తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయంగా ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పనుల విషయంలో పులివెందులను జగన్ ప్రత్యేకంగా చూస్తున్నారు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగు తీస్తోంది. మెడికల్ కాలేజీ, నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం తదితర అభివృద్ధి పనులు జరిగాయి. ఇటీవల పులివెందులలో పర్యటించిన జగన్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభాలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే వివేకా హత్య కేసు విషయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే, రాజకీయంగా నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే సీఎం జగన్ యాక్షన్ ప్లాన్ రూపొందించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కడప ఎంపీ అవినాష్‌రెడ్డి గురువారం కలుసుకున్నారు. వీళ్లిద్దరూ సుదీర్ఘంగా పలు అంశాలపై చర్చించుకున్నారు.
ముఖ్యంగా వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్‌రెడ్డి తాజా పరిణామాలపై జగన్‌కు వివరించినట్టు తెలుస్తోంది. వివేకా హత్య కేసుకు సంబంధించి తుది చార్జిషీట్‌ను కూడా సీబీఐ తన కోర్టుకు సమర్పించిన సంగతి తెలిసిందే. అవినాష్‌రెడ్డి అరెస్ట్‌పై కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. భవిష్యత్‌లో కేసుకు సంబంధించి అవినాష్‌కు ఏదైనా జరిగితే, పులివెందులలో రాజకీయ బాధ్యతల్ని చూసుకోడానికి సీఎం జగన్ తనకు నమ్మకమైన నాయకుడిని సిద్ధం చేసుకున్నారని సమాచారం.
తన కుటుంబానికి చెందిన వైఎస్ అభిషేక్‌రెడ్డిని నియోజకవర్గ వ్యాప్తంగా తిరగాలని జగన్ సూచించినట్టు సమాచారం. అయితే ఎన్నికల కాలం కావడంతో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే చూసుకోడానికి పక్క జిల్లాకు చెందిన నాయకుడికి పులివెందుల బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రస్తుతం పులివెందుల వైసీపీ బాధ్యతల్ని అవినాష్‌రెడ్డి చూస్తున్నారు. వివేకా కేసులో అవినాష్‌కు ఏదైనా అయితేనే, పక్క జిల్లాకు చెందిన నాయకుడిని దింపే ఆలోచనలో జగన్ ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. సదరు నాయకుడికి బాధ్యతల అప్పగింతపై దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. కీడెంచి మేలు ఎంచాలనే సామెత చందాన.. రాజకీయంగా అన్నింటికి సిద్ధంగా ఉండాలనే తలంపుతో జగన్ ముందు జాగ్రత్తగా అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారని సమాచారం.