ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సర్పంచుల పోరాటానికి వైసీపీ సర్కార్ ఎట్టకేలకు తలొగ్గింది. గ్రామ పంచాయతీలకు నిధుల్ని వైసీపీ ప్రభుత్వం జమ చేసింది. దీంతో సర్పంచులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలకు 14, 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధుల్ని వివిధ అవసరాల నిమిత్తం వాడుకుంది.
ప్రభుత్వం తమ నిధుల్ని వాడుకోవడంపై సర్పంచులు నిరసనకు దిగారు. పంచాయతీల్లో దొంగలు పడ్డారంటూ సైబర్ నేరం కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు సర్పంచులు ఫిర్యాదు చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేశారు. ధర్నాలు, ర్యాలీలతో హోరెత్తించారు.
రాష్ట్ర వ్యాప్తంగా స్పందన కార్యక్రమాల్లో కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. తమ అనుమతి లేకుండా నిధుల్ని దారి మళ్లించిన వారిపై చర్యలు తీసుకోవాలని, పంచాయతీల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని సర్పంచులు కోరారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీకి చెందిన సర్పంచులు సైతం నిరసనకు దిగడంతో వైసీపీ ప్రభుత్వం దిగొచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలకు కేంద్రం నుంచి విడుదలైన నిధుల్ని జమ చేయడం మొదలు పెట్టింది. దీంతో సర్పంచులు ఖుషీ అవుతున్నారు. ఈ నిధులతో తమ పంచాయతీల పరిధిలోని సమస్యల పరిష్కరించుకుంటామని సర్పంచులు చెబుతున్నారు. భవిష్యత్లో పంచాయతీల నిధుల్ని ఇతరత్రా అవసరాలకు ప్రభుత్వం వాడుకోవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు.