పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఆనందం వచ్చినా పట్టలేం, కోపం వచ్చినా తట్టుకోలేం. ఈరోజు అది మరో రూపంలో బయటపడింది. పవన్ కల్యాణ్, సాయితేజ్ నటించిన బ్రో సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఈలలు వేసి, గోల చేసి, పేపర్లు విసిరి సినిమాను ఎంజాయ్ చేయాల్సిన ఫ్యాన్స్.. ఏకంగా తెరను చించేశారు. దీంతో సినిమా ఆగిపోయింది.
పార్వతీపురంలో సౌందర్య థియేటర్లో బ్రో సినిమాను రిలీజ్ చేశారు. అప్పటికే ఫ్యాన్స్ కిక్కిరిసి ఉన్నారు. సినిమా స్టార్ట్ అయింది. పవన్ ఎంట్రీ కోసం అభిమానులు వెయిటింగ్. ఆ టైమ్ రానే వచ్చింది. పవన్ ఇలా వచ్చిన వెంటనే తెరపై పాలాభిషేకాలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఫ్యాన్స్ లో ఉత్సాహం మరింత పెరిగింది. తెరపై తోపులాట మొదలైంది. ఆ గొడవలో తెర చిరిగిపోయింది. తెర చించిన వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గూడూరు.. కావలిలో కూడా..
కావలిలోని లతా థియేటర్ వద్ద కూడా ఉద్రిక్తత నెలకొంది. సినిమా స్టార్ట్ అయింది. సౌండ్ ఫెయిలైంది. దీంతో యాజమాన్యం సినిమా ఆపేసింది. దీంతో ఫ్యాన్స్ భగ్గుమన్నారు. రచ్చ రచ్చ చేశారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి, అభిమానులకు మధ్య పెద్ద గొడవ జరిగింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
గూడూరులోని సింగం థియేటర్ వద్ద ఫ్లెక్సీ కలకలం రేగింది. ఫ్లెక్సీల ఏర్పాటుకు థియేటర్ యాజమాన్యం నిరాకరించింది. దీంతో గొడవ పెరిగింది. ఓ దశలో ఫ్లెక్సీ చిరగడంతో గొడవ మరింత పెద్దదైంది. చివరికి యాజమాన్యం దిగొచ్చింది. ఫ్లెక్సీ పైకి లేచింది.
బ్రో చూసిన తనయుడు..
మరోవైపు బ్రో సినిమాను ఫ్యాన్స్ మధ్య చూసేందుకు పవన్ కల్యాణ్ కొడుకు అకిరా నందన్ సుదర్శన్ థియేటర్ కు వచ్చాడు. తన ఫ్రెండ్స్ తో కలిసి, అభిమానుల సమక్షంలో సినిమా చూశాడు. ఇక హీరోహీరోయిన్లు సాయితేజ్, కేతికశర్మ హైదరాబాద్ లోని దేవి థియేటర్ లో సందడి చేశారు.