స్పెషల్ సాంగ్స్ బ్యూటీ ఊర్వసి రౌతేలా నిన్నంతా ట్రోలింగ్ కు గురైన సంగతి తెలిసిందే. జనసేన అధినేత, 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్ ను ఆమె ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేసేసింది. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ తర్వాత పెట్టిన ట్వీట్ లో, పవన్ ను ముఖ్యమంత్రిగా సంభోదించి చాలామంది ఆగ్రహానికి గురైంది ఊర్వశి.
అయితే తెలివిగా ఆమె ఆ ట్వీట్ ను డిలీట్ చేయలేదు. డిలీట్ చేసుంటే, పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి ఆమె గురయ్యేది. అందుకే ఈరోజు ఆమె మరో ట్వీట్ పెట్టింది. అయితే ఈసారి కూడా చిన్న తప్పు చేసింది.
నిన్న పెట్టిన ట్వీట్ ను యాజ్ ఇటీజ్ గా కాపీ చేసి, ఈరోజు పేస్ట్ చేసింది ఊర్వశి. అందులోంచి “చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్” అనే పదాన్ని మాత్రం తొలిగించింది. మిగతా పోస్టును యథాతథంగా పెట్టేసింది. దీంతో ఈసారి మరిన్ని తప్పులు దొర్లాయి.
నిన్నటి ట్వీట్ ను కాపీ-పేస్ట్ చేయడం వల్ల 'టుమారో రిలీజ్' (రేపే విడుదల) అనే పదాన్ని, జులై 28 అనే హ్యాష్ ట్యాగ్ ను అలానే వదిలేసింది. ఈ సినిమా ఈరోజు రిలీజైంది. కానీ కాపీ-పేస్ట్ చేయడం వల్ల రేపు సినిమా రిలీజ్ అనే అర్థం వచ్చింది.
దీంతో ఊర్వశిపై మరోసారి ట్రోలింగ్ మొదలైంది. రాజకీయాలపై అవగాహన లేదు కాబట్టి, పవన్ ను సీఎం చేశావంటే అర్థం చేసుకోవచ్చు, సినిమా ఫీల్డ్ లో ఉంటూ సినిమా విడుదలపై కూడా అవగాహన లేకపోతే ఎలా అంటూ నెటిజన్లు ఆమెను ఆడుకుంటున్నారు. ట్వీట్ డిలీట్ చేయమంటూ డిమాండ్ చేస్తున్నారు.
పాపం, బ్రో సినిమాకు ఊర్వశికి పెద్దగా సంబంధం లేదు. ఓ స్పెషల్ సాంగ్ లో సగం నుంచి ఎంట్రీ ఇచ్చి డాన్స్ చేసి వెళ్లిపోయింది. అంతకుమించి ఆమెకు పవన్ సినిమాతో కనెక్షన్ లేదు. అయినప్పటికీ ఆమె చేసిన 'కాపీ-పేస్ట్' తప్పిదం వల్ల ఇలా ట్రోలింగ్ కు గురికావాల్సి వస్తోంది.