మహానటితో వచ్చిన గుర్తింపును క్రమక్రమంగా పెంచుకుంటూ పోతున్నాడు దుల్కర్ సల్మాన్. సీతారామం సినిమాతో టాలీవుడ్ లో పాతుకుపోయిన ఈ హీరో, ఇప్పుడు మరో స్ట్రయిట్ తెలుగు సినిమా ఎనౌన్స్ చేశాడు.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు దుల్కర్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఈరోజు అధికారికంగా ఎనౌన్స్ చేశారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు లక్కీ భాస్కర్ అనే టైటిల్ పెట్టారు.
కథలో కొత్తదనం లేకపోతే దుల్కర్ ఒప్పుకోడనే విషయం తెలిసిందే. సో.. లక్కీ భాస్కర్ కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే కచ్చితంగా ఏదో కొత్త పాయింట్ ఉండే ఉంటుంది. ఓ కామన్ మేన్ నమ్మశక్యంకాని విధంగా ఎలా ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడనేది ఈ కథలో చూపించబోతున్నారట.
ఈమధ్య తెలుగులో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న జీవీ ప్రకాష్ కుమార్, ఈ సినిమాకు కూడా సంగీతం అందించబోతున్నాడు. సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా డిసైడ్ చేయలేదు.
ధనుష్ తో సార్ సినిమా తీశాడు వెంకీ అట్లూరి. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టును దుల్కర్ తో ఎనౌన్స్ చేశాడు. ఈ రెండు సినిమాలూ సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ వే కావడం విశేషం.