబరును కూడా తెలుసుకుని సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా ట్రాక్ చేయడం ద్వారానే అరెస్టు చేశాం అని అంటున్నారు. ఈ మాటలను బట్టి.. లొకేషన్ ట్రాక్ ఆధారంగానే పట్టుకున్నారని అర్థమవుతుంది. అయితే ఆయన వాడుతున్న కొత్త నెంబరును పోలీసులు ఎలా గుర్తించారు?
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్టుగా.. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కొత్తనెంబరు వాడుతున్నారనే సంగతి వారికి అర్థమైందా? అనేది ఒక సందేహం. ఆయనేమో ‘వారి ఫోన్లను ట్యాపింగ్ చేసి నిజమైన బాధ్యులను అరెస్టు చేశారని’ పెద్దిరెడ్డి చెప్పినట్లుగా చాలా స్పష్టంగా పత్రికల్లో వచ్చింది.
‘ఫోన్ ట్రాకింగ్’ అనే పదాన్ని చెప్పబోయి.. మంత్రి పెద్దిరెడ్డి పొరబాటుగా ‘ఫోన్ ట్యాపింగ్’ అనే పదం చెప్పారా? అని కూడా చర్చ జరుగుతోంది. అదే నిజమైతే.. మంత్రులు అవగాహన లేకుండా.. పొరబాటుగా మాట్లాడడం ద్వారా.. ముఖ్యమంత్రి జగన్ ను, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో ఇది మరొక ఎపిసోడ్ అవుతుంది.
ఇప్పటికే హోం మంత్రి తానేటి వనిత రేపల్లె అత్యాచారం విషయంలో చేసిన కామెంట్లు, మంత్రి బొత్స సత్యనారాయణ పేపర్ లీకేజీ, మాస్ కాపీయింగ్ లకు ఇచ్చిన డెఫినిషన్లు.. ప్రభుత్వం పరువు తీసేలా మారిన సంగతి తెలిసిందే.