దాంపత్యంలో చీటింగ్ అనే అంశం గురించి వస్తే.. బాగా వినిపించే అభిప్రాయం.. హై క్లాస్ జనాల్లో వీటి గురించి అంత పట్టింపు ఉండదు. లోక్లాస్ లో ఇదో పెద్ద రచ్చ కాదు. ఎటొచ్చీ మిడిల్ క్లాస్ లోనే ఇదో తీవ్రమైన అంశం అనేది చాలా మంది చెప్పే అంశం.
లెక్కలేనంత సంపాదించిన వారు .. ఎక్స్ ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ ను మరీ అంత సీరియస్ గా తీసుకోరనే ప్రచారం ఉంది. ఇక బాగా దిగువతరగతి వారి ఇంటి వ్యవహారాలను బతుకు జట్కా బండి అంటూ టీవీలకు ఎక్కిస్తున్నారు! మరి ఇంతకీ ఏ క్లాస్ లో అయినా, ఇంతకీ మ్యారటల్ లైఫ్ లో ఉంటూ చీటింగ్ ఎందుకు చేస్తుంటారనే అంశంపై రకరకాల అధ్యయనాలు జరుగుతూనే ఉంటాయి. మరి ఆ అధ్యయనాలు చెప్పే రీజన్లేమిటంటే..
బోర్ డమ్!
ఒకే మనిషితో సాంగత్యం అనేది క్రమేపీ బోర్ డమ్ ను కలిగించవచ్చు, ఇది యుక్త వయసులో ఉన్నప్పుడే ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అంటే పెళ్లి చేసుకున్న కొంతకాలానికే కలిగే భావన కావొచ్చు ఇది. దీన్ని దాటిన వారి మధ్యన ఎమోషనల్ అటాచ్ మెంట్ ఏర్పడుతుంది. అది ఏర్పడకపోతే.. వివాహం అయిన కొంతకాలానికే బోర్ డమ్ అనే ఫీలింగ్ కలగొచ్చు. దీని వల్ల పక్క చూపులు చూసే అవకాశాలు ఉంటాయి, ప్రత్యేకించి పురుషుల విషయంలో ఈ రీజన్ గట్టిగా వినిపిస్తుంది.
రీవేంజ్!
ఇది స్త్రీల వైపు నిలిచే రీజన్. తమ పార్ట్ నర్ తమతో సరిగా వ్యవహరించకపోవడం.. అవమానించడం, అనుమానిస్తూ ఉండటం, కించపరచడం, చిన్న చూపు చూడటం.. ఇలాంటి తీరును భరించలేని తత్వం కలిగిన వారు ప్రతీకారంతో అయినా మరొక వ్యవహారం వైపు చూసే అవకాశం ఉందనేది ఒక పరిశీలన.
నిర్లక్ష్యం, అన్ హ్యాపీనెస్!
తమ పార్టనర్ తమను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారనే భావన కూడా పక్క చూపులకు ప్రధాన కారణాల్లో ఒకటి. అది స్త్రీ అయినా, పురుషుడు అయినా.. పార్ట్ నర్ చేత బాగా నిర్లక్ష్యానికి గురయినప్పుడు ఇలాంటి వ్యవహారాలవైపు చూసే అవకాశం ఉంది. తద్వారా తమలోనూ అట్రాక్టివ్నెస్ ఉందని నిరూపించుకుని, తమ ఇగోకు తృప్తిని కలిగించవచ్చు. పార్ట్ నర్ చూసే నిర్లక్ష్యం వల్ల కలిగే అన్ హ్యాపీనెస్ ఈ బంధాల వైపు దారి తీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
బంధానికే స్వస్తి పలికేందుకు!
ఇదొక విచిత్రమైన అంశమే. వైవాహిక జీవితం నుంచి బయటకు రావాలని నిర్ణయించుకుని కూడా కొందరు కావాలని ఇటువంటి బంధాల వైపు చూస్తారని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే వివాహేతర సంబంధం ద్వారా ఈ వివాహం పై ఎలాంటి ఆసక్తి లేదని పార్ట్ నర్ కు తెలియజెప్పడానికి కొందరు ఇలాంటి ఎక్స్ ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ వైపు చూస్తారని పరిశీలనలు వివరిస్తున్నాయి.
ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం!
పరస్పరం ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడకపోవడం కూడా ఈ బంధాలకు కారణాల్లో ఒకటి. ఒకరి కోసం మరొకరు కనీస స్థాయిలో స్పందించకపోవడం చాలేమో ఆ బంధంలో పరస్పరం ఎలాంటి ఆసక్తి లేదని అర్థం చేసుకోవడానికి. దాంపత్యంలో ఇలాంటి కనెక్షనే ఏర్పడకపోతే.. పక్క చూపులకు ఆస్కారమే కాదు, అవే మేలనిపిస్తాయేమో!
ఫిజికల్ ఇంటిమసీ లేకపోవడం!
ఒకరికి బాగా ఆసక్తి ఉన్నా.. మరొకరు స్పందించకపోవడం, శారీరక స్పర్శ బహు తక్కువ కావడం కూడా ఇలాంటి పక్క చూపులకు కారణాల్లో ఒకటి. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో బిజీగా ఉండటం, లేదా భార్యభర్తల్లో ఎవరో ఒకరికి శారీరకంగానో, మానసికంగానో శృంగారం పట్ల అనాసక్తిని చూపడం కూడా వివహేతర సంబంధాలకు ఒక కారణం కావొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇక్కడ శృంగారం అంటే కలయికే కాదు, తరచూ ఒకరిస్పర్శ మరొకరికి తగలడం కూడా, దాన్ని యావ అంటూ కొంతమంది కొట్టిపారేయొచ్చు. ఆ యావ అనేది ధీర్ఘకాలం కొనసాగాల్సిన అవసరం ఉందని, అది వైవాహిక జీవితాన్ని కాపాడుతుందని అధ్యయనాలు వివరిస్తున్నాయి.