ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులతో పాటు సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
జస్టిస్ ధీరజ్ సింగ్ బాంబే హైకోర్టు సీజేగా పని చేస్తూ పదోన్నతిపై ఏపీకి వచ్చారు. ఆయన జమ్మూకశ్మీరు చెందిన వారు. ఆయన తండ్రి, సోదరుడు కూడా న్యాయమూర్తులుగా పనిచేశారు. న్యాయవర్గాల్లో అత్యంత సౌమ్యుడిగా, వివాదరహితుడిగా, సమర్థుడిగా ఆయనకు పేరుంది.
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే)గా వ్యవహరిస్తున్న జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ఇకపై నంబర్ 2గా కొనసాగునున్నారు. త్వరలో ఆయన కూడా వేరే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేస్తున్న పీకే మిశ్రా సుప్రీంకోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే.