జనసేనాని పవన్‌కల్యాణ్‌పై విమర్శలు గుప్పించడంలో మంత్రి ఆర్కే రోజా ముందు వరుసలో వుంటారు. వారాహి యాత్రలో వలంటీర్లపై పవన్ చేసిన అభ్యంతరకర కామెంట్స్‌పై ఇంకా రాజకీయ రగడ రగులుతూనే వుంది. ఇవాళ మంత్రి రోజా అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుతో పాటు పవన్‌ను ఓ రేంజ్‌లో చాకిరేవు పెట్టారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు అభివర్ణించడాన్ని రోజా తిప్పి కొట్టారు. అసలుసిస్సలు సీమ ద్రోహి చంద్రబాబే అని ఆమె మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబునాయుడు తనకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన సీమకు ఇసుమంతైనా చేయలేదని తప్పు పట్టారు. కరవు ప్రాంతమైన సీమకు సాగునీటి జలాలు ఇచ్చేందుకు ప్రాజెక్టులు కట్టాలని ఒక్కసారైనా ఆలోచించిన దాఖలాలు లేవన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీమకు ఎంతో చేశారన్నారు. చంద్రబాబు పాలనలో కరవులు తప్ప, వర్షాలు పడలేదని విమర్శించారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలని వెటకరించారు. రెయిన్‌గన్లతో కరువును పారదోలుతానని చెప్పి, చంద్రబాబు దాన్ని కూడా ఆర్థికంగా సొమ్ము చేసుకున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో అమ్మాయిల మిస్సింగ్‌పై పవన్‌కల్యాణ్ చేసిన ఆరోపణలపై స్పందించాలని రోజాను మీడియా ప్రతినిధులు కోరారు. దీనికి ఆమె తీవ్రంగా స్పందించారు. పవన్‌కల్యాణ్ వల్ల రాష్ట్రంలో ఎంత మంది మిస్ అయ్యారో లెక్కలు తీయండి సార్ అని వ్యంగ్యంగా అన్నారు. ఊరికే మాట్లాడితే ఎట్లా అని ఆమె ప్రశ్నించారు. పవన్‌కు రాజకీయ అవగాహన లేదన్నారు. ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదన్నారు. చంద్రబాబునాయుడు రాయించిన స్క్రిప్ట్ చదవడం తప్ప, ఒక్క ప్రశ్న అదనంగా అడిగినా సమాధానం చెప్పలేడని రోజా వెటకరించారు.
నివేదికలు మార్చడానికి ఉండదన్నారు. కేంద్ర నిఘా సంస్థ తనకేదో నివేదిక ఇచ్చినట్టు పవన్ చెబుతున్నారని ఆమె తెలిపారు. కేంద్ర నిఘా సంస్థ ఏదైనా వుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుందన్నారు. వాటి లెక్కలు ఆన్‌లైన్‌లో వుంటాయని, మీరైనా, నేనైనా చూసుకోవచ్చన్నారు. కనీసం వార్డు సభ్యుడిగా కూడా గెలవని పవన్‌కు ఏ కేంద్ర సంస్థ వివరాలు ఇచ్చిందో చెప్పాలి కదా అని ఆమె ప్రశ్నించారు. తనకు కేంద్ర నిఘా సంస్థ నివేదిక ఇచ్చిందని చెబుతున్న పవన్‌కల్యాణ్, అది బయట పెడితే చర్చిస్తామని ఆమె అన్నారు.
ఆడపిల్ల తండ్రిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వారి రక్షణ, సాధికారత గురించి మద్దతుగా ఉన్నారన్నారు. ఇదే విధంగా ముందుకెళుతారన్నారు. పవన్‌కల్యాణ్ లాంటి వాళ్లు ఎన్ని సార్లు మాట్లాడినా గురివిందగింజ సామెత గుర్తుకొస్తుందన్నారు.