Bro Movie Review: మూవీ రివ్యూ: బ్రో

చిత్రం: బ్రో రేటింగ్: 2/5 తారాగణం: పవన్ కళ్యాణ్, సాయి తేజ్, ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం, సుబ్బరాజు, ఊర్వశి రౌతేలా తదితరులు స్క్రీన్ ప్లే- సంభాషణలు: త్రివిక్ర‌మ్ సంగీతం: తమన్…

చిత్రం: బ్రో
రేటింగ్: 2/5
తారాగణం: పవన్ కళ్యాణ్, సాయి తేజ్, ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం, సుబ్బరాజు, ఊర్వశి రౌతేలా తదితరులు
స్క్రీన్ ప్లే- సంభాషణలు: త్రివిక్ర‌మ్
సంగీతం: తమన్
కెమెరా: సుజిత్ వాసుదేవన్
ఎడిటర్: నవీన్ నూలి
నిర్మాతలు: టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల 
దర్శకత్వం: సముద్రకని
విడుదల తేదీ: 28 జూలై 2023

త్రివిక్ర‌మ్ పెన్నుపట్టిన సినిమా అంటే క్లాస్ ఆడియన్స్ కి కూడా దాని మీద కొన్ని అంచనాలుంటాయి. పవన్ కళ్యాణ్ ప్రధానపాత్ర అనగానే ఫ్యాన్స్ సంగతి చెప్పక్కర్లేదు. తమిళంలో వచ్చిన “వినోదయసితం” కి తెలుగుసేత ఈ 'బ్రో'. ఎలా ఉందో చెప్పుకుందాం. 

మార్కండేయులు అలియాస్ మార్క్ (సాయితేజ్) ఒక కంపెనీలో ఏజీఎం గా పని చేస్తున్న యువకుడు. అతనికి అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. తండ్రి పోవడం వల్ల బాధ్యతలన్నీ తనవే. తల్లి (రోహిణి) మార్కండేయులుతోటే ఉంటుంది. ఈ మార్కండేయులుకి ఒక లవర్ (కేతిక). అన్నీ తానే అనుకుని, తాను లేకపోతే తన కుటుంబసభ్యులు సరిగ్గా బతకలేరని, అందర్నీ సరైన దారిలో పెట్టాలని తపన పడిపోతూ ఉంటాడు మార్క్. అయితే అనుకోకుండా ఒక కార్ ఏక్సిడెంటులో చనిపోయి టైం (పవన్ కళ్యాణ్) అనబడే కాలపురుషుడిని కలుస్తాడు. ఇద్దరి మధ్యన ఒక ఒప్పందం కుదరడం వల్ల మార్క్ కి 90 రోజుల ఆయువు పొడిగిస్తాడు టైం. ఆ 90 రోజుల్లో మార్క్ చేసిందేవిటి? తెలుసుకున్నదేవిటి? చివరికి వేదాంతమేంటి? ఇదే కథ. 

ఈ కథలో ఇసుమంతైనా కొత్తదనం ఉందా అంటే లేదు. పోయిన మనిషికి ఆయువు పొడిగించి కిందకి దింపడమనేది 1980ల్లో “యముడికి మొగుడు” లోనే చూసాం. యముడి కాన్సెప్టులో ఇలాంటివి వరుసగా చాలా వచ్చాయి. పక్కనే దేవుడిగా ఉండి గీతబోధ చేస్తుంటే ఎలా ఉంటుందో “గోపాల గోపాల” లో చూసాం. అలాంటిదే గత ఏడాది “ఓరి దేవుడా” లో చూసాం. ఎప్పుడో “బ్రూస్ అల్మైటీ” నుంచి ఇలాంటి తంతు నడుస్తూనే ఉంది. 

మరి “వినోదయసితం” లో కొత్తగా కనిపించింది ఏంటి? దీనిని రీమేక్ చెయ్యాలని అనిపించినంత విషయం ఏముంది అంటే ఏమో!

తమిళంలో గంటన్నరలో ముగిసే ఈ కథని తెలుగులో రెండుంపావు గంటలు సాగతీయాల్సొచ్చింది. కారణం పవన్ కళ్యాణ్-సాయితేజ్ కాంబినేషన్, కమెర్షియల్ సరంజామా! 

