ఈరోజు థియేటర్లలోకి వచ్చింది బ్రో సినిమా. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో ప్రతి పాత్రకు ఓ వెయిట్ ఉంది. కేవలం 2 పాత్రలు మాత్రమే అలా వచ్చి ఇలా వెళ్లిపోతాయి. సినిమాతో ఎలాంటి సంబంధం లేని అలాంటి ఓ పాత్రలో బ్రహ్మానందం కనిపించగా, మరో పాత్రలో 30 ఇయర్స్ పృధ్వి కనిపించారు.
బ్రహ్మానందంతో ఓ సీన్ పెట్టారంటే ఓకే అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన లెజెండ్. తెరపై కనిపిస్తే నవ్వులు పూయాల్సిందే. అది జరిగింది కూడా. కానీ 30 ఇయర్స్ పృధ్వీని ఎందుకు అదే పనిగా సినిమాలో ఉంచారనేది మాత్రం కొంతమందికి అర్థం కాలేదు.
బ్రో సినిమా కథకు 30 ఇయర్స్ పృధ్వీకి సంబంధం లేదు. పబ్ లో అతడు 2 సార్లు కనిపిస్తాడంతే. అతడికి డైలాగ్ కూడా లేదు. కానీ అతడితో అదే పనిగా ఓ డాన్స్ మూమెంట్ వేయించారు, ఆ డాన్స్ పై పవన్ పంచ్ వేసేలా ఓ సీన్ ఇరికించారు. ఇదంతా ఎందుకుంటే, వైసీపీ నేత అంబటి రాంబాబుపై సెటైర్ కోసం.
అప్పుడెప్పుడో అంబటి రాంబాబు, పండగ సందర్భంగా డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది. సరిగ్గా అప్పుడు అంబటి వేసుకున్న డ్రెస్ నే, సినిమాలో పృధ్వీకి ఇచ్చారు. దాదాపు అలాంటి స్టెప్పుల్నే వేయించారు. దానికి పవన్ తో ఓ పేరడీ డైలాగ్ చెప్పించారు.
పవన్ చేస్తున్న విమర్శల్ని వైసీపీ నుంచి తిప్పికొట్టే ప్రముఖుల్లో ముందు వరసలో ఉంటారు అంబటి రాంబాబు. పవన్ చేసే ప్రతి రాజకీయ విమర్శను గట్టిగా తిప్పికొడుతుంటారు. దీంతో ఆయన్ను టార్గెట్ చేస్తూ, సినిమాలో ఏకంగా ఓ సీన్ పెట్టడం విశేషం. కథతో సంబంధం లేకపోయినా, ఆ సీన్ ను కట్ చేయకుండా అలానే ఉంచడానికి కారణం ఇదేనంటున్నారు చాలామంది.
దీనిపై అప్పుడే సోషల్ మీడియాలో కౌంటర్లు మొదలైపోయాయి. పవన్ కల్యాణ్ ర్యాగింగ్ ఓ రేంజ్ లో ఉందంటూ జనసైనికులు సంబర పడుతుంటే, రాజకీయాల్లో చేసేదేం లేక, ఇలా సినిమాల్ని అడ్డం పెట్టుకొని పవన్ తృప్తి పొందుతున్నారని వైసీపీ కార్యకర్తలు ఎద్దేవా చేస్తున్నారు.