2014 ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ స్టాండ్‌లో ఏ మాత్రం మార్పు లేదు. ఎన్నికలకు ముందు ఏదో చెప్పారు. వాళ్ళంతా ఆనాటి బీజేపీ నేతలు. ఇప్పుడు నేటి బీజేపీ నేతలు. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా. గతం గతః ఏరు దాటాక తెప్ప తగలేసేశారు. ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ నుంచి ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఆశించడానికేమీ లేదు. పాత విషయాల్నీ ఆశించడానికి వీల్లేదు.
కేంద్రం చెప్పాలనుకున్నది ఇదివరకే చెప్పింది. పార్లమెంటులో పలుమార్లు చెప్పారు. పాడిందే పాటరా పాచి పళ్ళ దాసుడా.. ఇంతే. ఇంతకు మించి, ఇంకేమీ లేదు. విభజన చట్టాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తాం.. అన్న మాట తప్ప, ఇంకో మాట కొత్తగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నోట రాలేదు. నిన్న రాత్రి నుంచీ నానా హంగామా జరిగింది. ఢిల్లీలో కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, వెంకయ్యనాయుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
లక్షన్నర కోట్ల రూపాయల ప్యాకేజీ.. తుస్సుమంది. పచ్చ మీడియా ప్రచారమంతా చంద్రబాబు మెప్పు కోసమేనని తేలిపోయింది. మొత్తంగా ఈ రోజు ఏదో జరిగిపోతుందని ఎదురు చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని వెర్రి వెంగళప్పల్ని చేసింది కేంద్రం. కేంద్రంతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీకి కూడా ఈ పాపంలో భాగం వుంది.
పూర్వకాలంలో హత్యలు అత్యంత క్రూరంగా జరిగేవి. హత్యలు కావవి, చేసిన నేరానికి శిక్షలు. అతి క్రూరంగా, అతి కిరాతకంగా.. ఆ నాటి హత్యలకు సంబంధించి ఆధారాలు ఇప్పటికీ వెలుగు చూస్తూనే వుంటాయి. వాటి గురించి చదివితేనే అత్యంత జుగుప్సాకరంగా.. భయంకరంగా వుంటుంది. సేమ్ టు సేమ్.. ఆంధ్రప్రదేశ్‌ని కూడా అలాగే చంపేస్తున్నారు. విభజించి చంపేస్తే ఏముంటుంది కిక్కు.? అను నిత్యం మోసం చేస్తూ, చిత్ర హింసలకు గురిచేస్తూ చంపేద్దామన్న కోణంలో కేంద్రం ఆలోచన చేస్తోందని అరుణ్ జైట్లీ ప్రకటనతో తేలిపోయింది.
ప్రత్యేక హోదా అనేది న్యాయబద్ధమైన కోరికే.. కానీ, ప్రత్యేక హోదా ఇవ్వం. ఆ స్థాయిలో ప్రత్యేక సాయం అందిస్తాం.. అని సెలవిచ్చారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. పచ్చిగా చెప్పాలంటే, పెళ్ళి చేసుకోను.. కానీ, ఉంపుడుగత్తెగా ఉంచుకుని.. భార్యలా చూసుకుంటాను.. అన్నాడట వెనకటికి ఒకడు. ఆంధ్రప్రదేశ్‌ని కేంద్రం ఇప్పుడు ఉంపుడుగత్తెలా చూస్తోందనుకోవాలా.? హోదాతో సమానంగా.. అన్నప్పుడు హోదా అనే గౌరవం ఎందుకు ఇవ్వలేకపోతున్నారట.!
పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా కేంద్రమే చేపడ్తుందన్నదొక్కటీ స్పష్టమైన ప్రకటన అరుణ్ జైట్లీ నోట వచ్చింది. అఫ్కోర్స్.. ఇది విభజన చట్టంలో వున్నదే. ఇంతకీ, ఉదయం నుంచీ జరిగిన హంగామా మాటేమిటి.? కొండను తవ్వి ఎలకను పట్టడం కాదు.. అసలు ఏమీ పట్టుకోలేదు. జస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇంకోసారి ఫూల్స్‌ని చేశారంతే.