తమిళంలో ప్రధానపాత్ర మధ్యవయస్సు వాడు. ఆ వయసువాడి చుట్టూ ఉండే బాధ్యతలు కనెక్టయ్యేలా ఉంటాయి. కానీ ఇక్కడ సాయితేజ్ ని పెట్టారు. అతను ఖరీదైన ఇంట్లో ఉంటూ రిచ్ గా కనిపిస్తుంటాడు! బాధ్యతలు, “సింగినాదం” అంటే ఎవరు కనెక్ట్ అవుతారు? 

ప్రధానమైన సోల్ మిస్సైపోయి అంతా కృతకంగా తయారయ్యింది. కథలో “సోల్” మాత్రమే కాదు, కధని నడిపే “షూ సోల్” లాంటి కథనం కూడా పరమ వీక్ గా ఉంది. అసలా స్క్రీన్ ప్లే రాసింది త్రివిక్రమేనా అని అనుమానమొస్తుంది. 

తెర మీద పాత్ర దేవుడా? పవన్ కళ్యాణా? అర్ధం కాక చిరాకొస్తుంది. ఏమో మరి త్రివిక్ర‌మ్ కి దేవుడంటే పవనే అని ఒక నిర్ణయానికి వచ్చేసి ఫ్యాన్స్ నే కాకుండా ప్రేక్షకులందర్నీ కన్విన్స్ చేసేయాలనుకుంటున్నాడా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ పాత సినిమాల్లోని పాటలన్నీ మెడ్లీలాగ బాది అదే దైవత్వం అని చెప్పినట్టుంది. త్రివిక్ర‌మ్ కి “లాయల్టీ పేస్” అనేది పవన్ కళ్యాణ్ దగ్గర వర్కౌట్ అయి ఉండొచ్చు! దానిని ప్రేక్షకుల మీద రుద్దడం దేనికి అనిపిస్తుంది? 

ఇక డైలాగుల విషయనికొస్తే త్రివిక్ర‌మ్ ని అనుకరిస్తూ ఎవరో అమెచ్యూర్ కుర్రరచయిత రాసినట్టున్నాయి తప్ప ఎక్కడా త్రివిక్ర‌మ్ లోని స్పార్కు కనపడలేదు. 

అన్నీ ఔట్ డేటెడ్ డైలాగ్సే. రెండు వాక్యాల్ని పక్కపక్కన పెట్టి వాటికి అంత్యప్రాసలు పెడితే గొప్ప డైలాగైపోతుందా!

“పుట్టడం మలుపు- చావడం గెలుపు”. ఇదొక డైలాగ్. ఇలా వేగ్ గా ఉన్నవాటికి ఏదో భాష్యం చెప్పుకుని ఇందులో చాలా లోతుందని చెప్పుకోవచ్చు. కానీ అది కాదు కదా కావల్సింది. వినగానే “వారేవా” అనిపించేటట్టు ఉండాలి. అదీ త్రివిక్ర‌మ్ బ్రాండ్ ఇమేజ్. అది వినిపించలేదు. 

“కళ్లల్లో కళ్లుపెట్టి చూడడానికి ఇదేమైనా కోకాపేట సైటా”- ఇది హీరో హీరోయిన్ తో కళ్లల్లోకళ్లుపెట్టి చూడు అన్నప్పుడు చెప్పే డైలాగ్. త్రివిక్ర‌మ్ స్టాండర్డ్ ఏ స్థాయి నుంచి ఏ లోతులో పడిందో తెలుసుకోవడానికి ఈ మచ్చుతునక ఒక్కటి చాలు. 

బ్రహ్మానందం చేసిన సింగిల్ సీన్ ఎంత పేలవంగా, స్టుపిడ్ గా ముగిసిందో చెప్పక్కర్లేదు. దేవుడని తెలియకపోయినా దేవుడి జాతకం గురించి చెప్పించిన డైలాగ్ అతికినట్టే ఉన్నా అసలా సీన్ ఉద్దేశ్యమే అర్థం కాకుండా పోయింది.

వెన్నెల కిషోర్ ఉన్నా నవ్వుల వెన్నెలలు లేవు. పృథ్విరాజ్ ఎందుకున్నాడో తెలీదు.  

