ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి మంచి పేరు ఉన్నట్టు ఆ పార్టీ నాయకులు భ్రమల్లో ఉన్నారు. ఏపీ విభజన మొదలుకుని, విభజిత రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటిని ఇవ్వడంలో మోదీ సర్కార్ అడుగడుగునా దగా చేస్తోందనే అభిప్రాయం ఉంది. అందుకే గత ఎన్నికల్లో బీజేపీకి కనీసం నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా ఆంధ్రప్రదేశ్‌లో రాలేదు. బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీనే మెరుగైన ఓట్లను సాధించింది. అయితే కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఆ పార్టీకి చెందిన ఏపీ నాయకులు రంకెలేస్తున్నారు.
తాజాగా ఏపీ బీజేపీకి నూతన సారథిగా పురందేశ్వరి వచ్చారు. బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి వైసీపీ సర్కార్‌పై విరుచుకుపడుతున్నారు. ఇంతకూ ఈమె టీడీపీనా? బీజేపీనా? అనే అనుమానం సొంత పార్టీ నాయకులకు కూడా వచ్చేంతగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం భారీగా సాయం అందిస్తున్నా, ఏమీ ఇవ్వడం లేదంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని పురందేశ్వరి విమర్శించారు.
బీజేపీపై టీడీపీ చేసిన దుష్ప్రచారం చాలదన్నట్టు, ఇంకా ఏం మిగిలి వుందని తాము చేయడానికి అని వైసీపీ ప్రశ్నిస్తోంది. బీజేపీపై దుష్ప్రచారం అంటే ఎలా వుంటుందో… 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రసంగాలను వింటే పురందేశ్వరికి అర్థం అవుతుందని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు. ప్రధాని మోదీపై చంద్రబాబు నాడు వ్యక్తిగతంగా కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడాన్ని పలువురు ఆమెకు గుర్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇవ్వడం తప్ప, మోదీ సర్కార్ ఎలాంటి సాయం అందించలేదని చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు గతంలో విమర్శించడాన్ని పురందేశ్వరి మరిచిపోయినట్టున్నారని నెటిజన్లు చితక్కొడుతున్నారు. నాడు నందమూరి బాలకృష్ణ ప్రధాని అనే గౌరవం కూడా లేకుండా మోదీపై ఘాటు విమర్శలు చేయడాన్ని ఎలా మరిచిపోయావమ్మా అని పురందేశ్వరిని నెటిజన్లు నిలదీస్తున్నారు.
మోదీని శిఖండి అని, తరిమితరిమి కొడ్తామని బాలయ్య నాడు చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో బీజేపీ నేతలు పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు అవేవీ పురందేశ్వరికి గుర్తు లేవని, తన మరిదిని సీఎం చేసుకోడానికి తెగ తాపత్రయ పడుతున్నారని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు.