తెలంగాణలో రాజకీయం రంజుగా మారింది. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయంగా పైచేయి సాధించేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ , కాంగ్రెస్ నేతలు పరస్పరం విమర్శించుకోవడంలో తగ్గేదే లే అంటున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో వరదలకు దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి రూ.10 వేలు చొప్పున ఇవ్వాలనే డిమాండ్‌పై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తున్నారు.
దీనికి కౌంటర్‌గా అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా వినూత్నంగా నిరసన చేపట్టింది. టీపీసీసీకి సారథ్యం వహిస్తున్న రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. హైదరాబాద్ నగర పరిధిలోని మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రేవంత్‌రెడ్డి వరదల సమయాల్లో ఆచూకీ లేకుండా పోతున్నారని బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. 2020లో, 2023లో వరదలు వచ్చినప్పుడు రేవంత్‌రెడ్డి తన నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదని విమర్శిస్తున్నారు.
మల్కాజ్గిరి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కనబడడం లేదని నియోజకవర్గ వ్యాప్తంగా పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ఒక ఎంపీగా ఎప్పుడైనా నియోజ వర్గానికి వచ్చారా ? అంటూ రేవంత్ రెడ్డిని ఆ పోస్టర్లలో నిలదీయడాన్ని గమనించొచ్చు. ఈ పోస్టర్ల రాజకీయం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలకు దారి తీసింది.