ఎమ్బీయస్‌: గాయని ముబారక్‌ బేగమ్‌

శీర్షిక చూసి సినిమా ప్రియులు కూడా 'ఎవరండీ యీవిడ?' అని అడిగినా నేను ఆశ్చర్యపోను. ఆవిడ హిందీసినిమాల్లో కొన్ని మంచి పాటలు పాడింది. మంచి వాయిస్‌. హిందూస్తానీ శాస్త్రీయసంగీతం వచ్చు. పెద్ద సంగీతదర్శకులకు కూడా…

శీర్షిక చూసి సినిమా ప్రియులు కూడా 'ఎవరండీ యీవిడ?' అని అడిగినా నేను ఆశ్చర్యపోను. ఆవిడ హిందీసినిమాల్లో కొన్ని మంచి పాటలు పాడింది. మంచి వాయిస్‌. హిందూస్తానీ శాస్త్రీయసంగీతం వచ్చు. పెద్ద సంగీతదర్శకులకు కూడా పాడింది. అయినా పైకి రాలేదు. కారణం లతా మంగేష్కర్‌ అని అంటారు. ఏ రంగంలోనైనా పైకి రాలేకపోయిన ప్రతీ వ్యక్తి తమను టాప్‌ పొజిషన్లో వున్నవారు తొక్కేశారనీ వాపోవడం కద్దు. కానీ లతాపై యిలాటి ఆరోపణలు గట్టిగా వున్నాయి. లతా చాలా ప్రతిభావంతురాలు. కష్టపడి పైకి వచ్చింది. అతి త్వరగానే గుర్తింపు తెచ్చుకుంది. హిందీ సినిమా సంగీతసీమను ఏలిన స్వరసామ్రాజ్ఞి అయింది. పేచీ వస్తే ఎంత పెద్ద మ్యూజిక్‌ డైరక్టరైనా సరే, ఎంత పెద్ద సహగాయకి లేదా గాయకుడైనా 'నేను మీతో కలిసి పనిచేయను' అని చెప్పేసేది. అవతలివాళ్లే దిగివచ్చేవారు. ఒక్క ఒపి నయ్యర్‌ మాత్రమే ఖాతరు చేయలేదు. తక్కినవాళ్లందరూ ఆమె చెప్పినట్లు ఆడేరు, రాజ్‌ కపూర్‌ వంటి పెద్ద దర్శకనిర్మాత కూడా! తనకు పోటీగా గాయని ఎవరైనా ఎదుగుతున్నారు అనగానే 'వాళ్ల చేత ఒక్క పాట పాడించినా, నేను మళ్లీ మీకు ఎప్పటికీ పాడనంతే' అని బెదిరిస్తే చాలు వాళ్లు వణికిపోయేవారు. అవతలి గాయని పాటను తీసేసి, మళ్లీ యీమె చేత పాడించేవారు. లతా కారణంగా అవకాశాలు రాక దెబ్బ తిన్న గాయనీమణుల జాబితాలో సుమన్‌ కళ్యాణ్‌పుర్‌, సుధా మల్‌హోత్రా, సులక్షణా పండిట్‌, రూనా లైలా.. యిలా చాలామంది వున్నారు. వారిలోనే ముబారక్‌ బేగమ్‌ కూడా వుంది. అందువలన ఆమె మొత్తం మీద 200 పాటలు మాత్రమే పాడగలిగింది. కళాకారుడు అనామకంగా జీవించేకాలంలో ఆదరించకపోయినా, ఆర్థిక సాయం చేయకపోయినా చనిపోయిన తర్వాత మాత్రం 'ఆహా, ఓహో, ఫలానావారు లేని లోటు తీర్చలేనిది' అంటూ పత్రికల్లో వ్యాసాలు, నివాళి వస్తూ వుంటాయి. ''ప్యాసా''లో చెప్పి(పాడి)నట్లు మనది ''మురదాపరస్తోంకి బస్తీ'' (చనిపోయినవాళ్లను పట్టుకుని వేళ్లాడే నగరం). కానీ జులై 18న ముబారక్‌ బేగమ్‌ పోతే అది కూడా జరగలేదు. తెలుగు పత్రికలలో, టీవీల్లో దాదాపు విస్మరించారు. అందుకే ఆవిడ గురించి సంక్షిప్తంగానైనా పరిచయం చేయాలనిపించింది. 

లతాకు, రఫీకి ఎందుకు గొడవ వచ్చిందంటే – 1960లలో గాయనీగాయకులకు పాటలపై రాయల్టీ యివ్వాలని లతా ఉద్యమం లేవదీసింది. టాప్‌ మేల్‌ సింగర్‌గా వున్న రఫీ కూడా తనతో కలిసి వస్తే నిర్మాతలు దిగి వస్తారని ఆశించింది. రిస్కు తీసుకుని, తమపై, సంగీతకారుడిపై, సాహిత్యకారుడిపై పెట్టుబడే పెట్టే నిర్మాతకు మాత్రమే సినిమాపై కాని, పాటపై కాని హక్కు, రాయల్టీ రావాలి తప్ప తక్కినవారికి కాదని రఫీ వాదన. పాడిన పాటకు పారితోషికం తీసుకున్నాక యిక రాయల్టీ ఎలా అడుగుతాం అన్నాడు. అది లతాకు నచ్చలేదు. తనతో కలిసి రాలేదని రఫీతో పాటలు పాడనంది. వాళ్లిద్దరూ కలిసి కొంతకాలం పాటలు పాడలేదు. ఆ రోజుల్లో లతాతో యితర మేల్‌ సింగర్స్‌, రఫీతో యితర ఫిమేల్‌ సింగర్స్‌ మంచి మంచి పాటలు పాడారు. కానీ రఫీ-లతా అంత మ్యేజిక్‌ వర్కవుట్‌ కావటం లేదని ఫీలైన నిర్మాతలు, సంగీతదర్శకులు వారిద్దరి మధ్య రాజీ కుదిర్చి మళ్లీ పాడించారు. గాయనీగాయకులకు రాయల్టీ యిస్తామని ఒప్పుకున్నారు. ఆ విధంగా లతా విజయం సాధించింది. 

రఫీతో తన వివాదం గురించి చెపుతూ లతా యిటీవల ఒక యింటర్వ్యూలో ''నా రాయల్టీ ఉద్యమాన్ని వ్యతిరేకించమని రఫీసాబ్‌కు ఎవరూ నూరిపోశారు. ఓ సారి ఓ సమావేశంలో 'మీ అభిప్రాయం చెప్పండి' అని రఫీసాబ్‌ను అడిగితే ఆయన ముకేశ్‌ కేసి తిరికి 'మనమేం చెప్పాలో యీ మహారాణియే చెపుతుంది కాబోలు' అన్నారు. దాంతో నాకు కోపం వచ్చింది. అంతలో ఆయనే 'నేను యీవిడతో కలిసి పాడను' అన్నారు. అప్పుడు నేను 'అంత కష్టం మీకెందుకు లెండి. నేనే మీతో పాడను' అన్నాను.'' అని చెప్పుకుంది. 'మహారాణి' అని వెక్కిరించిన తర్వాత యీవిడేమందో చెప్పలేదు. ఏమీ లేకుండా 'నేను యీవిడతో కలిసి పాడను' అని సహజంగా మృదుస్వభావి, మృదుభాషి ఐన రఫీ అని వుంటారా? 'గొడవ ఎలా చల్లారింది?' అనే ప్రశ్నకు జవాబుగా 'శంకర్‌ జైకిషన్‌లు రాజీ కుదర్చడానికి వచ్చినపుడు ఆ మీటింగులో తనన్న మాటను వెనక్కి తీసుకుంటున్నానని రఫీసాబ్‌ చేత ఉత్తరం రాయించి యిస్తేనే మళ్లీ పాడతానని చెప్పాను.' అని చెప్పుకుంది. ఈ ఉత్తరం గొడవ యింతముందు చెప్పినట్లు లేదు. వాస్తవాలు నిర్ధారించడానికి రఫీ జీవించి లేరు. 

ఏది ఏమైతేనేం రఫీ-లతా గొడవల సమయంలోనే ''నాదీ అడజన్మే''కు హిందీ వెర్షన్‌ ఐన ''మై భీ లడ్కీ హూఁ'' (1964)లో లతాతో పాటు పాడే ఛాన్సు పిబి శ్రీనివాస్‌కు వచ్చింది. ''సంగమ్‌'' (1964)లో 'హర్‌ దిల్‌ జో ప్యార్‌ కరేగా' పాటలో లతా, ముకేశ్‌లతో బాటు రాజేంద్రకుమార్‌కు పాడే ఛాన్సు మహేంద్ర కపూర్‌కు వచ్చింది. రఫీతో ''మనసే మందిరం'' రీమేక్‌ అయిన ''దిల్‌ ఏక్‌ మందిర్‌'' (1963) లో టైటిల్‌ సాంగ్‌, ''ఏప్రిల్‌ ఫూల్‌'' (1964)లో 'తుఝే ప్యార్‌ కర్‌తే హైఁ, కర్‌తే రహేంగే' పాట, ''జీ చాహతా హై'' (1964)లో టైటిల్‌ సాంగ్‌, ''రాజ్‌కుమార్‌'' (1964)లో 'తుమ్‌నే పుకారా, హమ్‌ చలే ఆయే' అనే పాట, ''సాంర్‌­ ఔర్‌ సవేరా'' (1964)లో 'ఆజున్‌ నా ఆయే బాల్‌మా, సావన్‌ బీతా జాయ్‌' పాట, ''జబ్‌ జబ్‌ ఫూల్‌ ఖిలే'' (1965)లో 'నా నా కర్‌తే ప్యార్‌ తుమ్హీసే కర్‌ బైఠే' పాట, ''దిల్‌నే ఫిర్‌ యాద్‌ కియా'' (1966) టైటిల్‌ సాంగ్‌, యివన్నీ పాడే అవకాశం సుమన్‌ కల్యాణ్‌పుర్‌కు వచ్చింది. రఫీ, లతా రాజీ పడ్డాక కూడా ఆమెకు  వచ్చిన మంచి పాటల్లో కొన్ని – ''ఛోటీసీ ములాకాత్‌'' (1967) 'తుఝే దేఖా తుఝే చాహా' పాట, ''పాల్కీ'' (1967)లో 'దిల్‌ ఏ బేతాబ్‌ కో సీనేసే లగానా హోగా' పాట, ''బ్రహ్మచారి'' (1968)లో ''ఆజ్‌కల్‌ తేరేమేరే ప్యార్‌ కే చర్‌చే హర్‌ జుబాన్‌ పర్‌' పాట. ''జిగ్రీ దోస్త్‌''(1969) లో 'రాత్‌ సుహానీ జాగ్‌ రహీ హై'! ఆమె పాట వింటూ వుంటే లతాయే పాడిందేమో అనుకోవాలి. అందుకే తనను లతా, ఆశా కలిసి తొక్కేశారని ఆమె ఆరోపించింది. తన తర్వాత ఎవరికైనా ఛాన్సు రావాలంటే తన చెల్లెలు ఆశాకు తప్ప వేరేవారికి రాకూడదు అని లతా పట్టుబట్టేదని ఆవిడ బహిరంగంగా చెప్పింది. సుమన్‌ కళ్యాణ్‌పుర్‌ గొంతు అచ్చు లతాలా వుండడం వలన పైకి రాలేకపోయిందని, ఒరిజినల్‌ వుండగా డూప్లికేట్‌ను ఎవరు ఆదరిస్తారని సంజాయిషీ చెప్పేవాళ్లున్నారు. కానీ ముబారక్‌ బేగమ్‌ విషయంలో ఆ మాట అనడానికి లేదు. ఆమె వాయిస్‌ వీరెవరినీ పోలి వుండదు. ఆమె పాడిన రెండు మంచి పాటల లింకులు కింద యిస్తున్నాను. గమనించండి.

https://www.youtube.com/watch?v=6yAz8tk0CKg

https://www.youtube.com/watch?v=rpYFab53aqM

ముబారక్‌ బేగం వయసు కచ్చితంగా తెలియదు. 76 పైన 80కి లోపు వుండవచ్చు. రాజస్థాన్‌లోని ఝున్‌ఝనులో పుట్టింది. పేద కుటుంబం. ఆమె తండ్రికి కూడా హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం తెలుసు. అయినా అన్నగారితో కలిసి పళ్ల వ్యాపారం చేసేవాడు. రాజస్థాన్‌ నుంచి అహ్మదాబాద్‌కి వచ్చేసి, అక్కడ  వ్యాపారం చేసేవాడు. ముబారక్‌ బేగం అక్కడే పెరిగింది. సినిమాలకు తీసుకెళితే హీరోయిన్ల పాటలు నేర్చుకుని పాడేసేది. సురయ్యాను చూసి సింపుల్‌గా, సునాయాసంగా పాడడం ప్రాక్టీసు చేసింది. ఆమెలో టాలెంటు వుందని గమనించిన తండ్రి, తను కాలేకపోయినా కూతురైనా గాయని కావాలనే లక్ష్యంతో రియాజుద్దీన్‌ ఖాన్‌ వద్ద శాస్త్రీయసంగీతం నేర్పించాడు. సినిమాల్లో పాడాలంటే లలిత సంగీతం బాగా వచ్చి వుంటే మంచిదనుకుని ఆలిండియా రేడియోలో ప్రయత్నించాడు. ఘజల్స్‌ పాడే అవకాశం వచ్చింది. రఫీక్‌ ఘజనవీ అనే సినీసంగీత దర్శకుడు రేడియోలో ఆమె వాయిస్‌ విని సినిమాలో అవకాశం యిస్తాను బొంబాయి తీసుకుని రమ్మనమన్నాడు. బాగా చిన్నపిల్ల కావడం చేత ముబారక్‌కు మైకు చూస్తే భయం వేసింది. సరిగ్గా పాడలేకపోయింది. అయినా ఆమె తండ్రి బొంబాయికి మకాం మార్చి అనేకమంది సంగీతదర్శకుల వద్దకు తీసుకెళ్లాడు. ఎస్‌డి బర్మన్‌ వద్దకు వెళితే 'నీ వాయిస్‌ పాగా పాలిష్‌ చేసుకుని రామ్మా' అన్నాడు. శ్యామ్‌ సుందర్‌ అనే ప్రఖ్యాత సంగీతదర్శకుడు ఆమెకు రెండో ఛాన్సు యిచ్చాడు. అక్కడా అదే కథ రిపీటైంది. రిహార్సల్స్‌లో బాగా పాడడం, ఫైనల్‌ టేక్‌ వచ్చేసరికి భయపడి చెడగొట్టడం.  మూడో ఛాన్సు యిచ్చిన షౌకత్‌ దెహ్లవి ''ఆయియే''లో ఒక పాట పాడించి ఆమె భయాన్ని పోగొట్టాడు. దాంతో ఆమె ఆత్మవిశ్వాసం పెరిగింది. కానీ అవకాశాలు రాలేదు.

చివరకు ప్రఖ్యాత దర్శకుడు కెమాల్‌ అమ్రోహి తీసిన ''దాయిరా'' (1953)లో జమాల్‌ సేన్‌ సంగీతదర్శకత్వంలో ఆమెకు పాడే అవకాశం వచ్చింది. చాలా చక్కగా పాడడంతో ఏడు పాటలు యిచ్చారు. ''దేవ్‌తా తుమ్‌హో మేరా సహారా'' అనే భజనను రఫీతో కలిసి పాడింది. దురదృష్టం, సినిమా ఫెయిలయింది. పాటలకు పెద్ద గుర్తింపు రాలేదు. ఆమెకు మైకు భయం పోయింది కానీ పిరికితనం, సిగ్గు పోలేదు. ఆ సినిమా విడుదలయ్యాక అమీన్‌ సయానీ రేడియోలో యింటర్వ్యూ చేస్తానని ముందుకు వస్తే ''నాకు మాట్లాడడం రాదు.  నా బదులు మా చెల్లెలు విజయబాల మాట్లాడుతుంది. మధ్యలో పాటలు పాడాల్సివచ్చినపుడు నేను పాడతాను.'' అంది. ఇంటర్వ్యూ అలాగే సాగింది. అవకాశాల వేటలో మళ్లీ ఎస్‌డి బర్మన్‌ వద్దకు వెళ్లింది. ఆమె పాటలు అప్పటికే విన్న బర్మన్‌ తను పనిచేస్తున్న బిమల్‌ రాయ్‌ ''దేవదాసు'' (1955)లో 'వో నా ఆయేంగే పలట్‌కర్‌, ఉన్హే లాఖ్‌ హమ్‌ బులాయే' అనే రెండు లైన్ల గేయాన్ని పాడమన్నాడు. ఈమె పాడిన తీరు చూసి నచ్చి, ఆ గేయాన్ని పూర్తి స్థాయి పాటగా పెంచారు. సినిమా హిట్‌ కావడంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. దాని తర్వాత సలిల్‌ చౌధురి సంగీతదర్శకత్వంలో తను తీసిన ''మధుమతి'' (1958)లో 'హాల్‌-ఎ-దిల్‌ సునాయేంగే' పాట పాడే అవకాశం కూడా బిమల్‌ రాయ్‌ యిచ్చాడు.

ఆమెకు టాలెంటు వున్నా అవకాశాలు వచ్చేవి కావు. సుమన్‌ కళ్యాణ్‌పుర్‌ అంత ఓపెన్‌గా ముబారక్‌ బేగం ఎప్పుడూ మాట్లాడలేదు కానీ దారిద్య్రం, అనారోగ్యం చుట్టుముట్టిన అంత్యదశలో మాత్రం 'వాళ్లు (పేరు చెప్పేది కాదు) కావాలని నా పాట చెడగొట్టేవారు. నేను రిహార్సల్‌ చేస్తూ వుంటే, రికార్డు చేస్తూ వుంటే కావాలని నవ్వి ఏకాగ్రత చెడగొట్టేవారు. టేకు సరిగ్గా రాలేదని చెప్పి నన్ను పంపించేశాక వచ్చి పాడేవారు. గీతా దత్‌ మాత్రం ఏ గాయని పట్ల యిలా ప్రవర్తించేది కాదు.' అని చెప్పింది. అప్పట్లో టాప్‌లో వున్నది లతా, ఆశా, గీతాయే. ''ఓసారి నాకు ఫోన్‌ వచ్చింది. 'నేను తలచుకుంటే నిన్ను యిండస్ట్రీలోంచి తోసి అవతల పారేయగలను' అని చెప్పారు. 'ఎవరు మీరు' అన్నాను. అప్పుడు అవతలి వ్యక్తి విరగబడి నవ్వుతూ తన పేరు చెప్పింది. ఓ ఏడాది రంజాన్‌ మాసం నడుస్తూండగా నాకు ఓ కవర్లో రూ. 500 రూ||లు పెట్టి పంపించారు. కవరు మీద అగ్రశ్రేణి గాయని పేరుంది. రంజాన్‌లో పేదలకు యిచ్చే జకాత్‌లా తోచి, ఆమెకు ఫోన్‌ చేశాను. ఆమె సోదరి ఫోన్‌ తీసింది. ''మీరు నాకు సాయం చేద్దామనుకుంటే అంతకంటె ఎక్కువే పంపాల్సింది'' అన్నాను. ''మా ఖర్చులు మాకే సరిపోవటం లేదు'' అందామె.'' అని ముబారక్‌ చెప్పుకొచ్చింది.

కిదార్‌ శర్మ అనే ప్రఖ్యాత దర్శకనిర్మాత ''జవాన్‌ మొహబ్బత్‌'' అనే సినిమా తీస్తూ ముబారక్‌ చేత 'కభీ తన్‌హాయియోం మేఁ యూఁ హమారీ యాద్‌ ఆయేగీ' అనే పాట పాడించారు. ఆ పాట రికార్డింగు జరుగుతూన్నంత సేపు ఆయన కళ్లు మూసుకుని వింటూ వున్నాడు. దానిని నేపథ్యగీతంగా చిత్రీకరిద్దామనుకున్న ఆలోచన మార్చుకుని హీరోయిన్‌పై చిత్రీకరించాడు. అంతేకాదు, సినిమా పేరును కూడా ''హమారీ యాద్‌ ఆయేగీ' అని మార్చేశాడు. పాట పూర్తవగానే ముబారక్‌కు బహుమతిగా పావలా యిచ్చాడు. తీసుకోవడానికి ఆమె వెనకాడుతూండగా సంగీతదర్శకుడు స్నేహల్‌ భాట్కర్‌ 'తీసుకో, ఆయన చేతుల మీదుగా బహుమతి తీసుకున్నవారందరూ పేరు ప్రఖ్యాతులు సంపాదించారు' అన్నాడు. ముబారక్‌కు రావలసినంత పేరు రాకపోయినా, ఆ పాట మాత్రం హిందీ పాటల్లో ముఖ్యమైన పాటగా చరిత్రలో మిగిలిపోయింది. పైన యిచ్చిన లింకుల్లో ఒక పాట అదే. 

రెండో పాట మన ''భార్యాభర్తలు'' హిందీ రీమేక్‌ అయిన ''హమ్‌రాహీ'' (1963) సినిమాలోని టైటిల్‌ సాంగ్‌, 'ముర్‌­కో అప్‌నే గలే లగాలో' రాజేంద్రకుమార్‌ సరసన నటించిన తెలుగు నటి జమునకు ప్లేబ్యాక్‌ పాడింది. అప్పట్లో ఎయన్నార్‌, ఎన్టీయార్‌లతో పేచీ వలన జమున హిందీరంగంలో నటించారు. రఫీకి, లతాకు మధ్య వచ్చిన పేచీ వలన లతాకు బదులు ముబారక్‌ పాడారు. చాలా అందమైన పాట. సినిమా కూడా హిట్‌. తక్కినవేవీ వినకపోయినా యిది ఒక్కటీ విన్నా, యిలాటి గాయనికి అవకాశాలు ఎందుకు రాలేదన్న సందేహం వచ్చి తీరుతుంది. ఆమె చేత ఒక పాట పాడించినా తను వూరుకోనని లతా బెదిరించిందని అంటారు. రికార్డు చేయించిన పాటలు కూడా తీయించేసిందని ఆరోపణలున్నాయి. నిజానిజాలు వారే చెప్పాలి. ఏమైతేనేం, రోజూ సాధన చేస్తూ గాత్రాన్ని బాగా వుంచుకున్నా, ముబారక్‌కు అవకాశాలు రాలేదు. ప్రైవేటుగా ఘజల్స్‌ పాడింది కానీ ఆదాయం పెద్దగా లేదు. డిప్రెషన్‌లోకి వెళ్లి నిద్రమాత్రలు వేసుకోసాగింది. వెన్ను నెప్పి బాధించింది. అప్పుడప్పుడు స్టేజిషోలు యిచ్చింది. ఎచ్‌ఎమ్‌వి వారు రాయల్టీ కూడా యివ్వలేదంటుంది. దరిద్రంలోనే బతికింది. ఆమె చివరి దశలో జావేద్‌ అఖ్తర్‌ కళాకారుల కోటాలో ముంబయి శివారు జోగేశ్వరిలో ఆమెకో ఫ్లాట్‌ యిప్పించాడు. నెలకు 1500 పెన్షన్‌ వచ్చేది. చివర్లో దాన్ని 3 వేలు చేశారు. కొడుకు ప్రయివేటు టాక్సీ నడుపుతాడు. కూతురికి పార్కిన్‌సన్స్‌ డిసీజ్‌. కూడా కలిసి రాలేదు. చివరకు దాదాపు అనామకంగానే పోయింది పాపం.  

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2016)

[email protected]