టీటీడీ ప్రస్తుత పాలక మండలి పదవీ కాలం వచ్చే నెలలో ముగియనుంది. వచ్చే 7న చివరి పాలక వర్గ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో కొత్త పాలక మండలి కూర్పుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా పాలక మండలి చైర్మన్‌గా ఇంత వరకూ జంగా కృష్ణమూర్తి, పార్థసారథి తదితరుల పేర్లపై విస్తృతంగా ప్రచారం జరిగింది. ఎన్నికల ముంగిట కావడంతో సామాజిక సమీకరణలకు జగన్ పెద్ద పీట వేస్తారనే చర్చ జరుగుతోంది.
అయితే టీటీడీలో విప్లవాత్మక మార్పులకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా అనుభవానికి ప్రాధాన్యం ఇచ్చే కోణంలో కూడా జగన్ సీరియస్ ఆలోచిస్తున్నారని తాజా సమాచారం. అనుభవాన్నే పరిగణలోకి తీసుకుంటే సామాజిక సమీకరణలు పక్కకు పోతాయి. టీటీడీకి, హిందూ ధర్మానికి మేలు చేసేలా, కోట్లాది మంది భక్తుల ప్రయోజనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తారో అలాంటి వారికి చైర్మన్ బాధ్యతలు అప్పగించే అవకాశాలు మెరుగుపడ్డాయి.
నూతన పాలక మండలిని ఏ క్షణాన్నైనా ప్రకటించే అవకాశం ఉంది. ఇంత వరకూ ఏ ఒక్క నాయకుడికి సీఎం జగన్ చైర్మన్ గిరిపై మాట ఇవ్వలేదు. జగన్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఆయన చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా కొనసాగుతూ వచ్చారు. ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ బాధ్యతల్లో ఆయన వుండడంతో అక్కడ ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వుంది.
కొత్త చైర్మన్‌గా ఎన్నికయ్యే నాయకుడు భవిష్యత్‌లో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండే అవకాశం వుంది. అలాంటి నాయకుడెవరో జగన్ దృష్టిలో ఉన్నారని సమాచారం.