మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యర్థులపై పంచ్‌లు విసరడంలో దిట్ట. బొత్స మాటలు సరిగా అర్థం కానట్టు వుంటాయి కానీ, చమత్కారంలో భలే గడుసరి ఆయన.
వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని ఎలాగైనా వివాదాస్పదం చేయాలని టీడీపీ పట్టుదలతో వుంది. ఇందులో భాగంగా టీడీపీ పల్లకీ మోసే సూటు బూటు వేసుకుని నిత్యం డిబేట్లలో వైసీపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించే ఒకాయన న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేశారు.
విద్యార్థులను రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాలకు తరలించి వద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన తీర్పును ధిక్కరించారనేది ఆయన వాదన. ఇది కోర్టు ధిక్కారమంటూ వైసీపీ ప్రభుత్వంపై న్యాయ పోరాటం మొదలు పెట్టారు. దీని వెనుక కర్త, కర్మ, క్రియ చంద్రబాబునాయుడే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సదరు పిటిషన్‌పై స్పందించిన ఏపీ హైకోర్టు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ తనదైన స్టైల్లో స్పందించారు. అమ్మఒడి కార్యక్రమాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కాకుండా, సినిమా యాక్టర్లను తరలిస్తారా? అని అదిరిపోయే పంచ్ విసిరారు. కార్యక్రమాలకు తల్లిదండ్రులు రావడం తప్పని తాను అనుకోవడం లేదని తేల్చి చెప్పారు. కోర్టు సూచనలను తాము పాటిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలకు తమ ప్రభుత్వం మంచి చేస్తుంటే టీడీపీ ఓర్చుకోలేకపోతోందని తప్పు పట్టారు.