ఛీ.. ఛీ.. రాజకీయ నాయకులు ఇంత నిస్సిగ్గుగా మాట్లాడతారా.? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. 'ఆల్రెడీ అలవాటైపోయిన వ్యవహారమే ఇది..' అని కొందరు సరిపెట్టుకుంటున్నారు. ఏం చేస్తాం.? వ్యవస్థ అలా తయారయ్యిందంతే. ఓ మహిళా ఎమ్మెల్యే 'నన్ను ఎవరూ ఏమీ చేయలేరు.. ఇంతకన్నా ఏం చేస్తారా.? మహా అయితే రేప్ చేస్తారంతే.. అంత దమ్ముందా ఎవరికైనా..' అని అంటోంటే, సిగ్గుతో బిక్క చచ్చిపోయింది మహిళా లోకం.
ఇప్పుడేమో ఓ కేంద్ర మంత్రి, 'నా పంచెలో ఏముంది చూడ్డానికి.. నా పంచె మీద అంత శ్రద్ధ ఏంటి.? వాళ్ళకి లేవా పంచెలు.. అందులో ఏముందో వారికి తెలియదా.?' అంటూ ప్రెస్మీట్లో విరుచుకుపడితే, ఇంకోసారి దేశమంతా సిగ్గుతో బిక్కచచ్చిపోవాల్సి వచ్చింది. రాజకీయాల్లో విమర్శలకు, ప్రతి విమర్శలే సమాధానం అనుకుంటే ఎలా.? కాస్తంత విజ్ఞత వుండాలి కదా.!
కొత్త తరం రాజకీయ నాయకులు నోటికెలా వస్తే అలా మాట్లాడేస్తారు.. కమ్యూనిస్టులూ ఈ విషయంలో హద్దులు దాటేస్తున్నారు.. సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకోగానే సరిపోతుందా.? విజ్ఞత అవసరం లేదా.? విలువలు, నిబద్ధత గురించి మాట్లాడే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, అంత జుగుప్సాకరంగా ఎలా మాట్లాడగలిగారో ఏమో.!
ఇక, వెంకయ్య అంతలా విరుచుకుపడిపోయేసరికి, ఆయనపై 'పంచె' ఆరోపణలు చేసిన నారాయణ కూడా గుస్సా అయ్యారు. ఇంకో అడుగు ముందుకేశారు. 'పంచెలో ఏదో మూట వుందనీ, అది ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తారనీ అనుకున్నాం.. చివరికి వెంకయ్య పంచెలో ఏమీ లేదని తేలిపోయింది..' అంటూ మరో 'బూతు' డైలాగ్‌ని పేల్చారు నారాయణ. కౌంటర్‌కి ఎన్కౌంటర్ సరిపోయింది.. సెటైర్‌కి రిటార్ట్ సరిపోయింది. కానీ, ప్రజలు గమనిస్తున్నారు కదా.! మహిళా లోకం కూడా టీవీల్ని తిలకిస్తారు కదా.! ఇలాంటి రాజకీయ నాయకులు మన ప్రజాస్వామ్యంలో వర్ధిల్లుతోంటే, నైతిక విలువ గురించి మాట్లాడుకోవడమే మహా పాపం అయిపోతోంది.