ఓవరాల్ గా పరమ వీక్ రచన ఇది. పవన్ కళ్యాణ్ తెర మీదుంటే స్క్రిప్ట్ కోసం పెద్దగా బుర్ర వాడక్కర్లేదని డిసైడయ్యి మరీ తీసినట్టుంది. 

సంగీతపరంగా కూడా ఎక్కడా మెరుపుల్లేవు. పాటల్లొ సాహిత్యం గురించి చెప్పుకోవాలంటే… “మై డియర్ మార్కండేయ” లో మొదటి నాలుగు లైన్ల ఎత్తుగడ బాగుంది…కానీ పాటలో ఏదైనా తత్వాన్ని మాస్ గా చెప్పుంటే బాగుండేది… స్కోపున్నా కూడా ఒక సాదాసీదా ఐటం సాంగ్ లాగ మిగిలిపోయింది.

ఇక అర్థం పర్థం లేని కుసంస్కృతం పాట “బ్రో” థీం సాంగ్… “బ్రోదిన జన్మలేశం” ఏవిటో తద్దినం! అసలిందులో ఉన్నది ఏ భాషో రాసినవారు చెప్పాలి!

“జానవులే” పాట పీకనొక్కేసి గాయకుడిని పాడమంటే ఎలా ఉంటుందో అలా వింపించింది.

నేపథ్య సంగీతం గురించి పెద్దగా వంక పెట్టడానికేం లేదు. అది బానే ఉంది. 

నటీనటుల విషయానికొస్తే పవన్ కళ్యాణ్ తెరమీద చూడడానికి బాగున్నాడు. బయటకంటే చాలా యంగ్ గా కనిపించాడు. అయితే పాత్రపరంగా “గోపాల గోపాల” కి కంటిన్యూషన్లా ఉంది తప్ప ఏ మాత్రం కొత్తదనం లేదు.

సాయితేజ్ మాత్రం కంప్లీట్ ఔటాఫ్ షేపులో ఉన్నాడు. నటన మామూలే.

కేతిక శర్మ ఒక పాటలో కాస్త ఉనికి చాటుకుంది తప్ప తక్కిన సినిమాలో తన నిడివి చాలా తక్కువ.

ప్రియప్రకాష్ వారియర్ సాయి తేజ్ చెల్లిలిగా ఓకే. సీతారామశాస్త్రిగారబ్బాయి రాజా చెంబోలు నాలుగైదు సన్నివేశాల్లో కనిపించాడు.

సుబ్బరాజు, తనికెళ్లభరణి, వెన్నెల కిషోర్ ల పాత్ర గురంచి పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు. 

ప్రధామార్థం రొటీన్ గా ఉన్నా, సెకండాఫ్ తేలిపోవడం, ఎక్కడా ఎమోషన్స్ పండకపోవడం, బలహీనమైన సంభాషణలు, కథలోని బలాన్ని చీప్ కథనంతో చంపేయడం, పసలేని పాటలు ఈ సినిమాకు మైనస్సులు. 

సినిమా చివర్లో “ఒక్క మంచిపని కూడా చెయ్యాలేదా” అని సాయితేజ్ పవన్ ని అడిగితే, “ఒక్కటి చేసావ్” అని చెప్తాడు. 

ఆ టైపులో “ఈ సినిమాలో ఒక్క మంచి విషయం కూడా లేదా?” అని మీరడిగితే, “ఒక్కటుంది” అని చెప్పాలి. 

అదే లాస్ట్ అండ్ ఫైనల్ సీన్లో దేవుడు చెప్పే డైలాగ్, “ఏమీ ఆశించకుండా పక్కవాడికి సాయం చేసే వాడికి నేనేమిస్తానో తెలుసా” అని కౌగిలి చాపుతాడు. అదొక్కటీ మెచ్యూర్డ్ గా ఉంది. కానీ ఆ ఒక్క బిట్ కోసం రెండుంపావు గంటల కంగాళీకథనాన్ని తట్టుకోవడం కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా భరించే అభిమానవీరులు తప్ప ఏదో ఆశించి వెళ్లే మిగిలిన ప్రేక్షకులకి మాత్రం కష్టం.  

బాటం లైన్: “బ్రో”చేవారెవరురా!